శ్రీశైలంలో ఏపీ కోటా 34 టీఎంసీలే | TS Govt Reiterated AP Should Take Only 34 TMC From Srisailam Reservoir | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో ఏపీ కోటా 34 టీఎంసీలే

Published Fri, Jan 14 2022 2:04 AM | Last Updated on Fri, Jan 14 2022 2:08 AM

TS Govt Reiterated AP Should Take Only 34 TMC From Srisailam Reservoir - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఏటా వరదల సమయం (జూలై–అక్టోబర్‌)లో 34 టీఎంసీల జలాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. చెన్నై నగరానికి తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ (ఎస్సార్బీసీ) ఆయకట్టు కోసం మరో 19 టీఎంసీలు డ్రా చేసుకోవడానికి మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, ప్రధాన కాల్వ, బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్, ఎస్సార్బీసీ నిర్మాణానికి గతంలో సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందని స్పష్టం చేసింది.

34 టీఎంసీలకు మించి జలాలను తీసుకోకుండా ఏపీని నిలువరించాలని కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ ఈ నెల 12న లేఖ రాశారు. చెన్నై నగరానికి తాగునీటి విడుదలపై గత నెల 23న కృష్ణాబోర్డు భేటీలో చర్చకు వచ్చిన అంశాలకు స్పందనగా ఈ లేఖ రాశారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

త్రైపాక్షిక ఒప్పంద ఉల్లంఘన
►1976, 1977లో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం చెన్నై నగర తాగునీటి అవసరాలకు జూలై–అక్టోబర్‌ మధ్య కాలంలో శ్రీశైలం నుంచి పెన్నాకు కాల్వ ద్వారా 15 టీఎంసీల నీటిని తరలించాలి. ప్రవాహం 1,500 క్యూసెక్కులకు మించరాదు. తాగునీరు తప్ప ఇతర అవసరాలకు వాడరాదు. అయితే నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధంగా శ్రీశైలం నుంచి 175 కి.మీ. దూరంలోని చెన్నముక్కపల్లి వద్ద ఆఫ్‌–టేక్‌ పాయింట్‌ (కాలవ చివరి పాయింట్‌)ను ఏర్పాటు చేసింది. 175 కి.మీ. కాల్వను 11,150 క్యూసెక్కుల సామర్థ్యంతో చెన్నముక్కపల్లి వరకు నిర్మించి అక్కడ నుంచి పెన్నా నది వరకు 3 కి.మీ.ల కాల్వను 1,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించింది. ఇది అంతర్రాష్ట్ర ఒప్పంద ఉల్లంఘనే.  
►అంతర్రాష్ట్ర ఒప్పందాల స్ఫూర్తి, ప్రణాళిక సంఘం అనుమతులు, కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పు ప్రకారం చెన్నైకి తాగునీటిని తీసుకెళ్లే కాల్వను సాగునీటి అవసరాలకు వినియోగించరాదు. దీనికి విరుద్ధంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, కాల్వల సామర్థ్యం పెంచింది. ఏటా పోతిరెడ్డిపాడు నుంచి భారీ మొత్తంలో నీటిని మళ్లిస్తోంది. 2021–22లో ఇప్పటికే 112 టీఎంసీలను శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లింది. చెన్నముక్కపల్లి నుంచి పెన్నాకు తరలిస్తున్న నీటి లెక్కలు, సాగుకు వినియోగిస్తున్న నీటి లెక్కలు లేవు.
►సుప్రీంకోర్టు, కృష్ణా ట్రిబ్యునల్‌–2, కేఆర్‌ఎంబీ ముందు వాస్తవాలుంచడానికి అన్ని పాయింట్ల వద్ద నీటి ప్రవాహ లెక్కలను తెలుసుకోవడం తెలంగాణకు అత్యవసరం. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రారంభమయ్యే అన్ని కాల్వలు, చెన్నముక్కపల్లి ఆఫ్‌–టేక్‌ పాయింట్, కండలూరు, పూండి కాల్వల వద్ద సెన్సార్‌ బేస్డ్‌ రియల్‌ టైమ్‌ డేటా అక్విజిషన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. 
►తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా రాజోలిబండ మళ్లింపు పథకం ఆధునికీకరణకు సంబంధించిన అంశా లను కృష్ణా బోర్డు సమావేశాల ఎజెండాలో చేర్చాలి. 

‘ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 45 టీఎంసీలు..’
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ద్వారా 45 టీఎంసీల నికర జలాల వినియోగానికి అనుమతిం చాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ గురువారం లేఖ రాశారు. గోదావరి నుంచి 80 టీఎంసీలను పోలవరం ద్వారా కృష్ణాలోకి మళ్లించేందుకు గోదావరిట్రిబ్యునల్‌ ముందు ఏపీ ప్రభుత్వం 1978లో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుతో కృష్ణాలో అదనపు నికర జలాల లభ్యత ఉండనుందని సుస్పష్టమే. ఈనేపథ్యంలో 45 టీఎంసీల కృష్ణా జలాలకుగాను ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు నిర్మించు కుంటామని 1985 ఆగస్టు 4న నాటి ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీ అనుమతి కోరింది. అయితే పోలవరం ప్రాజెక్టుకు అనుమతిచ్చిన తర్వాతే ఎస్‌ఎల్‌బీసీకి అనుమతులు కోరాలని అప్పట్లో సీడబ్ల్యూసీ చెప్పింది. దీనికి విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టుకు అనుమతులొ చ్చిన తర్వాత కృష్ణా నికర జలాల ఆధారంగా శ్రీశైలం కుడిగట్టు కాల్వ (ఎస్సార్బీసీ) ప్రాజెక్టును నాటి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఎల్‌ బీసీ ద్వారా 45 టీఎంసీల కృష్ణా జలాల వినియోగానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement