ఎయిర్‌పోర్టులో సందడి | Shamshabad International Airport Gradually Increasing Passengers | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో సందడి

Published Sun, Oct 11 2020 8:15 AM | Last Updated on Sun, Oct 11 2020 8:16 AM

Shamshabad International Airport Gradually Increasing Passengers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. లక్షలాది మంది వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం చేస్తున్నారు. దేశీయ సర్వీసులతో పాటు వివిధ దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు.. కోవిడ్‌ కారణంగా ఎయిర్‌పోర్టులో షాపింగ్‌ చేసేందుకు భయపడిన జనం.. ఇప్పుడు సరదాగా షాపింగ్‌ చేస్తున్నారు. కోవిడ్‌ తర్వాత జీవన విధానాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం మార్చి 23 నుంచి మే 25 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి.

సరుకు రవాణా కార్గో విమానాలు మాత్రమే నడిచాయి. ఆ తరువాత వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు వందేభారత్‌ విమానాలను నడిపారు. ప్రయాణికులు మాత్రం కోవిడ్‌ భయాందోళనలతో రాకపోకలు సాగించారు. మే 25 నుంచి దేశీయ ప్రయాణాలను పునరుద్ధరించారు. మొదట్లో ప్రయాణికుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ప్రస్తుతం అన్‌లాక్‌లో భాగంగా అన్ని రకాల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు పునరుద్ధరించడంతో జనజీవితంలోనూ అనూహ్య మార్పులు వచ్చాయి. కోవిడ్‌కు ముందు ఉన్న పరిస్థితులు నెలకొన్నా యి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ వ్యాపార కార్యకలాపాలు పెరిగినట్లు జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.  

6 లక్షలు దాటిన ప్రయాణికులు... 
హైదరాబాద్‌ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, విశాఖ సహా సుమారు 70 నగరాలకు రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. 
కోవిడ్‌కు ముందు ప్రతిరోజూ 55 వేల మందికి పైగా దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, ఇప్పుడు సగటున 20 వేల నుంచి 22 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. 
ఇక అంతర్జాతీయంగా గతంలో ప్రతిరోజు 10 వేల మంది రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు 3 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. 
బ్రిటన్‌తో పాటు, దుబాయ్, ఖతార్‌ తదితర గల్ఫ్‌ దేశాలకు విమాన సర్వీసులు పెరిగాయి. త్వరలో మరిన్ని దేశాలకు విమానాలు నడిచే అవకాశం ఉంది.  
సెప్టెంబర్‌లో 7 వేల దేశీయ సర్వీసులు, 665 అంతర్జాతీయ సర్వీసులు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. 
ఈ ఒక్క నెలలోనే 6 లక్షల మందికి పైగా దేశీయ, 38 వేలకుపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు.

యూవీ ఓవెన్‌లో పెట్టి.. 
ఎయిర్‌పోర్టులో 80 షాపింగ్‌ ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువును యూవీ ఓవెన్‌లలో పెట్టి ఇస్తున్నారు. దీంతో వైరస్‌ పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ట్రయల్‌ రూమ్స్‌తో పాటు, షాపింగ్‌ సెంటర్‌లను కూడా పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నారు. షాపింగ్‌ ఔట్‌లెట్స్‌లో క్రమంగా విక్రయాలు పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement