![Tank Bund Road To Be Closed For Vehicles On Sunday - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/25/Tank-Bund.jpg1_.jpg.webp?itok=YyLLg0HX)
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్ పైకి ఆదివారాల్లో వాహనాలకు నో ఎంట్రీ విధానం అమలు చేస్తున్నారు. దీన్ని ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య కేవలం సందర్శకులకే కేటాయించారు. ఈ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయించారు. ఆయన నుంచి ఆదేశాలు అందుకున్న క్షేత్రస్థాయి అధికారులు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ విధానం అమలుకు కసరత్తు చేస్తున్నారు.
(చదవండి: ఇంట్లో మృతిచెందినా పరిహారం)
ఈ ఆదివారం (సెప్టెంబర్ 26వ తేదీ) నుంచే దీన్ని కార్యరూపంలోకి తేవాలని భావిస్తున్నారు. గత నెల 24న అశోక్ చంద్రశేఖర్ అనే నెటిజనుడు చేసిన ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ ఆదివారాల్లో ట్యాంక్‌బండ్‌ను సందర్శకులకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు విభాగాన్ని సూచించారు. దీంతో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్న ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులు గత నెల 29వ తేదీ నుంచి దీన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఇటీవల ప్రభుత్వం సైతం భారీగా నిధులు వెచ్చించి ట్యాంక్‌బండ్‌ను సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టింది. దీనికి తోడు ఆదివారం సాయంత్రం వేళల్లో వాహనాలను నో ఎంట్రీ జోన్‌గా మార్చడంతో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.
ఈ విధానం అమలైన తొలిరోజు స్వయంగా నగర కొత్వాలే ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లి సందర్శకులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మూడు ఆదివారాలు ఈ విధానం అమలు కాగా.. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గత వారం సాధ్యం కాలేదు. ఆ ప్రాంతానికి వస్తున్న సందర్శకుల తాకిడి, వారి అభిప్రాయాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటి ఆధారంగా మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ను సందర్శకులకే కేటాయించాలని నిర్ణయించారు.
ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకుల కోసం దానిపైనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. రెండు పక్కలా పార్కింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే సందర్శకుల వాహనాలకు లేపాక్షి వరకు, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాటికి చిల్డ్రన్ పార్క్ వరకు పార్కింగ్‌కు కేటాయించారు.
(చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం)
Glimpses of Sunday-Funday @TankBund yesterday @KTRTRS @HMDA_Gov pic.twitter.com/1mldNxzug3
— Arvind Kumar (@arvindkumar_ias) September 13, 2021
Comments
Please login to add a commentAdd a comment