కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత ఎంబీఏ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ల అమ్మకు 2020లో కోవిడ్ వచ్చింది. చికిత్స ఖర్చులతో ఆ కుటుంబం అప్పుల పాలైంది. దీనితో పై చదువుల ఆశలు వదిలేసి.. ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో నెలకు రూ. 25వేల వేతనంతో ఉద్యోగం చేస్తున్నాడు.
మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్ ప్రకాశ్ ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాలనుకున్నాడు. అందుకోసం ఏర్పాట్లూ చేసుకుంటూ వచ్చాడు. కానీ నవీన్ తండ్రిని కోవిడ్ బలితీసుకుంది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు నవీన్ కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు.
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కొట్టిన దెబ్బకు వేలు, లక్షల మంది యువత పైచదువులను, భవిష్యత్తు ఆశలను వదిలేసుకుని ఉద్యోగం, ఉపాధి వేటలో పడుతోంది. కోవిడ్ తర్వాత తిరిగి ఉపాధి అవకాశాలు పెరిగాయని.. యువత ఉద్యోగాల వైపు పరుగులు పెడుతోందని ప్రభుత్వాలు, సామాజిక సర్వేలు చెప్తున్నాయి. కానీ దీని వెనుక విషాద గాధలు ఎన్నో ఉన్నాయి. కోవిడ్‌తో చితికిపోయిన పేద, మధ్యతరగతి కుటుంబాల దయనీయ కథలున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ చేసిన సర్వే నివేదికలో ఈ విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడయ్యాయి.
ఏమిటీ సర్వే?
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ 2000వ సంవత్సరంలో ‘యంగ్‌లైవ్స్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. మన రాష్ట్రంలో ఆ సర్వే బాధ్యతను సెస్ తీసుకుంది. మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లోని కొన్ని మండలాలను ఎంచుకుని.. 6–18 నెలల పిల్లలు 2 వేల మంది (యంగర్ గ్రూప్)ని, 7–8 ఏళ్ల పిల్లలు వెయ్యి మంది (ఓల్డర్ గ్రూప్)ని సర్వే కోసం ఎంపిక చేసింది.
వారి జీవితంలో విద్య, పౌష్టికాహారం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం, మానసిక పరివర్తన వంటి అంశాలను ప్రతీ నాలుగేళ్లకోసారి అధ్యయనం చేస్తూ వస్తోంది. తెలంగాణలో 2002లో మొదటి విడత సర్వే చేశారు. తర్వాత 2009, 2013, 2016లో, తాజాగా 2020లో సర్వే చేపట్టారు. సర్వేకు ఎంపికచేసిన వారిలో యంగర్ గ్రూప్ వారు ప్రస్తుతం 22–23 ఏళ్లు, ఓల్డర్ గ్రూప్ వారు 29–30 ఏళ్ల మధ్య ఉన్నారు. పేద, మధ్య తరగతి, ఉన్నత కుటుంబాలు.. అన్ని ఆర్థికస్థాయిలవారూ ఉన్నారు. కోవిడ్ కారణంగా సెస్ ప్రతినిధులు వారందరినీ ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి.. తాజాగా నివేదికను విడుదల చేశారు.
కోవిడ్‌తో చితికిన బతుకులు
పేద, మధ్యతరగతి వర్గాల బతుకులను కోవిడ్ మహమ్మారి చిదిమేసిందని సెస్ ‘యంగ్ లైవ్స్’ అధ్యయనంలో తేలింది. సర్వే నివేదిక ప్రకారం.. అనియత రంగంలో (రోజువారీ కూలీలు, భవన నిర్మాణ రంగం వంటివి) పనిచేస్తున్న, స్వయం ఉపాధి పొందుతున్న వారి కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. వీరిలో 72 శాతం కుటుంబాల్లో ఇంటికి ఒక్కరైనా ఉద్యోగం కోల్పోయారు. స్వయం ఉపాధి పొందేవారిలో 62 శాతం మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. మొత్తంగా 63 శాతం కుటుంబాల్లో 20–23 ఏళ్ల మధ్య యువత విద్యకు దూరమయ్యారు. 27 శాతం మందికి చదువుపై ఆసక్తి ఉన్నా విధిలేక ఉపాధి/ఉద్యోగం కోసం వెళ్లాల్సి వచ్చింది.
భారీగా ఉద్యోగాల్లోకి..
వాస్తవానికి లాక్‌డౌన్ తర్వాత యంగర్ గ్రూప్ (20–23 ఏళ్ల మధ్యవారు) ఉద్యోగాల్లోకి ఎక్కువగా వచ్చారు. కానీ ఇవేవీ వారి చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలు కాదని సర్వే పేర్కొంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఓ చిన్న కంపెనీలో క్లర్క్‌గా కూడా పనిచేస్తున్నాడని తెలిపింది. స్కిల్డ్ పోస్టులు వెతుక్కునే అవకాశం కూడా లేకుండా పోయిందని వెల్లడించింది.
సామాజిక అసమానతల దిశగా..
కోవిడ్ కాలంలో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఎవరో ఒకరు ఉద్యోగం పోగొట్టుకోవడమో, ఉపాధి తగ్గడమో, కోవిడ్ వల్ల అప్పుల పాలవడమో, ఎక్కడికీ వెళ్లలేక ఉన్నదంతా అమ్మేసి లేదా పిల్లల చదువులకు దాచిపెట్టింది వాడేసి ఆర్థికంగా చితికిపోవడమో జరిగింది. కోవిడ్ తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చినా.. పేద, మధ్య తరగతి వర్గాలు ఏదో ఒక ఉద్యోగాన్ని చూసుకోక తప్పలేదు. దీనివల్ల ఆ కుటుంబాల వారు ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఇది సామాజిక అసమానతలకు దారి తీస్తోందని యంగ్ లైవ్స్ సర్వే వెల్లడించింది.
- 20–23 ఏళ్ల మగ పిల్లలు కుటుంబ పోషణ కోసం చదువు మానేసి ఉద్యోగాల కోసం వెళితే.. ఆడపిల్లలు ఉద్యోగాలు మానేసి, ఇంటిపట్టునే ఉండి అందుబాటులో ఉన్న చదువులను ఆశ్రయిస్తున్నారని సర్వే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే 73 శాతం యువకులు ఉపాధిలో ఉంటే, మహిళలు మాత్రం 36 శాతమే ఉన్నట్టు తెలిపింది.
- షెడ్యూల్డ్ కులాలపై కోవిడ్ ప్రభావం మరింత ఎక్కువగా కన్పిస్తోందని సర్వే పేర్కొంది. లాక్‌డౌన్‌కు ముందు 46 శాతం మంది ఉపాధి/ఉద్యోగంలో ఉండగా.. అది ఇప్పుడు 62 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇదేస్థాయిలో యువత చదువులకు దూరమైందని పేర్కొంది.
తక్షణం మేల్కొనాలి
కోవిడ్ ప్రమాద ఘంటికలు పేద, మధ్య తరగతి వర్గాలపై స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయనే సంకేతాలు కన్పిస్తున్నా, వాళ్లంతా ఉన్నత చదువులకు దూరమయ్యారనే వాస్తవాలు గమనించాలి. కోవిడ్ దెబ్బకు చదువుకునే అవకాశాలు సన్నగిల్లి, ఆర్థిక భారంతోనే కుటుంబ పోషణకు ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి యువతను వెంటాడుతోంది. ఇది రానురాను ఆర్థిక అసమానతలకు దారి తీస్తుంది. ఈ వర్గాలను ప్రోత్సహించి, ఉన్నత చదువుల వైపు మళ్లించాలి. వారికి ఆర్థిక చేయూతనిచ్చే దిశగా ప్రభుత్వ పథకాలు ఉండాలి. – ప్రొఫెసర్ ఈ.రేవతి, సెస్ డైరెక్టర్
సర్వేలో గుర్తించిన పలు కీలక అంశాలివీ..
- 2021 నాటికి పేదరికం స్థాయి గణనీయంగా పెరిగింది. కష్టాల్లో ఉన్న కుటుంబాలు, పేద లేదా నిరాశ్రయులైన కుటుంబాలు కోవిడ్‌కు ముందు 36 శాతంగా ఉంటే.. 2020 ఆగస్టు–అక్టోబర్ నాటికి 52 శాతానికి పెరిగాయి. కోవిడ్ తగ్గినా 2021 డిసెంబర్ నాటికి కూడా 46శాతం కుటుంబాలకు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోనూ నిరుపేదల శాతం పెరిగింది.
- కోవిడ్ సమయంలో డిజిటల్ విద్యా అందడంలోనూ తారతమ్యాలు కనిపించాయి. ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యంలేని యంగర్ గ్రూప్ యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరు అక్టోబర్ 2021 నాటికి చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది.
- స్త్రీపురుష ఉపాధి అంతరం గణనీయంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు 16 శాతంగా ఉన్న వివక్ష.. 2021 డిసెంబర్ నాటికి 36 శాతానికి పెరిగింది.
- కోవిడ్ సమయంలో వివిధ ఆందోళనలతో యువత మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. 2021 డిసెంబర్ నాటికి 11 శాతం మంది డిప్రెషన్ లక్షణాలతో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment