సాక్షి, కామారెడ్డి: పల్లె ఇల్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోకి వెళ్లు.. ప్రతి ఇంటి లెక్క పక్కాగా సేకరిస్తారు. అందుకే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ‘స్వమిత్వ’పథకం పేరుతో ఇళ్ల సర్వే మొదలుపెట్టింది. గ్రామకంఠం మొత్తాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించి, వాటి ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఇందుకుగాను పైలెట్‌గా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో ఇప్పటికే పంచాయతీ అధికారులు పని మొదలుపెట్టారు.
పైలట్ గ్రామాలు ఇవే...: కామారెడ్డి జిల్లాలో దోమకొండ మండల కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఆర్లి(కే) గ్రామం, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఇంటింటి సర్వే మొదలైంది. దోమకొండ మండల కేంద్రంలో 3,718 ఇళ్లు, 1,332 ఓపెన్ ప్లాట్లు, ఆర్లి(కే) గ్రామంలో 774 ఇళ్లు, 17 ఓపెన్ ప్లాట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌లో 470 ఇళ్లు, 80 ఇళ్లస్థలాలు, గోధుమకుంటలో 279 ఇళ్లు, 235 ప్లాట్లు, సరస్వతిగూడలో 336 ఇళ్లు, 28 ప్లాట్లు ఉన్నట్టు డ్రాఫ్ట్ మ్యాప్ ద్వారా గుర్తించారు.
చదవండి👉అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు
స్వమిత్వ పథకం అంటే...
సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా(స్వమిత్వ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీస్తారు. ఇళ్లు, ఇంటి చుట్టుపక్కల ఖాళీస్థలం కొలతలు తీసుకుంటారు. ఇంటి యజమాని పేరు, వివరాలు సేకరిస్తారు. ఇరుగుపొరుగు వారి పేర్లు నమోదు చేస్తారు. రోడ్డు ఉంటే ఆ వివరాలు పొందుపరుస్తారు. పెరడు జాగాను కొలుస్తారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని వివరాలను పక్కాగా నమోదు చేసుకుంటారు. సేకరించిన వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
ఉపయోగం ఏంటీ..
ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు ఏవి అవసరమున్నా ఆన్‌లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి విలువ ఆధారంగా బ్యాంకు రుణం పొందడానికి వీలు పడుతుందని అధికారులు అంటున్నారు. ఏ అవసరం ఉన్నా మీ సేవ ద్వారా ఇంటికి, ప్లాటుకు సంబంధించిన వివరాలన్నీ పొందవచ్చు. ఇంటింటి సర్వేలో మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటున్నారు. వివరాల సేకరణ పూర్తయిన తరువాత ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు పంచాయతీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
చదవండి👉చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్..
Comments
Please login to add a commentAdd a comment