మంత్రుల సమక్షంలో ఇటీవలి సమీక్షలో అధికారుల వాగ్వాదంపై సర్కారు సీరియస్
దుష్ప్రవర్తన, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం
‘సాక్షి’కథనంపై వివరణ ఇచ్చిన కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్
సాక్షి, హైదరాబాద్: పరిపాలనా అనుమతులు లేకుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లను ఆహ్వనించిన అంశంపై మంత్రుల సమక్షంలో వాగ్వాదానికి దిగినందుకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ (సీఈ) శ్రీనివాస్‌రెడ్డికి ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు సంజాయిషీ ఇవ్వాలని వారిని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత శనివారం సీతారామ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో పాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను ఆహ్వనించిన అంశం చర్చకు రావడం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం సీఈ ఎ.శ్రీనివాస్‌రెడ్డే అనుమతుల్లేకుండా టెండర్లు ఆహ్వనించారని అనిల్‌కుమార్ అభ్యంతరం తెలిపినట్లు.. అనుమతుల విషయంలో అనీల్‌కుమారే సహకరించట్లేదని శ్రీనివాస్‌రెడ్డి మంత్రుల సమక్షంలో వాదించినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ వారిద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను అదే రోజు ఆదేశించారు.
మంత్రులను తప్పుదోవ పట్టించినందుకు సస్పెండ్ చేయిస్తానని సీఈపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారం గురించి సాక్షి ప్రధాన సంచికలో ‘అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల సీతారామ టెండర్లు’శీర్షికతో వచ్చిన వార్తా కథనంపై కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. సీఎం, మంత్రులు ఆదేశించడంతోనే డి్రస్టిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లను ఆహ్వానించినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్‌తోపాటు నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ (జనరల్)కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. డి్రస్టిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను ఆహ్వనించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సమీక్షలో ఆదేశించారని గుర్తుచేశారు.
అలాగే సెపె్టంబర్ 27న నిర్వహించిన సమీక్షలో డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు టెండర్లు పిలవాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఆదేశించారని పేర్కొన్నారు. రూ.13,057.98 కోట్ల సవరణ అంచనాలతో గతంలో ఇచ్చిన పరిపాలనా అనుమతుల్లో డిస్ట్రిబ్యూటరీల పనులు సైతం ఉన్నందున టెండర్ల విషయంలో ముందుకు వెళ్లాలని ఆ సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సూచించారన్నారు. ఆ సమావేశం మినట్స్‌లో ఈ విషయాలన్నీ ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయ అంచనాల సవరణకు పరిపాలనా అనుమతులు వస్తాయన్న నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటరీల పనులకు తాజాగా టెండర్లను ఆహ్వానించినట్లు లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment