మంత్రి కేటీఆర్‌తో రోష్ ఫార్మా ఎండీ సింప్సన్
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యుత్తమ వాణిజ్య వాతావరణాన్ని అందించడంలో హైదరాబాద్ ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవవనరులతోపాటు అద్భుతమైన మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నాయన్నారు. వినూత్న డేటా ఆధారిత పరిష్కారాలను అందించే విధంగా హైదరాబాద్‌లో రోష్ ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ అనలిటిక్స్, టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ మేరకు రోష్ ఫార్మా ఎండీ, సీఈవో వి.సింప్సన్ ఎమాన్యుయెల్ సోమవారం కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచ దిగ్గజసంస్థలు హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ ఆవిష్కరణ, సామర్థ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. గేట్ ఏర్పాటు ద్వారా 2022 చివరి నాటికి వంద మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రోష్‌తో అనుసంధానమై పనిచేస్తున్న సంస్థలకు ఈ గేట్ అందజేస్తుంది. రోష్ ఫార్మా ఎండీ, కేటీఆర్ మధ్య జరిగిన భేటీలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment