సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మోత మోగించేందుకు బీజేపీ సిద్ధమైంది. దీపావళి దాకా వచ్చే 7, 8 రోజులు గ్రామస్థాయిలో, ఆ తర్వాత చివరి వారంరోజులు మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించనుంది. ఇప్పటిదాకా ఒక మోస్తరుగా సాగిన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నుంచి 10 మంది స్టార్ క్యాంపెయినర్లు వేడెక్కించనున్నారు.
వెయ్యిమంది చొప్పున జనం పాల్గొనేలా 200 గ్రామసభలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 1, 13, 17 వార్డుల్లో, జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చౌటుప్పల్ మండలంలోని ఎస్.లింగోటం, పీపల్‌పహాడ్, తూప్రాన్‌పేటలో, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో, సినీనటుడు బాబూమోహన్ నాంపల్లి మండలంలోని గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహిస్తారు.
ఆదివారం ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాంపల్లి మండలంలోని మహ్మదాపురం, దామెర, బీటీపురం, దేవత్‌పల్లిలో, కిషన్‌రెడ్డి మునుగోడు మండలంలోని మునుగోడు, చీకటి మామిడిలో ప్రచారకార్యక్రమాల్లో పాల్గొంటారు.
6 మండలాల్లో సంజయ్ రోడ్ షో
ఈ నెల 18 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 12 రోజులు మునుగోడులోనే బస చేయనున్నారు. 6 మండలాల్లో ఆరురోజులు వరుసగా రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించనున్నారు. వీరితోపాటు స్టార్ క్యాంపెయినర్లు మురళీధర్‌రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, విజయశాంతి ఐదారు రోజులపాటు తమకు కేటాయించిన గ్రామాల్లోని పోలింగ్‌బూత్ స్థాయిల్లో ప్రచారం నిర్వహిస్తారు. రాష్ట్ర బీజేపీ మహిళ, ఎస్సీ, యువ, ఇతర మోర్చాల ద్వారా ప్రచారానికి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
20 మహిళా మోర్చా బృందాలు పోలింగ్‌బూత్ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఆడవారికి బొట్టుపెట్టి కరపత్రమిచ్చి పార్టీ గుర్తు, అభ్యర్థి పేరును ప్రచారం చేస్తాయి. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళితవాడల్లో సమావేశాలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేస్తారు. దీపావళి తర్వాత తుదిదశ ప్రచారంలో భాగంగా 7 మండల కేంద్రాలు, 2 మున్సిపాలిటీలలో రెండేసీ చొప్పున నిర్వహించే పెద్ద బహిరంగసభల్లో సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలతోపాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. నెలాఖరులో నిర్వహించే ప్రచార ముగింపు బహిరంగసభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాగానీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌గానీ పాల్గొననున్నట్టు సమాచారం.
ఢిల్లీ బృందాల ప్రత్యక్ష పర్యవేక్షణ
మునుగోడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్రపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారా లేదా అన్నదానిపై ఢిల్లీ బృందాలు గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మోహరించిన ఈ బృందాలను ఢిల్లీ నుంచి జాతీయ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తీరుపై రాష్ట్రనాయకులు టెలీ కాన్ఫరెన్స్‌లు, ఇతరత్రా రూపాల్లో ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment