
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.
కాగా బడ్జెట్‌లోని అంశాలపై 12 నుంచి చర్చ జరగనుంది. ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తుండగా, గురువారం స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పారీ్టల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు.
సకాలంలో సమాధానాలు ఇవ్వండి
శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఉభయ సభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వడంతో పాటు సమావేశాలు సజావుగా నడిచేందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ఆఫీసర్ బాక్సులో అధికారులు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అన్నారు.
పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించే పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తా చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భద్రత, లాబీల్లోకి సందర్శకులు గుంపులుగా రావడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశాలు జరిగే సమయంలో మంత్రులు అందుబాటులో ఉండాల ని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కోరారు.
ప్రోటోకాల్‌లో తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్‌బాబు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు వచ్చేలా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రస్తుత సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని అన్నారు. ప్రోటోకాల్ విషయంలో గతంలో తాను కూడా బాధితుడినని గుర్తు చేశారు.
త్వరలో ఓరియెంటేషన్ కార్యక్రమం
మండలిని అసెంబ్లీ ప్రాంగణంలోకి త్వరితగతిన తరలించేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు చెప్పారు. తొలిసారిగా శాసనసభ, శాసనమండలికి ఎన్నికైన సభ్యుల కోసం రెండురోజుల ఓరియెంటేషన్ కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేస్తా మన్నారు. ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు, లెజిస్లేచర్ అడ్వైజర్ ప్రసన్నకుమార్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించాలనే నిర్ణయం నేపథ్యంలో బుధవారం మండలి చైర్మన్, స్పీకర్ తదితరులు పాత అసెంబ్లీ భవనంలోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment