కరెంట్‌ ఆదా చేస్తే కాసులొస్తాయ్‌! | Save Electricity, Water And Earn Money: Telangana Government New Scheme | Sakshi
Sakshi News home page

కరెంట్‌ ఆదా చేస్తే కాసులొస్తాయ్‌!

Published Mon, Aug 23 2021 1:56 AM | Last Updated on Mon, Aug 23 2021 11:52 AM

Save Electricity, Water And Earn Money: Telangana Government New Scheme - Sakshi

పథకం ఇదీ..
పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆరు  గ్రామీణ ఫీడర్ల పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఆ ఫీడర్ల పరిధిలోని రైతుల పంపుసెట్లకు ఏఎంఆర్‌ (ఆటోమేటిక్‌ మీటర్‌ రీడింగ్‌) మీటర్లను బిగించింది. పంపుసెట్ల సామర్థ్యం, పంటల సాగుకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని లెక్కించి.. ఒక నెలలో అవసరమయ్యే సగటు విద్యుత్‌ పరిమాణాన్ని నిర్ధారించింది. ఈ నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్‌ వినియోగిస్తే.. ఆదా చేసిన ఒక్కో యూనిట్‌ విద్యుత్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించింది. నిర్దేశించినపరిమాణం కన్నా అధికంగా విద్యుత్‌ వినియోగించుకున్నా ఎలాంటి చర్యలు ఉండవని రైతులకు భరోసా ఇచ్చింది. రెండేళ్లలో 4 వేల మంది రైతులు 9.68 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఆదాచేసి.. రూ.38.72 లక్షలు ప్రోత్సాహకంగా పొందారు.  

సాక్షి, హైదరాబాద్‌: ‘విద్యుత్‌ ఆదా చేయండి.. భూగర్భ జలాలను సంరక్షించండి.. ఆ మేర డబ్బులు పొందండి’ పంజాబ్‌ ప్రభుత్వం అమలు  చేస్తున్న సరికొత్త పథకం ఇది. చాలా మంది రైతులు నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్‌ను వాడి.. పొదుపు చేసిన విద్యుత్‌కు సంబంధించిన నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. పంజాబ్‌లో ఈ పథకం విజయ వంతంగా కొనసాగుతోందని.. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసింది. భూగర్భ జలాల పరిరక్షణతోపాటు విద్యుత్‌ పొదుపును ప్రోత్సహించడానికి దోహదపడుతుందని సూచించింది.  చదవండి: చలానా పెండింగ్‌ ఉంటే బండి సీజ్‌

వృథా అవుతుండటంతో.. 
పంజాబ్‌ రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో వరి, గోధుమ పంటల సాగు జరుగుతోంది. నీటి అవసరం అధికంగా ఉండే ఈ పంటల కోసం అక్కడి రైతులు.. పెద్ద మొత్తంలో భూగర్భ జలాలను, విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో.. రైతులు నిరంతరం మోటార్లు నడిపిస్తున్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. అవసరానికి మించి భూగర్భ జలాలను తోడుతుండడంతో.. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని.. మరోవైపు విద్యుత్‌ వృధా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా పంజాబ్‌ ప్రభుత్వం ‘పానీ బచావో.. పైసే కమావో’పథకాన్ని తెరపైకి తెచ్చింది. ప్రపంచబ్యాంక్‌ భాగస్వామ్యంతో మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ఆధ్వర్యంలోని ‘అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ (జే–పాల్‌)’ దీనికి రూపకల్పన చేసింది. 
 
పైలట్‌ ప్రాజెక్టుగా.. 
పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీఎస్‌పీసీఎల్‌) 2018లో ఆరు గ్రామీణ ఫీడర్ల పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని చేపట్టింది. ఆయా ఫీడర్ల పరిధిలోని రైతుల పంపుసెట్లకు ఏఎంఆర్‌ (ఆటోమేటిక్‌ మీటర్‌ రీడింగ్‌) మీటర్లను బిగించింది. పంపుసెట్ల సామర్థ్యం, పంటల సాగుకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని లెక్కించి.. ఒక నెలలో అవసరమయ్యే సగటు విద్యుత్‌ పరిమాణాన్ని నిర్ధారించింది. ఈ నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్‌ వినియోగిస్తే.. ఆదా చేసిన ఒక్కో యూనిట్‌ విద్యుత్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించింది. నిర్దేశించిన పరిమాణం కన్నా అధికంగా విద్యుత్‌ వినియోగించుకున్నా ఎలాంటి చర్యలు ఉండవని రైతులకు భరోసా ఇచ్చింది. చదవండి: డేంజర్‌ డెంగీ
 
4 వేల మంది రైతులు.. 

పంజాబ్‌ ప్రభుత్వం ప్రతి నెలా ఏ రైతు ఎంత విద్యుత్‌ ఆదా చేశారు, ఎంత సొమ్ము పొందుతున్నారన్న దానిపై ప్రతినెలా వారికి ఎస్‌ఎంఎస్‌లు పంపుతోంది. ఇప్పటివరకు పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్న 6 ఫీడర్ల పరిధిలో 4వేల మందికిపైగా రైతులు విద్యుత్‌ ఆదా చేసి ప్రోత్సాహకాలు పొందారు. 2018 నుంచి 2020 వరకు వారు ఏకంగా 9.68 లక్షల యూనిట్లు విద్యుత్‌ ఆదాచేసి.. రూ.38.72 లక్షలను ప్రోత్సాహకంగా అందుకున్నారు. ప్రోత్సాహకానికి అర్హత సాధించని ఇతర రైతులు కూడా భారీగానే విద్యుత్, భూగర్భ జలాలను పొదుపు చేసి ఉంటారని అధికారులు చెప్తున్నారు. 

పంజాబ్‌లో మొత్తం 5,900 గ్రామీణ ఫీడర్ల పరిధిలో 14.16 లక్షల బోరుబావులు ఉన్నాయి. దశలవారీగా అన్ని ఫీడర్ల పరిధిలో పథకాన్ని అమలు చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. దీర్ఘకాలికంగా దీని ఫలితాలు చాలా బాగుంటాయని, త్వరలోనే మరో 250 ఫీడర్ల పరిధిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించాయి. ఈ పథకం అమలుకు ‘ది ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టెరీ), పంజాబ్‌ వ్యవసాయ వర్సిటీ, ఐటీ పవర్‌ ఇండియా (ఐటీపీఐ)’సంస్థలు సహకారం అందిస్తున్నాయి. 
 
ఇక్కడా అమలు చేస్తే ప్రయోజనమే.. 
తెలంగాణలో 25.34 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ సరఫరా అవుతోంది. గతంలో వ్యవసాయానికి రోజుకు రెండు విడతల్లో ఆరేడు గంటల పాటు మాత్రమే సరఫరా ఉండేది. కానీ ఇప్పుడు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఇలా 24 గంటల సరఫరాతో వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ నాలుగు రేట్లు పెరిగిపోయిందని విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇటీవలే విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి నివేదించాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ తరహాలో మన రాష్ట్రంలోనూ పైలట్‌ ప్రాజెక్టును చేపట్టాలని.. ఫలితాలను బట్టి విస్తరించాలని విద్యుత్‌ రంగ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం రాష్ట్రానికి సరఫరా చేస్తున్న విద్యుత్‌లో మూడో వంతు వరకు వ్యవసాయానికే ఖర్చవుతోందని.. ఈ పథకాన్ని అమలు చేస్తే విద్యుత్‌తోపాటు భూగర్భ జలాలు ఆదా అవుతాయని చెప్తున్నారు. దీనివల్ల అటు కరెంటు సంస్థలు, ఇటు రైతులకు కూడా ప్రయోజనమని పేర్కొంటున్నారు. 
 
విద్యుత్, భూగర్భ జల వినియోగం తగ్గించుకోవాలి 
‘‘రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్, భూగర్భ జలాల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలాచోట్ల భూగర్భ జల మట్టాలు అడుగంటిపోయి బోరుబావుల్లో నీళ్లు రావడం లేదు. విచ్చలవిడి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు కొత్తసాగు పద్దతులు, విధానాల పట్ల అవగాహన కల్పించాలి. విద్యుత్‌ పొదుపు కోసం పంజాబ్‌ అమలు చేస్తున్న పథకాన్ని మనదగ్గర అమలు చేయగలమా పరిశీలించాలి. అయితే ఏ పంట సాగుకు ఎంత నీళ్లు, ఎంత విద్యుత్‌ అవసరమన్న అంశాలను ఖరారు చేయడంలో సమస్యలు రావచ్చు. భూగర్భ జలాలు ఎక్కువ ఉంటే తక్కువ విద్యుత్‌తోనే అవసరం తీరుతుంది. కానీ భూగర్భ జలాలు తక్కువగా ఉన్నచోట రైతులు విద్యుత్‌ పొదుపు చేయడం కుదరకపోవచ్చు.  -డి.నరసింహారెడ్డి, విద్యుత్‌ రంగ నిపుణుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement