హస్తినలో ‘కురుక్షేత్రం’! | Senior Telangana Congress Leaders To Meet Rahul Gandhi On Monday | Sakshi
Sakshi News home page

హస్తినలో ‘కురుక్షేత్రం’!

Published Mon, Apr 4 2022 1:22 AM | Last Updated on Mon, Apr 4 2022 9:13 AM

Senior Telangana Congress Leaders To Meet Rahul Gandhi On Monday - Sakshi

ఢిల్లీకి కుటుంబ సమేతంగా రైల్లో బయలుదేరిన జగ్గారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అసమ్మతి, అసంతృప్తుల వ్యవహారం ఢిల్లీకి చేరింది. అధిష్ఠానం పిలుపుతో కీలక ‘హస్తం’నేతలందరూ హస్తినబాట పట్టారు. ఓవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడు, మరోవైపు రోజురోజుకూ సీనియర్ల రూపంలో చాపకింద నీరులా పేరుకుపోతున్న అసమ్మతి. వెరసి ‘హస్త’వ్యస్తంగా సాగిపోతున్న టీపీసీసీకి అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది.

రాష్ట్రానికి చెందిన 38 మంది ముఖ్యనేతలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో సోమవారం సమావేశం కానున్నారు. దీంతో అసలు ఈ సమావేశంలో ఏం జరుగుతుంది.. ఏయే అంశాలపై పార్టీ నేతలతో రాహుల్‌ చర్చిస్తారు.. పార్టీలో విభేదాలు ప్రస్తావనకు వస్తాయా.. విభేదాలతో ఉడికిపోతున్న నేతల మధ్య సమన్వయం కుదురుతుందా.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ను టార్గెట్‌ చేసి ఢిల్లీబాట పట్టిన సీనియర్లు ఏం మాట్లాడనున్నారు.

తెరవెనుక ఉండి అసమ్మతిని పర్యవేక్షిస్తున్న ముఖ్య నేతలు ఏమంటారు.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి మాట్లాడే నేతలకు రాహుల్‌ సమక్షంలో నోరు విప్పే అవకాశం వస్తుందా.. అసలు సమావేశపు ఎజెండా ఏంటి.. సమావేశం ముగిసిన తర్వాత ఏమవుతుంది.. అనే ఉత్కంఠ, ఆసక్తి రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో నెలకొంది. కాగా, రాహుల్‌తో సమావేశమయ్యేందుకు ఆహ్వానం అందిననేతల్లో చాలామంది ఆదివారమే ఢిల్లీ వెళ్లగా, మరికొందరు సోమవారం ఉదయాన్నే బయలుదేరనున్నారు. ఇటీవల ఫైర్‌బ్రాండ్‌గా మారిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం ఉదయమే సతీమణి, కుమారుడు, కుమార్తెతో కలసి రైలులో ఢిల్లీకి పయనమయ్యారు.

అందరికీ ‘భరోసా’ 
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న విభేదాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత జరిగిన అన్ని పరిణామాలు పార్టీ అధిష్టానానికి స్పష్టంగా తెలుసునని, ఏ నాయకుడి మనసులో ఏముందనే విషయాన్ని కూడా అధిష్టానం గ్రహించిందని, ఈ నేపథ్యంలో అందరు నేతలకు రాహుల్‌గాంధీ స్పష్టమైన భరోసా ఇస్తార ని గాంధీభవన్‌ వర్గాలు చెపుతున్నాయి.

ముఖ్యంగా రేవంత్‌ వ్యవహారశైలిపై విమర్శలు చేసే నేతలతోపాటు వారిని కలుపుకుని ముందుకెళ్లే విషయంలో రేవంత్‌రెడ్డికి కూడా రాహుల్‌ మార్గనిర్దేశనం చేస్తారనే చర్చ జరుగుతోంది. పార్టీ స్థితిగతులను పరిశీలించడంతోపాటు ఎన్నికల కోణంలో టీపీసీసీని ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ మాజీ అనుచరుడు సునీల్‌ కనుగోలును రాష్ట్ర పార్టీ నేతలందరికీ రాహుల్‌ పరిచయం చేస్తారని తెలుస్తోంది.

దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై సునీల్‌ కనుగోలు ఇచ్చిన సమాచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో పంచుకుంటారని, పార్టీ ఏయే ప్రాంతాల్లో, ఏయే అంశాల్లో బలంగా ఉంది, ఎక్కడెక్కడ బలహీనంగా ఉందనే విషయాలను ముఖ్య నాయకులందరికీ వివరించి 2023 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేసే విధంగా సిద్ధం చేసి పంపుతారని సమాచారం. 

ఆహ్వానం అందింది వీరికే...! 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, పొదెం వీరయ్య, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌అలీ, పార్టీ కమిటీల చైర్మన్లు మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీనియర్‌ నేతలు వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, శ్రీనివాస కృష్ణన్, బోసు రాజు, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌కుమార్, ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, మాజీమంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, సంబాని చంద్రశేఖర్, కొండా సురేఖ, సుదర్శన్‌రెడ్డి, ఆర్‌. దామోదర్‌రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం ప్రసాద్‌కుమార్‌లకు రాహుల్‌తో సమావేశానికి రావాలంటూ ఆహ్వానాలు అందాయి. వీరితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement