సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాలపై ఆధారపడి చేపట్టిన ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులకు కరెంట్ కష్టాలు తొలగనున్నాయి. ఇన్‌లెట్ సొరంగంలోకి చేరే నీటిని తొలగించడానికి (డీ వాటరింగ్) అయ్యే కరెంటు చార్జీలను ఇకపై ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో సొరంగం పనులు సాఫీగా ముందుకు సాగేందుకు మార్గం సుగమం అయ్యింది. గడిచిన రెండేళ్లుగా నీటిని తోడుతున్న ఏజెన్సీ కరెంట్ బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తోంది. ఈ కారణంగా టీఎస్ ఎస్‌పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో, సొరంగం పనులు ముందుకు సాగడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వలు సమృధ్ధిగా పెరగడంతో అటువైపుగా ఉన్న ఇన్‌లెట్ సొరంగంలోకి భారీగా నీరు చేరింది. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)కు ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది.
మరో 10 కిలోమీటర్లు తవ్వాలి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పదిహేనేళ్లయినా సరి గా ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టును 2005లో రూ.2,813 కోట్లతో చేపట్టగా, 15 ఏళ్లయినా పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం రూ.3,152 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. ఒక సొరంగం పూర్తి కాగా రెండో టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.93 కి.మీ. కాగా, మరో 10.10 కి.మీలకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. అయితే ఈ టన్నెల్ తవ్వకానికి శ్రీశైలం ప్రాజెక్టులో చేరే నీటి నిల్వలతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గడిచిన రెండేళ్లుగా ప్రాజెక్టుకు విపరీతమైన వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండి ఇన్‌లెట్ టన్నెల్‌లోకి భారీగా సీపేజీ నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిల్వ ఎక్కువ ఉన్నప్పుడు నిమిషానికి 5 వేల నుంచి 7 వేల లీటర్ల మేర నీరు ఉబికి వస్తోంది. దీంతో రెండు, మూడు స్టేజీల్లో 20 హెచ్‌పీ, 30 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. దీంతో నెలకు రూ.2 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఏజెన్సీ బిల్లులు చెల్లించడంలో విఫలమవుతోంది. ఇప్పటికి రూ.58 కోట్ల మేర బిల్లులు (ఇరిగేషన్ శాఖ నుంచి ఏజెన్సీకి రావాల్సినవి) పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఎస్‌పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో డీ వాటరింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. రెండేళ్లుగా సొరంగం తవ్వకం పనులు కూడా నిలిచిపోయాయి.
టీబీఎంకు ముప్పు నేపథ్యంలో..
ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ ప్రక్రియ జరగక, ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో టన్నెల్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఇది మరింత పెరిగితే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న టీబీఎం మునగడం ఖాయం. ఇదే జరిగితే టీబీఎం ముఖ్యమైన పరికరాలతోపాటు విద్యుత్ వ్యవస్థ, కన్వేయర్ వ్యవస్థలు బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో భారీ ఆర్థిక నష్టంతో పాటు పనులు కొనసాగించేందుకు మరింత గడువు అవసరమవు తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం కేబినెట్ భేటీ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఈ అంశాన్ని ప్రభు త్వం దృష్టికి తెచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన కేబినెట్ ఇకపై ఏజెన్సీ కాకుండా ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని, కరెంట్ కట్ చేయరాదని విద్యుత్ శాఖను ఆదేశించింది. టన్నెల్ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖకు సూచించింది. కాగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు జి. దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్‌ప్రసాదరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డిండి ఎత్తిపోతలను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు.
ఇక సాఫీగా సొరంగం పనులు!
Published Tue, Aug 3 2021 1:25 AM | Last Updated on Tue, Aug 3 2021 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment