TSRTC MD Sajjanar Launch TSRTC Gamyam App At MGBS Bus Station - Sakshi
Sakshi News home page

TSRTC Gamyam App: ఇక టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్

Published Sat, Aug 12 2023 7:13 PM | Last Updated on Sat, Aug 12 2023 7:49 PM

Sajjanar Launches TSRTC Bus Tracking App - Sakshi

హైదరాబాద్‌: సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మరో ముందుడుగు వేసింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సంస్థ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అందుకు అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. 

ఈ బస్ ట్రాకింగ్ యాప్‌నకు ‘గమ్యం’గా నామకరణం చేసింది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ ను శనివారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రారంభించారు. యాప్ సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుతూ టీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్దన్ గారికి కూడా సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని సంస్థ స్వాగతిస్తూ.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించగలమనే విశ్వాసం తనకుందన్నారు. 

రెండేళ్లుగా ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థను దగ్గర చేసేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని, ప్రతి రోజు 45 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న సంస్థ మార్కెట్ లోని పోటీని దీటుగా ఎదుర్కోనేందుకు ఈ మధ్యకాలంలో అత్యాధునిక హంగులతో కూడిన 776 కొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. 

ఆపై యాప్ ప్రయోజనాలను వివరిస్తూ అరచేతిలో స్మార్ట్  ఫోన్ ఉంటే.. టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారన్నంతా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇకపై బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో అని వేచిచూడాల్సిన అవసరం లేదని, అత్యాధునిక ఫీచర్లు గల ‘గమ్యం’ యాప్ తో ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. 

“ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. హైదరాబాద్ లోని పుష్ఫక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అదే విధంగా జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించబడింది. అక్టోబర్ నెల నుంచి మిగతా సర్వీసులన్నింటికీ ట్రాకింగ్ సదుపాయాన్ని అనుసంధానం చేయబోతున్నాం.

‘గమ్యం’ యాప్ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ఏఏ బస్సులు ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో పసిగట్టొచ్చు. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా సమీపంలోని బస్టాప్ లను తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ తెలిపారు.
 
మహిళా భద్రతకు ‘ప్లాగ్ ఏ బస్’ ఫీచర్
మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తోన్న టీఎస్ఆర్టీసీ.. వారి సౌకర్యార్థం గమ్యం యాప్ లో ‘ప్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాత్రి వేళల్లో బస్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. 

రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్లాగ్ ఏ బస్ ఫీచర్ బస్ అందుబాటులో ఉంటుంది. యాప్ లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ పై ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్ ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. 

అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్ ను అనుసంధానం చేయడం జరిగింది. ఈ సదుపాయంతో యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.

యాప్ను డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..
'TSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

ఉచితంగా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. గమ్యం యాప్ ను ప్రజలందరూ తమ స్మార్ట్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవాలి. 

ఇప్పటికే ఇన్ స్టాల్ చేసుకుంటే అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆదరించి, ప్రోత్సహించారు. సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చిన  ఈ యాప్ ను అలానే ఆదరించాలని సంస్థ కోరుతోంది. ఈ యాప్ పై ఫీడ్ బ్యాక్ ను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. 

గమ్యం యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఇ.డి (హైదరాబాద్ జోన్)  శ్రీ ఎ.పురుషోత్తం, ఇ.డి (ఎ) కె.కృష్ణకాంత్,  ఇ.డి (గ్రేటర్ హైదరాబాద్)  వి.వెంకటేశ్వర్లు,  జెడి (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ పాటిల్,  డిజిటల్ ఐటీ కన్సల్టెంట్ శ్రీమతి దీపా కోడూర్, మ్యాప్ మై ఇండియా (ఎం.ఎం.ఐ) హర్మన్ సింగ్ అరోరా, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ శ్రీమతి విజయ పుష్ప, సి.ఇ (ఐటీ) శ్రీ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్.ఎం. శ్రీధర్, తదితర అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement