యుగానికి అత్యుత్తమ మార్గం క్రియాయోగం: స్వామి చిదానందగిరి  | Spiritual Head Swami Chidananda Giri Speech At Kanha Shanti Vanam | Sakshi
Sakshi News home page

‘క్రియా యోగ సాధన వల్ల మూడు ఫలితాలు’

Published Thu, Feb 16 2023 8:23 PM | Last Updated on Thu, Feb 16 2023 8:23 PM

Spiritual Head Swami Chidananda Giri Speech At Kanha Shanti Vanam - Sakshi

హైదరాబాద్: నిరంతరం దైవంతో ఉండడమే నిజమైన సఫలతకు మార్గమని, నిద్రించే ముందు భగవంతుణ్ణి ధ్యానించాలని, తెల్లవారుజామున దైవ సన్నిధిలోనే మేల్కొని, ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని యోగదా సత్సంగ సొసైటీ/ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి చిదానందగిరి పిలుపునిచ్చారు.

హైదరాబాద్ కన్హా శాంతి వనంలో జరిగిన ఐదు రోజుల సంగం కార్యక్రమాల ముగింపు  సమావేశంలో వేలాదిమంది భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కేవలం తర్కం మీదే ఆధారపడితే అజ్ఞానంలో కూరుకుపోతామని, తర్కాన్ని ఉపయోగించి, ఈ అవిద్య,  మాయ నుంచి పూర్తిగా బయటపడటం కష్టమని, అంతకంటే ఉన్నతమైనదీ, శక్తిమంతమైన ఆయుధం అవసరమని స్వామి చిదానంద గిరి సూచించారు. 

క్రియాయోగం అత్యున్నతంగా ప్రక్షాళన చేసే శక్తులలో ఒకటని, ఆది తామసిక లక్షణాలనుంచి స్వేచ్ఛను కలిగించి సాత్విక లక్షణాలను పెంపొందిస్తుందని స్వామి చిదానంద గిరి చెప్పారు. క్రియా యోగ సాధన వల్ల సాత్వికమైన మెదడు, సాత్వికమైన హృదయం, సాత్వికమైన నాడీమండల వ్యవస్థ అనే మూడు ఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఈ మూడూ సాధించిన వ్యక్తి దృఢ సంకల్పంతో, దయార్ద్ర హృదయంతో తనకూ, సమాజానికి మంచిని చేకూర్చే నిర్ణయాలు తీసుకుని పనిచేస్తాడని, ఇలా ఉన్నతంగా మారిన వ్యక్తుల ద్వారానే ప్రపంచం మరింత మార్పు చెంది సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని ఆయన సందేశమిచ్చారు. 

క్రియా యోగ గురు పరంపరలోని మహాగురువులు, వారి దయా హస్తాలతో  రక్షణ హామీ ఇస్తున్నారని, వారి బోధనలు అనుసరించి, వారిని ప్రార్ధిస్తే ఆత్మ సాక్షాత్కారం తథ్యమని, తద్వారా సాధకుడికి శాంతి, జ్ఞానo, ఆనందం లభిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదని స్వామి చిదానందగిరి చెప్పారు. ధ్యానం ద్వారా ఆత్మాలయం అనే ఆంతరిక దేవాలయంలో ఆత్మ పరమాత్మతో  అనుసంధానం చెందినప్పుడు ఆత్మశక్తులన్నీ జాగృతమవువుతాయని స్వామి చిదానందగిరి చెప్పారు. ప్రతి ఒక్కరూ భగవంతునికి ప్రియతములేనని సందేహించకుండా, క్రమం తప్పకుండా  క్రియ ధ్యానం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. 

ముగింపు కార్యక్రమంలో ప్రపంచవ్యాప్త వై. ఎస్. ఎస్. / ఎస్. అర్. ఎఫ్. భక్త సమూహ ప్రతినిధులుగా నలుగురు భక్తులు వేదికపైకిఎక్కి స్వామి చిదానంద గిరికి పుష్ప గుచ్చాలు సమర్పించారు. క్రియ యోగ పాఠాలు కోరుకునేవారు https://yssofindia.org/te/lessons-programmes లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సమన్వయకర్త నారాయణ రావు (9666665328) తెలిపారు. మరిన్ని వివరాలకోసం రాంచి హెల్ప్ డెస్క్ నెంబర్ కు (0651) 6655 555  ఫోన్ చేయవచ్చని ఆయన సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement