సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నుంచి రాష్ట్ర యువతను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ విక్రయించే వారిని ఎన్‌కౌంటర్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ నియంత్రణకోసం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై ఆదివారం ఆయన వీడియో సందేశం ద్వారా స్పందించారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారని, అమ్మేవారిని, కొనేవారిని కఠిన శిక్షించకపోతే ఇది మరింత ముదిరే ప్రమాదముందని రాజాసింగ్ హెచ్చరించారు.
డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేవైఎం యత్నం.. రాష్ట్రంలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా అవుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, పోలీస్ శాఖ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా విభాగం ఆదివారం డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించింది. బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో అధికారపార్టీ నాయకుల కుటుంబీకులు, వీఐపీల పిల్లలు, ఇతర ప్రముఖులున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని వారిని వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరపాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని, డ్రగ్స్ ఎవరి నేతృత్వంలో వస్తున్నాయో తేల్చాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment