పదవీ విరమణ పెంపుతో పోలీస్‌ శాఖలో వింత పరిస్థితి  | Retirement Age Raised in Telangana: Typical Situation in Police Department | Sakshi
Sakshi News home page

ఇటు మోదం.. అటు ఖేదం! 

Published Thu, Mar 25 2021 6:01 PM | Last Updated on Thu, Mar 25 2021 6:01 PM

Retirement Age Raised in Telangana: Typical Situation in Police Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం కురిపించిన వరాల జల్లుతో సర్కారు కొలువు చేసుకునే వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖలో ఓవైపు పదోన్నతులు, మరోవైపు 30 శాతం ఫిట్‌మెంట్‌ పెంపు.. అన్నింటి కంటే ముఖ్యంగా రిటైర్మెంట్‌ వయోపరిమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 80 వేలమంది సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు. అదేసమయంలో పోలీసు శాఖ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయంతో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. పోలీసు శాఖ అదనపు ఎస్పీ నుంచి నాన్‌కేడర్‌ ఎస్పీలుగా 52 మందికి పదోన్నతి కల్పించేందుకు తాజాగా చర్యలు తీసుకుంది. అలాగే మొత్తం 26 మంది నాన్‌కేడర్‌ ఎస్పీలకు ఐపీఎస్‌హోదా కల్పించాలని నిర్ణయించింది. దీనికి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. 

ఈ క్రమంలో నేడోరేపో ఐపీఎస్‌ హోదా లభించే ఈ 26 మంది నాన్‌కేడర్‌ ఎస్పీల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఐపీఎస్‌ నిబంధనల ప్రకారం.. రిటైర్‌మెంట్‌ వయసు 60 ఏళ్లు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వీరికి ఐపీఎస్‌ హోదా దక్కితే రెండేళ్లు అదనంగా సర్వీసు దక్కేది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం..అది 58 నుంచి 61 ఏళ్లకు చేరుకుంది. ఆ లెక్కన ఈ 26 మంది ఒక ఏడాది ముందే రిటైర్‌ కానున్నారు. ఒకవేళ వీరికి ఐపీఎస్‌ కన్‌ఫర్మ్‌ కాకపోయినా.. మరో ఏడాది నాన్‌ కేడర్‌ ఎస్పీలుగా కొనసాగే అవకాశాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ఈనెలాఖరుకు ఒకే ఒక్క నాన్‌కేడర్‌ ఎస్పీ రిటైర్‌ కావాల్సి ఉంది.

 

రిటైర్మెంటుకు సరిగ్గా వారంరోజుల ముందు ప్రభుత్వం ఆయనకు వరుసపెట్టి శుభవార్తలు చెప్పింది. ఫిట్‌మెంట్‌ పెంపు, సర్వీసు పొడిగింపు ఇలా..! మొత్తానికి ఇవన్నీ పదవి నుంచి తప్పుకునే క్రమంలో తనకు దక్కిన అపూర్వ అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయనకు త్వరలోనే ఐపీఎస్‌ హోదా దక్కనుందని సమాచారం. ఇది ఆయనకు దక్కిన మూడో బోనస్‌. కాగా, డిపార్ట్‌మెంటులో ఏటా 2,000 మందివరకు రిటైర్‌ అవుతుంటారు. ఈ లెక్కన చూస్తే.. వీరందరికీ లాభం చేకూరినట్లే. మరో మూడేళ్ల వరకు అంటే 2024 మార్చి వరకు డిపార్ట్‌మెంటులో దాదాపుగా రిటైర్మెంట్లు అన్న మాటే వినిపించదు. ప్రభుత్వ ప్రకటనతో డిపార్ట్‌మెంటులో ఉన్న దాదాపు 80 వేల మంది సిబ్బంది సంతోషంగా ఉన్నారు.  

మూడువారాల్లో మూడేళ్ల సర్వీస్‌ మిస్‌..! 
పోలీసు శాఖలో మార్చి నెలాఖరునాటికి గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో దాదాపు 50 మంది, మిగిలిన జిల్లాల్లో దాదాపు 60 మంది వరకు అంటే మొత్తంగా 110 మంది రిటైర్‌ కావాల్సి ఉంది. కానీ, వీరందరికీ ఏకంగా మూడేళ్ల సర్వీసు, 30 శాతం ఫిట్‌మెంట్‌తో కలసివచ్చింది. అదే సమయంలో ఫిబ్రవరి 28న డిపార్ట్‌మెంటులో దాదాపు 100 మందికిపై పోలీసులు పదవీ విరమణ చేశారు. వయోపరిమితి పెంపు ప్రకటన వచ్చాక వీరంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కేవలం మూడువారాల వ్యవధిలో మూడేళ్ల సర్వీసు కోల్పోయామని నిర్వేదంలో పడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement