అప్పు.. రూ. లక్ష కోట్లు..!
⇒ ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు సడలిస్తే తెలంగాణపై మరింత రుణభారమే
⇒ తొలి ఏడాది రూ. 8,500 కోట్ల అప్పు
⇒ ఈసారి రూ. 18,962 కోట్లు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: అప్పులు తప్ప గత్యంతరం లేదని తెలంగాణ సర్కారు అంచనా వేసుకుంది. అందుకే ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలు సడలించాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు సడలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ బృందానికి విజ్ఞప్తి చేశారు.
కానీ.. సడలిస్తే రాష్ట్రంపై అప్పుల భారం మరింత పెరిగిపోనుంది. ఏళ్లకేళ్లుగా చేసిన అప్పులు.. వడ్డీల భారం తెలంగాణ రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. తొలి ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణ సర్కారు రూ. 8,500 కోట్ల అప్పులు తెచ్చింది. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ వాటాగా వచ్చిన రుణ భారం మొత్తం రూ. 61 వేల కోట్లు. ఆడిటింగ్ పూర్తయితే ఇది రూ.71 వేల కోట్లు దాటుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఈ లెక్కన మొత్తం అప్పు ఇప్పటికే రూ.80 వేల కోట్లకు చేరువలో ఉంది. కొత్తగా రూ.18,962 కోట్ల అప్పులు చేసేలా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు సడలించాలనేది సర్కారు వాదన.
ఈ తీరు చూస్తే.. వచ్చే ఏడాది తెలంగాణ అప్పు రూ.98,962 కోట్లు.. ఇంచుమించుగా లక్ష కోట్ల దరిదాపుల్లోకి చేరటం ఖాయంగా కనిపిస్తోంది. గత ఏడాది అప్పులపై వడ్డీలకు ప్రభుత్వం రూ.5,925 కోట్లు చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీల చెల్లింపులకు రూ.7,554 కోట్లు ఖర్చు చేయనుంది. 14వ ఆర్థిక సంఘం తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ప్రకటించింది. ఈ ప్రకటన రాష్ట్రానికి లాభం కంటే నష్టాలనే ఎక్కువగా తెచ్చి పెట్టిందని ఆర్థిక శాఖ తల పట్టుకుంది. ఆశించినంత రెవిన్యూ రాబడులు లేకపోవటంతో తొలి ఏడాదిలోనే అంచనాలు తలకిందులయ్యాయి. నిధుల సర్దుబాటు సంక్లిష్టంగా మారింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నింటికీ కత్తెర పడటంతో పాటు... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విడుదలయ్యే గ్రాంట్లు రాకుండా పోయాయి.
కొత్త రాష్ట్రం కావటంతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి దాదాపుగా బుట్ట దాఖలైంది. దీంతో రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లింది. రెవిన్యూ మిగులు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిన అవసరమేమీ లేదని ఈ ఆర్థిక సంఘం బీఆర్‌జీఎఫ్ ఊసెత్తకుండానే వదిలేసింది. దీంతో తెలంగాణలో ఆరు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు రాకుండా పోయాయి. పన్నుల వాటా, గ్రాంట్లు మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే రూ. 6,000 కోట్లు కేంద్రం నుంచి కత్తెర పడింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట ప్రకారం రాష్ట్రాలు తమ జీఎస్‌డీపీలో 3 శాతం మేరకు అప్పులు తెచ్చుకునే వీలుంటుంది. ఈ వార్షిక బడ్జెట్టులో తెలంగాణ ప్రభుత్వం 3.49 శాతం ద్రవ్యలోటును చూపించింది. రూ.16969 కోట్ల అప్పులు తెచ్చుకుంటామని అంచనాలు వేసింది. కానీ.. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధన ప్రకారం ఈ అప్పులు రూ.13,053 కోట్లు మించకూడదు.
అందుకే ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్టులో 3.9 శాతం ద్రవ్యలోటు చూపించాయి. రెవిన్యూ మిగులు ఉన్నందున తెలంగాణకు కేంద్రం తరహాలోనే ద్రవ్యలోటుకు అనుమతించాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ బృందానికి ఆర్థిక శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ లెక్కన తెలంగాణ ప్రభుత్వం రూ.18,962 కోట్ల అప్పులు తెచ్చి ఈ వార్షిక బడ్జెట్టులో లోటు పూడ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ధనిక రాష్ట్రమైతే అప్పులతో అవసరమేముందన్న ధోరణితో కేంద్రం ఈ అంశాన్ని దాటవేస్తోందని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.