సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్): వారిద్దరు అక్కాచెల్లెలు.. కరోనా సమయంలో పనులు, ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు సొంతంగా వ్యాపారం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. అప్పుడే వారికి హెల్దీఫుడ్స్ వ్యాపారం చేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టారు. వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించి, ప్రస్తుతం స్థానిక గాంధీపార్క్ సమీపంలో చిన్నషాపు ఏర్పాటు చేసుకున్నారు.
వారే ఆదిలాబాద్‌లోని వాల్మీకినగర్, శ్రీరాంకాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మి, ఎల్లుల అనిత. లక్ష్మి భర్త కూలీ పని చేస్తుండగా, అనిత భర్త ప్రైవేటుగా ఎలక్ట్రిషియన్‌గా చేస్తుంటాడు. వీరు సొంతంగా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరా నిలుస్తూ, తమదైన శైలిలో ఉపాధి పొందుతున్నారు.
కోవిడ్ సమయంలో పాఠశాలలు మూతపడ్డాయి. మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న వీరి తండ్రి గుమ్మల పొచ్చన్న ఉపాధి కోల్పోయాడు. అక్కడే వీరి ఆలోచనలకు అంకురార్పణ జరిగింది. తొలుత తక్కువ మొత్తంలో చపాతి, జొన్న, మునుప వంటి రొట్టెలు, రాగిజావ, అల్లం టీ, గ్రీన్ టీ, ఉడికించిన గుడ్డు వంటివి ఇంట్లోనే చేసి తండ్రి పొచ్చన్న అమ్మకానికి పంపించేవారు. ఆయన స్థానిక గాంధీపార్కు సమీపంలో వీటిని విక్రయించేవాడు. అలా నెలపాటు కొనసాగించగా స్థానికుల నుంచి ఆదరణ లభిస్తుండటంతో చిన్నషెడ్డు వేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు.
లభించే ఫుడ్ ఐటమ్స్
క్యారెజ్ జ్యూస్, బీట్‌రూట్ జ్యూస్, కిరా, కాకరకాయ, సబ్‌జి గింజల జ్యూస్‌లు రూ.20 వరకు లభిస్తాయి. అలాగే గ్రీన్, లెమన్, జీర టీలు, ఇతర రకాలు, పాలు, రాగి సంకటి, రాగి జావలు రూ.6 నుంచి రూ.10 వరకు ఉంటాయి. రొట్టెలలో రాగిరొట్టెలు, మినప, జొన్న, సర్వపిండి రొట్టెలు, చపాతీలు రూ.10 నుంచి రూ.15 లభిస్తాయి. రాగి, నువ్వు, మినుప లడ్డూలు, జొన్న గట్కా, మొలకలు, ఉడికించిన గుడ్డులు లభిస్తాయి. రొట్టెలను ఆర్డర్‌పై చేసి ఇస్తున్నారు.
చాలా బాగుంటాయి
ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. నేను అప్పుడప్పుడు ఇక్కడ నుంచి రొట్టెలు, జ్యూస్‌లు పార్సిల్ తీసుకెళ్తాను.
– అనిల్, శాంతినగర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment