
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చిరునామాగా ఉన్న రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ రంగంలోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తోంది. హార్డ్‌వేర్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం అవసరమైన ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సెమీకండక్టర్లు స్థానికంగా లభించడం లేదు. అదీగాక ఆవిష్కర్తలు తమ డిజైన్లకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెట్స్ కోసం విదేశీ తయారీదారులపై ఆధారపడుతున్నా కస్టమ్స్ సమస్యలు, నాణ్యతలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం చొరవతో ఏర్పాటైన ‘టీ వర్క్స్’అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, సెమీకండక్టర్ల పంపిణీలో పేరొందిన ‘మౌసర్ ఎలక్ట్రానిక్స్’తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.
ఆవిష్కర్తల ఆలోచనలకు ‘టీ వర్క్స్’రూపం
హార్డ్‌వేర్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’ను ఏర్పాటు చేస్తోంది. 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ‘టీ వర్క్స్’250 రకాల పరిశ్రమలకు అవసరమయ్యే అత్యాధునిక ఉపకరణాలు అందుబాటులోకి తెస్తోం ది. 3డీ ప్రింటర్లు, యంత్రాల నిర్వహణలో ఉపయోగపడే సీఎన్‌సీ మెషీన్లు, లేజర్ కట్టర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు తయారీ (పీసీబీ ఫ్యాబ్రికేషన్) వంటి అత్యాధునిక ఉపకరణాలు ‘టీ వర్క్స్’లో ఉంటాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు తమ ఆలోచనలకు రూపమిచ్చేందుకు ‘టీ వర్క్స్’ ఉపయోగపడనుంది.
హార్డ్‌వేర్ ప్రోటోటైపింగ్‌కు అవరోధాలు
‘టీ వర్క్స్’నిర్వహించిన ఇండియా స్టార్టప్ హార్డ్‌వేర్ సర్వే ప్రకారం హార్డ్‌వేర్ ప్రొటోటైపింగ్ రంగం అభివృద్దికి కస్టమ్స్ నిబంధనలు, విడి భాగాల కొనుగోలు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. మౌసర్‌తో భాగస్వామ్యం ద్వారా నాణ్యమైన, నమ్మకమైన విడిభాగాలు దొరకడంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం లభిస్తుంది. దీంతో స్టార్టప్‌లు, తయారీదారులు, ఎంఎస్‌ఎంఈలు సులభంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సెమీకండక్టర్లను కస్టమ్స్ సమస్యలు లేకుండా కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. తక్కువ సమయంలో తక్కువ ధరకు స్థానికంగా లభ్యం కాని సంక్లిష్ట విడిభాగాలనూ కొనుగోలు చేయొచ్చు.
మరోవైపు ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సెమీకండక్టర్ల తయారీదారులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంతోపాటు వినియోగదారులకు తయారీదారులను చేరువ చేస్తుంది. వినియోగదారుల డిజైన్లకు అవసరమైన డేటా షీట్లు, డిజైన్ల వివరాలు, సాంకేతిక, ఇంజనీరింగ్ సమాచారాన్ని మౌసర్ ఎలక్ట్రానిక్స్ తన ‘టెక్నికల్ రిసోర్స్ సెంటర్’ద్వారా అందుబాటులోకి తెస్తుంది. మౌసర్ 223 దేశాల్లో 1,100 మంది ఉత్పత్తిదారులకు చెందిన 50లక్షల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 6.30లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ సంస్థతో భాగస్వామ్యం ద్వారా స్థానిక ఆవిష్కర్తలు ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారం దొరుకుతుందని ‘టీ వర్క్స్’సీఈఓ సుజయ్ కారంపూరి ‘సాక్షి’కి ధీమా వ్యక్తంచేశారు.
చదవండి:
Telangana: లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ విడుదల చేసిన టీ సర్కార్
Comments
Please login to add a commentAdd a comment