జవాన్లపై పంజా.. 23 మంది బలి!   | Sukma Attack: Deadly Encounter Spreads Terror In Chhattisgarh | Sakshi
Sakshi News home page

జవాన్లపై పంజా.. దండాకారణ్యం రక్తసిక్తం!

Published Mon, Apr 5 2021 1:23 AM | Last Updated on Mon, Apr 5 2021 10:41 AM

Sukma Attack: Deadly Encounter Spreads Terror In Chhattisgarh - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా జొన్నగూడ దగ్గర మావోయిస్టుల దాడిలో మృతిచెందిన జవాన్లు

హైదరాబాద్‌:  నిత్యం రగిలిపోతున్న ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి రక్తసిక్తమైంది. మావోయిస్టు పార్టీ అనుబంధ దండకారణ్య పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్‌ జరిపిన భీకర దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 23కు చేరింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా తెర్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జొన్నగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతి చెందిన వారిలో.. ఎనిమిది మంది కోబ్రా, ఆరుగురు ఎస్‌టీఎఫ్‌ జవాన్లుకాగా, 8 మంది డీఆర్‌జీ, ఒకరు బస్తర్‌ బెటాలియన్‌ జవాన్‌ ఉన్నారు. మరో 30 మంది (10 మంది డీఆర్‌జీ, ఐదుగురు ఎస్‌టీఎఫ్, 15 మంది కోబ్రా) జవాన్లు గాయపడ్డారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని ప్రత్యేక హెలికాప్టర్లలో రాయ్‌పూర్‌కు తరలించగా.. మిగతా 18 మందికి బీజాపూర్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరు జవాన్ల ఆచూకీ లేకుండా పోయినట్టు సమాచారం. వారి కోసం గాలింపు చర్యలు సాగుతున్నా.. అధికారులు ధ్రువీకరించడం లేదు. ఘటనా స్థలం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

పక్కాగా మాటు వేసి.. 
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని జొన్నగూడ, టేకులగూడెం, జీరాగాన్, గోండేం, అల్లిగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో బీజాపూర్‌ జిల్లాలోని తెర్రం నుంచి 760 మంది, ఊసూరు నుంచి 200 మంది, పామేడు నుంచి 195 మంది, సుక్మా జిల్లాలోని మినఫా నుంచి 483 మంది, నర్సాపురం నుంచి 420 మంది.. మొత్తంగా 2,058 మంది డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా, బస్తర్‌ బెటాలియన్‌ విభాగాల జవాన్లు.. ఈ నెల 2న రాత్రి బృందాలుగా విడిపోయి కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న సమాచారంతో భారీగా కూంబింగ్‌కు బయలుదేరారు.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం జొన్నగూడ అటవీ ప్రాంతంలో.. జేగురుకొండ దండకారణ్య పీఎల్‌జీఏ బెటాలియన్‌ కమాండర్‌ హిడ్మా ఆధ్వర్యంలోని మావోయిస్టులు దాడి చేశారు. ముందుగా మందుపాతరలు పేల్చి, తర్వాత రాకెట్‌ లాంచర్లతో దాడికి దిగారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. శనివారం రాత్రి దాకా ఎన్‌కౌంటర్‌ జరిగింది. కొన్ని గంటల పాటు పోరు కొనసాగడంతో పోలీసులకు చెందిన హెలికాప్టర్లు ఆ ప్రాంతంలో దిగేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ శనివారం ఐదుగురు జవాన్ల మృతదేహాలు, ఒక మహిళా మావోయిస్టు మృతదేహం లభించాయి. మిగతావారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపట్టారు. అదృశ్యమైన జవాన్లలో పలువురి మృతదేహాలు జొన్నగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్నట్టు ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఆదివారం పొద్దున 10 గంటల సమయంలో ప్రసారమైంది. దాంతో పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను మొదట తెర్రం పోలీస్‌ స్టేషన్‌కు, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తరలించాయి. 

650 మందికిపైనే మావోయిస్టులు 
సుమారు 650 మందికిపైగా మావోయిస్టులు, మిలీషియా సభ్యులు గుట్టలపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్టు అంచనా. దీనితో జవాన్లు అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలోకి వెళ్లారు. అక్కడ అప్పటికే మాటువేసిన మావోయిస్టు మిలీషియా సభ్యులు జవాన్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలతో పడిపోయిన వారిపై కత్తులతో దాడి చేసి, చిత్రహింసలు పెట్టి చంపారు. సుమారు 20కి పైగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు. పలువురు జవాన్ల మృతదేహాలపై కత్తిపోట్లు ఉన్నాయని, ఓ ఇన్‌స్పెక్టర్‌ చేతిని నరికి తీసుకెళ్లారని చత్తీస్‌గఢ్‌ పోలీసులు చెప్తున్నారు. 

హిడ్మా ఆధ్వర్యంలో దాడి 
మావోయిస్టు జేగురుకొండ ఏరియా దండకారణ్య పీఎల్‌జీఏ బెటాలియన్‌ కమాండర్‌ హిడ్మా ఆధ్వర్యంలో మవోయిస్టులు ఆపరేషన్‌ చేశారు. గతంలో జరిగిన అనేక ఘటనల్లోనూ హిడ్మాదే మాస్టర్‌ ప్లాన్‌. ఒడిశాలోని బలిమెల (36 మంది గ్రేహౌండ్స్‌ జవాన్ల మృతి) ఘటన మినహా చాలా దాడుల్లో హిడ్మా కీలకపాత్ర పోషించాడని పోలీసువర్గాలు చెప్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని తాడిమెట్ల (75 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి), దర్భాఘాట్‌లో మహేంద్రకర్మ సహా 36 మందిని హతమార్చిన ఘటన, మినఫా ప్రాంతంలో 17 మంది జవాన్ల హత్య, బెజ్జి ఘటనలో 16 మంది, బుర్కాపాల్‌లో 25 మంది బలగాల హత్య ఘటనల్లో ప్లాన్‌ హిడ్మాదేనని పేర్కొంటున్నాయి. 

నంబాల కోటేశ్వరరావు పాత్రపై అనుమానాలు 
గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావు ఈ దాడికి ప్రణాళిక రచించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చత్తీస్‌గడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న కేశవరావుది మొదటి నుంచీ దూకుడుగా ఉండే మనస్తత్వమని.. పార్టీకి పునర్వైభవం తేవడం, దండకాణ్యంలో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన కేశవరావు ఆర్మీ తరహాదాడులు, అంబుష్, మెరుపుదాడులు, బాంబుపేలుళ్లకు వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అని.. ప్రస్తుత దాడి వెనక కూడా నంబాల స్కెచ్‌ ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

మృతి చెందిన జవాన్ల వివరాలివీ.. 
డీఆర్‌జీ విభాగానికి చెందిన దీపప్‌ భరద్వాజ్‌ (ఎస్సై), రమేశ్‌ కుమార్‌ (హెడ్‌ కానిస్టేబుల్‌), నారాయణ సోడి, (హెడ్‌ కానిస్టేబుల్‌), రమేష్‌ కొర్సా, సుభాశ్‌ నాయక్‌ (కానిస్టేబుల్‌), కిశోర్‌ అండ్రిక్, సంకురం సోడి, బోసారం కర్టమి (అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లు).  ఎస్‌టీఎఫ్‌ విభాగానికి చెందిన శ్రవణ్‌ కాశ్వా (హెడ్‌ కానిస్టేబుల్‌), కానిస్టేబుళ్లు రాందాస్‌ కోరం, జగత్‌రాం కన్వర్, సుక్‌సింగ్‌ ఫారస్, రాంశంకర్‌ పైక్రా, శంకర్‌నాథ్‌.  కోబ్రా 210 బెటాలియన్‌కు చెందిన దిలీప్‌కుమార్‌దాస్‌ (ఇన్‌స్పెక్టర్‌), రాజ్‌కుమార్‌ యాదవ్‌ (హెడ్‌కానిస్టేబుల్‌), కానిస్టేబుళ్లు శంభురాయ్, ధర్మదేవ్‌కుమార్, శాఖమూరి మురళీకృష్ణ, రాయ్‌, జగదీశ్, బబ్లు రాంబ, రాజేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ బస్తర్‌ బెటాలియన్‌ విభాగానికి చెందిన మడవి సమ్మయ్య  పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మహిళా మావోయిస్టును పామేడు ఏరియా లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌ కమాండర్‌ మడవి వనజగా గుర్తించారు. ఆమె మృతదేహం వద్ద ఒక ఇన్సాస్‌ రైఫిల్‌ను స్వాధీధీనం చేసుకున్నారు. పోలీసుల కాల్పుల్లో సుమారు 12 మంది మావోయిస్టులు మృతిచెందారని, 16 మంది గాయపడ్డారని పోలీసువర్గాలు చెప్తున్నాయి. మావోయిస్టులు వారిని ట్రాక్టర్లలో జబ్బమరక, గొమ్ముగూడ గ్రామాలకు తరలించినట్టు నిఘా వర్గాల సమాచారం అందిందని అంటున్నాయి. 

భద్రత పెంచిన తెలంగాణ పోలీసులు! 
చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడి గురించి తెలియగానే తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రేహౌండ్స్, స్పెషల్‌ పార్టీలు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్‌ చేస్తున్నారు. పలుచోట్ల ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు.

వచ్చే నెలలో పెళ్లి.. ఎన్‌కౌంటర్‌లో మృతి 
తెర్రం ఘటనలో విజయనగరం జిల్లా మక్కువ మండలం కంచేడువలస గ్రామానికి చెందిన రౌతు జగదీశ్‌ కుమార్‌ (27) మృతి చెందాడు. ఆయన 2010లో సీఆర్‌పీఎఫ్‌కు ఎంపికై కోబ్రా దళంలో పనిచేస్తున్నారు. విజయనగరం పట్టణంలోని గాజులరేగలో వారి కుటుంబం నివసిస్తోంది. జగదీశ్‌కు వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఇలాంటి టైంలో ఆయన చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement