పూర్తయిన సప్తతల మహారాజ గోపురం, పంచతల రాజగోపురాల వ్యూ
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాకతీయులు, చాళుక్యుల శిల్పకళా రీతులకు అనుగుణంగా లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం 90 శాతం పనులు పూర్తయ్యాయి. మహారాజగోపురం, దివ్య విమాన గోపురం, నాలుగు దిక్కుల పంచతల రాజగోపురాలు, ఆలయ మండపాల నిర్మాణం శిల్ప సౌందర్య సమాహారంగా రూపుదిద్దుకుంది. వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ ఆలోచనలకు అద్దంపట్టే విధంగా స్తపతులు, ఆర్కిటెక్ట్‌లు ప్రపంచ స్థాయి ఆలయంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆలయ నిర్మాణంలో వ్యాలీపిల్లర్లు, ఆళ్వారు పిల్లర్లు, ఔటర్ ప్రాకారంలో బాలపాదం పిల్లర్లు.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్లేలా ఉన్నాయి. లక్ష్మీనరసింహ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, యాదాద్రి దివ్యక్షేత్రం చరిత్రను స్తపతులు కృష్ణ శిలల్లో తీర్చిదిద్దారు.
డాక్యుమెంటరీ నిర్మాణం.. : యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. భవిష్య త్ తరాలకు ఆలయ నిర్మాణ శైలి, నిర్మాణం జరిగిన తీరు వంటి పలు అంశాలను తెలియజెప్పేందుకు దీనిని నిర్మిస్తున్నారు. యాదగిరిగుట్టకు నాలుగు దిక్కుల నుంచి.. ఎటువైపు నుంచి చూసినా ఆలయం కనిపించేలా మహోన్నత శిల్పగ్రామంగా తీర్చిదిద్దారు. తంజావూరులోని బృహదీశ్వరాలయం ప్రధాన రాజగోపురం తరహాలో వెయేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా యాదాద్రిలో రాజగోపురాల నిర్మాణం చేపట్టారు. ఇందులో మహారాజ గోపురం (79 అడుగులు), గర్భాలయంపై దివ్యవిమాన గోపురం (40 అడుగులు), నాలుగు దిక్కులా ఐదంతస్తుల రాజగోపురాల (55 అడుగులు)ను పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మించారు. యాదాద్రిలో మండపంలో కూర్చున్న వారు స్వామివారి నిత్య కల్యాణాన్ని వీక్షించే విధంగా నిర్మాణాలను డిజైన్ చేశారు.
జైపూర్ నుంచి జైన శిల్ప కళాకృతులు..
కాగా, జైన ఆలయ రీతుల్లో కూడా యాదాద్రిలో శిల్పాకృతులను ఏర్పాటు చేయనున్నారు. జైన శిల్పకళా ఖండాలను జైపూర్‌లో తీర్చిదిద్దుతున్నారు. ఆ శిల్పాలు త్వరలో ఇక్కడికి రాబోతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, బాహ్య ప్రాకారంలో 153 బాలపాదాల పిల్లర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పిల్లర్‌ను తయారు చేయడానికి ఒక్కో శిల్పికి మూడు నెలల సమయం పట్టిందని చెబుతున్నారు. బాలపాదం ప్రతి స్తంభంపైన నవనారసింహ అవతారాలు, సింహం, ఏనుగులు, హంసలు, పుష్పాలు ఇలా.. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలే విధంగా రమణీయంగా అష్టభుజి మండపాలను తీర్చి దిద్దుతున్నారు. ఇతర దేవాలయాల్లో ఆళ్వార్లు కూర్చుని ఉన్న భంగిమలో భక్తులకు దర్శనం ఇస్తారు. కానీ యాదాద్రిలో ఆళ్వార్లు నిలబడి ఉన్న భంగిమలో భక్తులకు దర్శనం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత అని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment