ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 30వేల కోట్లు ఇవ్వండి
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాకు టీ ప్రభుత్వ ప్రతినిధుల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 30 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల బృందం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాకు విజ్ఞప్తి చేసింది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.700 కోట్లు మంజూరుకు సిఫార్సు చేయాలని విన్నవించింది. రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ డిప్యూటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్, ఆర్థికశాఖ సలహాదారు జి.ఆర్.రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శి రామకృష్ణ, ప్రణాళికా విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి బీపీ ఆచార్యలతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియాతో భేటీ అయ్యింది.
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన బీఆర్‌జీఎఫ్ (వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు) నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపులు, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలకు నిధుల కేటాయింపును కొనసాగించడం, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు నిధుల మంజూరు అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించి గతంలో సీఎంల ఉపసంఘం సిఫార్సు చేసిన 14 అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరామన్నారు. కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే బడ్జెట్ రూపకల్పనలో అవరోధాలు ఏర్పడతాయని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు.
కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల నుంచి సమాచారం తీసుకుని, కేటాయించాల్సిన నిధులపై స్పష్టత ఇస్తామని పనగరియా హామీ ఇచ్చారని చెప్పారు. వచ్చేనెల 15వ తేదీన ప్రారంభమయ్యే మేడారం జాతరకు రావాల్సిందిగా పనగరియాను ఆహ్వానించామన్నారు. మేడారం జాతరతోపాటు, ఆగస్టు నెలలో ఆరంభమయ్యే కృష్ణా పుష్కరాలకు నిధులు ఇవ్వాలని కోరామన్నారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయకు ప్రత్యేక గ్రాంట్స్ ఇవ్వడానికి ఆర్థిక శాఖకు సిఫార్సు చేయాలని విన్నవించామన్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు రూ.400 కోట్ల మంజూరు ప్రతిపాదనలపై ప్రక్రియ జరుగుతోందని పనగరియా చెప్పారని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ చెప్పారు.
ఆర్థిక శాఖ కార్యదర్శితో భేటీ
తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్‌పీ రతన్ వతల్‌తో భేటీ అయ్యింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 94 కింద ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఇవ్వాలని, 13వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని, సెంట్రల్ సేల్స్‌ట్యాక్స్ నష్టపరిహారం చెల్లింపులో బకాయి నిధులు విడుదల చేయాలని కోరింది.
కరువు నిధులు విడుదల చేయండి
రాష్ట్రానికి కరువు నిధులను త్వరగా విడుదల చేయాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్‌కు విజ్ఞప్తి చేశారు. రాజీవ్‌శర్మ బుధవారం ఉదయం సిరాజ్ హుస్సేన్‌తో సమావేశమై రూ. 3వేల కోట్ల కరువు నిధుల ప్రతిపాదనపై చర్చించారు.