సాక్షి, హైదరాబాద్: ప్రధానమైన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలు, పరిపాలనా కార్యకలాపాలను ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా చూస్తూ పర్యవేక్షించడానికి దక్షిణ మధ్య రైల్వే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సీసీ కెమెరాల ద్వారా ఆయా స్టేషన్లలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ వీడియో సర్వైలెన్స్ సిస్టం కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.
ఈ విధానంలో ఉన్నతాధికారులు రైల్ నిలయం నుంచి చూస్తూ ఆయా స్టేషన్లలో అధికారు లకు సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి వీలుంటుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 17 ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లను ఈ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, బేగంపేట, లింగంపల్లి, మంచిర్యాల, వరంగల్ స్టేషన్లు, ఏపీ లోని గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగో లు, రాజమండ్రి, తుని, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ధర్మాబాద్, జాల్నా, నాగర్‌సోల్, పర్లివైద్యనాథ్ స్టేషన్‌లను ఈ కంట్రోల్ రూమ్ పరిధిలోకి తీసుకువచ్చారు.
దీంతోపాటు ఆయా స్టేషన్‌లలో ప్రస్తుతం ఉన్న ఇంటిగ్రేటెడ్ సీసీకెమెరాల స్థానంలో ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత వీఎస్‌ఎస్ విధానం ఏర్పాటు చేశారు. రైల్‌టెల్ ఆధ్వర్యంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో దీన్ని అనుసంధానించారు. మొత్తం 520 సీసీ కెమెరాలతో అనుసంధాన అయ్యిందని జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. ఆయా స్టేషన్లలో మనుషుల ముఖ కవళికలను స్పష్టంగా గుర్తించేందుకుగాను 4కే రెషల్యూషన్ అల్ట్రా హెచ్‌డీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment