
సాక్షి, నల్లగొండ: ఫొటోలోని ఈ రాతి శిథిలాలు కాకతీయ గణపతిదేవ చక్రవర్తి హయాంలో 13వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ పచ్చల పార్వతీ సోమేశ్వర ఆలయానివి. నల్లగొండ జిల్లా సూర్యాపేట–నకిరేకల్ రోడ్డు వెడల్పులో భాగంగా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామంలోని ఈ ఆలయాన్ని మరోచోట పునర్నిర్మించేందుకు ఇలా విప్పదీసి కుప్పగా పోశారు. పదేళ్లుగా పట్టించుకునేవారే కరువయ్యారు.
దీంతో రాళ్లపై వేసిన వరస సంఖ్యలు కూడా చెరిగిపోయాయి. ఇప్పుడు వాటి క్రమపద్ధతి తెలుసుకోవటం కూడా కష్టమే. శుక్రవారం వాటిని ప్రముఖ స్తపతి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి.. గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. వెంటనే ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరారు.