సాక్షి, హైదరాబాద్: యేటా పెరుగుతున్న అప్పుల భారం ఖజానాకు మరింత గుదిబండ కాకూడదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) నుంచి క్రమంగా రుణ ప్రతిపాదనలు తగ్గించాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాన్ని పెంచుకునే దిశలో కసరత్తు చేయాలన్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించారు. రానున్న రెండేళ్ల పాటు ఊహాజనిత అంచనాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ అంచనాలకు మాత్రమే పరిమితం కావాలని, అనివార్య ఖర్చులు, సంక్షేమ పథకాల అమలుకు రూ.95 వేల కోట్లు అవసరం కానున్న నేపథ్యంలో ఆచితూచి బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకాలు, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి అమల్లోకి రాని భూముల మార్కెట్ విలువల సవరణ, మైనింగ్ వేలం లాంటి ప్రతిపాదనలతో పాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లకు స్వీయ రాబడులు పెంచే మార్గాలు, ఎక్సైజ్ ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశలో ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. వీలున్నంతగా రాష్ట్ర ఆదాయ వనరులను శాశ్వతంగా పెంచడమే లక్ష్యంగా ఈసారి బడ్జెట్ అంచనాలు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు అప్పులు ప్రతిపాదనలు తగ్గుతాయని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు.
రూ.20 వేల కోట్లయినా...
అప్పుల జోలికి పెద్దగా వెళ్లే పనిలేకుండా సొంత రాబడులు ఎలా పెంచుకోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ భూముల వేలం ద్వారా రూ.15 వేల కోట్లకు పైగా సమీకరించవచ్చనే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం ముందు సిద్ధంగా ఉన్నాయి. గత రెండేళ్లుగా ఈ ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అమలు సాధ్యం కాలేదు. దీంతో పాటు నిరర్థక ఆస్తుల అమ్మకాలు, గనుల వేలం, వాణిజ్య పన్నుల శాఖలో పేరుకుపోయిన బకాయిల సెటిల్‌మెంట్లు, ఎక్సైజ్ రాబడి పెంపు, పన్నేతర రాబడుల విషయంలో ప్రత్యేక కార్యాచరణ, కార్పొరేషన్ల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడకుండా ఆయా కార్పొరేషన్లే సొంతంగా నిధులు సమకూర్చుకునే ప్రణాళికలు... లాంటివి రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి భూముల మార్కెట్ విలువలు సవరించలేదు.
గత ఏడేళ్లలో బహిరంగ మార్కెట్‌లో ఉన్న భూముల విలువకు, ప్రభుత్వ మార్కెట్ విలువకు పొంతనలేకుండా పోయింది. ఈ విలువల సవరణపై రిజిస్ట్రేషన్ల శాఖ చాలాకాలంగా ప్రతిపాదనలు పంపుతున్నా సీఎం కేసీఆర్ తిరస్కరిస్తున్నారు. ఈ విలువలను సవరించడం ద్వారా ప్రతి యేటా కనీసం రూ.2,500 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా. దీంతో ఈసారి భూముల మార్కెట్ విలువల సవరణ ఖాయమని ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగతా ప్రణాళికలను కూడా అమలు చేయడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.40 వేల కోట్ల వరకు సమీకరించవచ్చని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నా, కనీసం రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా అప్పుల భారం తగ్గించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
పెరిగిన వడ్డీల భారం
రాష్ట్ర ఖజానాపై అప్పులు, వడ్డీల భారం పడుతోంది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో రాబడికి అదనంగా అప్పులు సమీకరించాల్సి వస్తుండటంతో వార్షిక బడ్జెట్‌లో దాదాపు 10% నిధులను వడ్డీల కిందే చెల్లించాల్సి వస్తోందని కాగ్ గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో చెల్లించిన వడ్డీ మొత్తంతో పోలిస్తే 2020–21లో చెల్లించాల్సింది మూడింతలు పెరగడంతో అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా దెబ్బకు ఈ ఏడాది అప్పుల పద్దు భారీగా పెరగడంతో.. భవిష్యత్తులో ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారా అప్పులపై ఎక్కువగా ఆధారపడొద్దన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం బడ్జెట్‌లో వీలున్నంత తక్కువ రుణసమీకరణ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది.
ఎఫ్‌ఆర్‌బీఎంలోని నిబంధనలకు అనుగుణంగా అప్పులు తెచ్చుకుని రాష్ట్ర అభివృద్ధి, మనుగడకు ఖర్చు పెట్టే పద్ధతి దశా బ్దాల నుంచే వస్తోంది. 2014–15లో అప్పులకు వడ్డీల కింద రూ.5,195 కోట్లు చెల్లించగా, అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.15 వేల కోట్ల వరకు చేరింది. గత డిసెంబర్ వరకే రూ.11,500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అనివార్యమయితే తప్ప అప్పుల ప్రతిపాదన చేయవద్దని, సొంత ఆదాయాలను సమకూర్చుకునే మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment