టీనేజీలోనే గంజాయి | teen ganja addicts on rise: telangana | Sakshi
Sakshi News home page

టీనేజీలోనే గంజాయి

Published Sat, Oct 12 2024 5:59 AM | Last Updated on Sat, Oct 12 2024 5:59 AM

teen ganja addicts on rise: telangana

15–19 ఏళ్ల వయస్సులోనే మద్యం, సిగరెట్, డ్రగ్స్‌కూ బానిసలు

గంజాయికి బానిసలుగా 5.5% మంది.. మద్యం తాగేవారు 22%  

మానసిక రుగ్మతలూ పిల్లల్లోనే అధికం..14 ఏళ్లలోపే మొదలు 

టీనేజీలోని ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక వ్యాధిగ్రస్తులు 

ప్రపంచ ఆరోగ్య సంస్థ,  యూనిసెఫ్‌ తాజా నివేదిక వెల్లడి 

సరైన చట్టాలు, సామాజిక భద్రత,  ఆర్థిక భరోసా అవసరమని స్పషీ్టకరణ

సాక్షి, హైదరాబాద్‌: గంజాయి, మద్యం, సిగరెట్, డ్రగ్స్‌ వినియోగం, వాటికి బానిసలై పోవడం సాధారణంగా యువకులు, పెద్దల్లోనే చూస్తుంటాం. కానీ టీనేజ్‌ పిల్లలు కూడా ఈ చెడు అలవాట్లకు ఎక్కువగా లోనవుతున్నారట. ఆ మాటకొస్తే పిల్లల్లో ఎక్కువ శాతం గంజాయి సేవిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మానసిక రుగ్మతల కారణంగా టీనేజీ పిల్లలు ఈ వ్యసనాల బారిన పడుతుండటం. మానసిక సమస్యలు కూడా పెద్దవారికే అధికంగా ఉంటాయని అనుకుంటాం. కానీ పెద్ద వయస్సు వారికంటే యువతీ యువకుల్లోనే మానసిక రుగ్మతలు అధికంగా ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), యూనిసెఫ్‌ (ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)లు తేలి్చచెప్పాయి.

‘యువకులు, చిన్న పిల్లల మానసిక ఆరోగ్యంపై మార్గదర్శకత్వం’పేరుతో డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్‌ తాజాగా ఓ నివేదిక విడుదల చేశాయి. ఐదేళ్ల నుంచి 24 ఏళ్లలోపు వారికి సంబంధించిన మానసిక సమస్యలపై పలు ఆసక్తికర అంశాలను పొందుపరిచాయి. మానసిక రుగ్మతల నుంచి టీనేజీ పిల్లలను రక్షించాలంటే చట్టాలు సరిగా ఉండాలని, సామాజిక భద్రత..ఆర్థిక భరోసా ఉండాలని, మౌలిక సదుపాయాలు కలి్పంచాలని సూచించాయి. నివేదికలో ఏముందంటే.. 

పెద్దలు తట్టుకుంటారు.. పిల్లలు కుంగిపోతారు 
మూడో వంతు మానసిక సమస్యలు 14 ఏళ్లలోపే మొదలవుతాయి. అందులో సగం 10 ఏళ్లలోపే ప్రారంభం అవుతాయి. 15–19 ఏళ్ల వయస్సు బాల బాలికల్లో మద్యం తాగేవారు 22 శాతం ఉన్నారు. అలాగే పెద్దల కంటే టీనేజీ పిల్లల్లోనే గంజాయి వాడకం ఎక్కువగా ఉంది. ఆ వయస్సు వారిలో 5.5 శాతం మంది టీనేజీ పిల్లలు గంజాయి తాగుతున్నారు. ఆ వయస్సులోనే మద్యం, డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. 13–19 ఏళ్ల మధ్య వయస్సులోని టీనేజీ పిల్లల్లో ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక రుగ్మత ఉంది. పెద్ద వారు మానసిక సమస్యలను తట్టుకోగలరు. కానీ చిన్న పిల్లలు తట్టుకోలేరు. చదువు, కెరీర్‌ వంటివి వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. 15–19 మధ్య వయస్సు వారిలో మానసిక సమస్యలు అత్యధికంగా 15 శాతం ఉండటం గమనార్హం. ఆ వయస్సులో చదువు కీలకమైన దశలో ఉంటుంది. కెరీర్‌ను నిర్ణయించుకునే దశ, ప్రేమలు, ఆకర్షణలు వంటివి

వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆ వయస్సువారే వివిధ మానసిక కారణాల వల్ల నేరస్థులుగా మారుతున్నారు. ఆత్మహత్యలూ 15–24 ఏళ్లలోపు వారిలోనే అధికంగా ఉంటున్నాయి. అందులో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. బాలికలు ఎక్కువగా భావోద్వేగపరమైన ఒత్తిడికి (ఎమోషనల్‌ డిస్టర్బెన్స్‌) గురవుతుంటారు. పిల్లల్లో కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వంటివి కూడా మానసిక రుగ్మతకు సంబంధించిన అంశాలే. పెద్దవారిలో డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి కీలకంగా ఉంటాయి. అతిగా తినడమూ, తక్కువ తినడమూ మానసిక వ్యాధి లక్షణాలే. 40 ఏళ్లలోపు వరకు మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. 70 ఏళ్లు పైబడిన వారిలో మతిమరుపు వస్తుంది.  

ఏ వయస్సు వారిలో మానసిక రుగ్మతలు ఎంత శాతం అంటే.. 
 5–9 మధ్య వయస్సు వారిలో 8 శాతం  
10–14 ఏళ్లు 15 శాతం  
15–19 ఏళ్లు 15 శాతం  
 20–24 ఏళ్లు 14 శాతం  
 25–29 ఏళ్లు 13 శాతం 
30–34 ఏళ్లు 12 శాతం 
 35–39 ఏళ్లు 11 శాతం 
 40–44 ఏళ్లు 9 శాతం 
 45–49 ఏళ్లు 7 శాతం 
 50–54 ఏళ్లు 6 శాతం 
 55–59 ఏళ్లు 5 శాతం 
 60–64 ఏళ్లు 3 శాతం 
 65–69 ఏళ్లు 3 శాతం 
70 ఏళ్లకు పైబడి 2 శాతం 

ప్రాథమిక ఆరోగ్యంలో ఇది భాగం కావాలి 
లింగ భేదాలు కూడా మానసిక సమస్యలకు కారణంగా ఉంటున్నాయని ఆ నివేదిక తేలి్చంది. పురుషులు కుటుంబ బాధ్యతలు, అనేక ఇతర సమస్యలతో మద్యానికి బానిసలవుతున్నారు. అలాగే బయటకు చెప్పలేని పరిస్థితులూ ఉంటున్నాయి. ఉద్యోగం, ఉపాధి, ఆర్థికంగా నిలదొక్కుకోవడం వంటివి ఇబ్బందికి గురిచేస్తాయి. మానసిక రుగ్మతలకు వైద్యం చేసే పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రాథమిక ఆరోగ్యంలో కలపాలి. ప్రస్తుతం ప్రాథమిక, జిల్లా ఆసుపత్రుల్లో మానసిక సమస్యలకు సంబంధించిన వైద్యులు లేకపోవడాన్ని నివేదిక ఎత్తి చూపింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యంపై ఆయా దేశాల బడ్జెట్లలో కేవలం 0.1 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. 80 శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యంపై ఒక ప్రత్యేక వ్యవస్థ అనేది లేనేలేదు.  – డాక్టర్‌ కిరణ్‌ మాదల, ప్రొఫెసర్‌ అనెస్థీíÙయా, గాంధీ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌  

నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..
టీనేజీ పిల్లలు బయటి పరిస్థితులు, ఇంటి పరిస్థితులకు మధ్య ఘర్షణతో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు.  
5–9 ఏళ్ల పిల్లలపై స్నేహితులు, తల్లిదండ్రులు పెంచే విధానం, స్కూలు, పరిసరాల ప్రభావం ఉంటుంది.  
 ఆర్థిక, సామాజిక, లింగపరమైన అసమాన త్వం, సామాజిక బహిష్కరణ వంటి వాటి వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు.  
 పేదరికం, యుద్ధ వాతావరణంలో ఉండే పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో తల్లి మద్యానికి బానిసైతే పుట్టే పిల్లల్లో మానసిక సమస్యలు రావొచ్చు.  
   తల్లిదండ్రులకు మానసిక సమస్యలుండటం, తల్లిదండ్రులు..కుటుంబ కలహాలు, తల్లిదండ్రులు విడిపోవడం, పిల్లలను హాస్టళ్లలో చేర్చ డం వంటివి కూడా ప్రభావితం చేస్తున్నాయి.  
   మానసిక రుగ్మతకు గురైన వారికి త్వరగా చికిత్స చేస్తే పెద్దయ్యేసరికి మొండిజబ్బుగా మారకుండా చూసుకోవచ్చు. 
  కరోనా సమయంలో అన్ని వయస్సుల వారిలో మానసిక వ్యాధులు 25 శాతం పెరిగాయి. ఉద్యోగాలు పోవడం, చదువు మధ్యలో ఆపేయడం, ఆప్తుల్ని కోల్పోవడం, ఆసుపత్రుల పాలు కావడం లాంటి అనేక కారణాలతో మానసిక సమస్యలు పెరిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement