రైతుకు పట్టం కట్టాం | KCR Showcases Telanganas Farmer-Friendly Schemes In NITI Aayog Meeting | Sakshi
Sakshi News home page

రైతుకు పట్టం కట్టాం

Published Mon, Jun 18 2018 2:05 AM | Last Updated on Sat, Oct 20 2018 5:49 PM

KCR Showcases Telanganas Farmer-Friendly Schemes In NITI Aayog Meeting - Sakshi

నీతి అయోగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రైతుల శ్రేయస్సే లక్ష్యంగా అనేక పథకాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలను నీతి ఆయోగ్‌ వేదికగా వివరించారు. ఆదివారమిక్కడ రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన నీతి ఆయోగ్‌ నాలుగో పాలక మండలి సమావేశంలో సీఎం మాట్లాడారు. రైతులు, వ్యవసాయం, సాగునీటి చుట్టూ ఆయన ప్రసంగం సాగింది. ‘‘సహకార సమాఖ్య స్ఫూర్తిని నిలబెడుతూ నిర్వహిస్తున్న నాలుగో నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి మమ్మల్ని ఆహ్వా నించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు. గత సమా వేశంలో తీసుకున్న నిర్ణయాలను జాతీయస్థాయిలో కేంద్రం, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి. దేశవ్యాప్తంగా ప్రగతిని వేగిరపరిచేందుకు ఒకరి నుంచి ఒకరం నేర్చుకోవాలి. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మీతో పంచుకుంటాను’’ అని వివరించారు. ప్రసంగం ముఖ్యాంశాలు సీఎం మాటల్లోనే..

రైతుకు బంధువు
వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ‘రైతుబంధు’ పథకం ప్రారంభించి ఎకరానికి రూ.4 వేల ఆర్థిక సాయం అందించాం. తెలంగాణలో మొత్తం రైతుల్లో 98 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులే. అన వసరమైన వడపోతలను నివారిస్తూ రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించాం. పెట్టుబడి సాయం అవసరం లేదనుకునేవారు తమకు వచ్చిన చెక్కులను వెనక్కి ఇచ్చే వెసులుబాటును కూడా ఇందులో పెట్టాం. ఈ పథకం రుణ వితరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని కొందరు అపోహ పడ్డారు. కానీ ఇది రుణ వితరణ విధానాన్నిగానీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలను గానీ, పంటల సాగు సరళినిగానీ దెబ్బతీయదు. అలాగే ‘రైతు బీమా యోజన’ పేరుతో మరో పథకం ప్రారంభించాం. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న రైతులకు రూ.5 లక్షల మేర ఎల్‌ఐసీ సంస్థ ద్వారా బీమా కల్పించేందుకు ఉద్దేశించింది ఈ పథకం. బీమా కలిగిన రైతు మరణిస్తే ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ప్రయోజనం అందుతుంది. ఏటా రూ.వెయ్యి కోట్ల మేర బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 50 లక్షల మంది రైతులకు వర్తించే ఈ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించనున్నాం.

భూలావాదేవీల్లో ఇక్కట్లు లేకుండా..
సాగు భూమిపై స్పష్టమైన యాజమాన్య హక్కులు ఉండాలన్న ఉద్దేశంతో భూరికార్డులను ప్రక్షాళన చేసి చేసి 17 భద్రతా ప్రమాణాలతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశాం. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ ప్రక్రియలను కూడా అనుసంధానం చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో భూలావాదేవీల్లో ఎలాంటి ఇక్కట్లు లేని వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నాం. పట్టణ ఆస్తులకు సంబంధించి కూడా ఇలాంటి సంస్కరణలు తెస్తాం. రైతులకు చేయూత అందించడంలో భాగంగా సాగునీటి రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి సాగునీటి పథకాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే తెలంగాణకు జీవరేఖగా నిలుస్తాయి. 24 జిల్లాల్లో దాదాపు కొత్తగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు, 18 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరుగుతోంది. సమయం, ఖర్చు పెరగకుండా భారీ ప్రాజెక్టులను అత్యంత వేగంగా పూర్తిచేయడంలో తెలంగాణ కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది.

వెయ్యి కోట్లతో గిడ్డంగులు
వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధిలో భాగంగా గడచిన మూడేళ్లలో రూ.1,050 కోట్ల వ్యయంతో మొత్తం 18.30 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన 356 గిడ్డంగులు నిర్మించాం. గతంలో 4.17 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 170 గిడ్డంగులకు ఇవి అదనం. వీటిని గరిష్టంగా వినియోగించుకునేందుకు వీలుగా అన్ని జిల్లాలకు విస్తరించగలిగాం. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు, మార్కెట్‌ ధరల హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు, ఎరువులు, విత్తనాలు నిల్వ చేసుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి.

రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇవ్వాలి
దేశాభివృద్ధి రాష్ట్రాల వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు నిధుల విడుదల సాధ్యం కానిపక్షంలో పన్ను రాయితీలతో ప్రోత్సహించాలి. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టి డెయిరీ, పౌల్ట్రీ, మేకలు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం రంగాలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో భాగంగా నరేగా నిధులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. ఈ నిధుల నుంచి 50 శాతం, మరో 50 శాతం రైతుల నుంచి సాగుకు వినియోగించడం వల్ల రైతుల పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతుంది.

ఆ రంగాల్లో రాష్ట్రాలకు మరింత అవకాశమివ్వాలి
విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక వ్యవహారాలు, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆయా అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆరోగ్యం, విద్య, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలపై దృష్టి పెట్టేందుకు రాష్ట్రాలకు మరింత అవకాశం ఇవ్వాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపరాదు. దీనివల్ల రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement