సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం భట్టుగూడెం గ్రామ శివారులోని గుడిలో అరుదైన శిల్పాల అమరికను చరిత్ర పరిశోధకులు గుర్తించారు. శివాలయానికి ద్వారపాలకులుగా బ్రహ్మ, భైరవుల విగ్రహాలుండటాన్ని కనుగొన్నారు. దీంతో పాటు ద్వార శాఖలపై శంఖనిధి, పద్మ నిధుల శిల్పాలు స్త్రీ రూపంలో ఉన్నట్టు గుర్తించారు. చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం ఆలయాన్ని పరిశీలించి ఈ ప్రత్యేకతలు గుర్తించారు.
శిల్పాల ప్రత్యేకతలపై కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు సువర్ణమహిలతో చర్చించి వాటి వివరాలను వెల్లడించారు. ప్రతిమా లక్షణాల ఆధారంగా ఇవి ఏడెనిమిది శతాబ్దాలకు చెందిన పల్లవ శైలిని పోలిన బాదామీ చాళుక్య శిల్పాలని, భైరవుడు త్రిభంగిమలో 4 చేతులతో ఉన్నాడని చెప్పారు. కుడి చేతిలో గద, ఎడమ చేతిలో పాత్ర, ఎగువ కుడి చేతిలో ఢమరుకం, ఎడమ చేతిలో శూలం ధరించి ఉన్నాడన్నారు.
గదలతో బ్రహ్మ, భైరవులు
సమపాద స్థానంలో ఉన్న బ్రహ్మ కుడిచేతో గదను ధరించాడని, ఎడమ చేతిని కటిహస్తంగా, పై చేతుల్లో అక్షమాల, గిండిలను, ఒంటిపై ఆభరణాలు ధరించినట్టు శివనాగిరెడ్డి పేర్కొన్నారు. చేతుల్లో గదలు ధరించి, ద్వారపాలకులుగా బ్రహ్మ, భైరవులుండటం అత్యంత అరుదన్నారు. భైరవకోన గుహలో మాదిరిగా భైరవుడు కోర పళ్లను కలిగి ఉన్నాడని, అక్కడ ద్వారపాలకులుగా విష్ణువు, బ్రహ్మలుంటే ఇక్కడ బ్రహ్మ భైరవులున్నారని, రాష్ట్రంలో ఇలాంటివి చూడలేదని తెలిపారు. నాగిరెడ్డి వెంట బుద్ధవనం ప్రాజెక్టు అధికారి శ్యాంసుందర్, స్థానికులు వెంకటరెడ్డి, సైదిరెడ్డి, శంకరరెడ్డి, లింగయ్య, విష్ణు, యాదగిరి తదిరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment