సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్లాలని, కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే దేశం బాగుపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. 2024లో ఢిల్లీ గడ్డపై మన ప్రభుత్వమే రాబోతోందని చెప్పారు. నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తుందని, మన ప్రభుత్వం వచ్చాక దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. మన ప్రభుత్వం వచ్చేలా తెలంగాణ నుంచే దేశం కోసం రాజకీయ పోరాటం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశ రాజకీయాలకు వెళదామని.. ఎంతకైనా తెగిద్దామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో దన్నుగా నిలిచిన నిజామాబాద్ జిల్లా నుంచే జాతీయ రాజకీయాల ప్రకటన చేస్తున్నానని చెప్పారు. సోమవారం నిజామాబాద్‌లో నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభించిన తర్వాత స్థానిక గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంట..
గతంలో శ్రీరాంసాగర్ వరద కాలువకు మోటార్లు పెట్టని చ్చారా? ఇప్పుడు మోటార్లు పెట్టుకుంటే ఎవరైనా అడుగు తున్నారా?కానీ అడగాలని కేంద్రం అంటోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ప్రభుత్వం అడగడం వెనుక మతలబేంది? దేశంలో రైతులు వాడుకునే విద్యుత్ కేవలం 20.8 శాతమే. దీని విలువ రూ.1.48 లక్షల కోట్లు మాత్రమే. అయినప్పటికీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ప్రభుత్వం చెబుతోంది.
కార్పొరేట్ కంపెనీల్లో కూలీల్లా పనిచేయాలంట..
మరోవైపు నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏలు) కింద కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు మాఫీ చేసింది. కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి రైతులకు మేలు చేసేందుకు మాత్రం చేతులు రావడం లేదు. విమానాలు, రైళ్లు, ఓడరేవులు, ఫ్యాక్టరీలు, బ్యాంకులను అమ్మిన కేంద్రం.. ఇక మిగిలిన రైతుల వ్యవసాయ భూములను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి రైతులను అందులో కూలిపని చేయాలంటోంది. ఎరువుల ధరలు పెంచుతారు. ధాన్యం కొనరు. వ్యవసాయం, పంటలు, రైతుల విషయంలోనూ అన్నీ కుట్రలే. అన్నిరంగాల్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దేశ రాజకీయ ప్రస్థానాన్ని బ్రహ్మాండంగా కొనసాగిద్దాం. దేశ రాజకీయాలకు వెళదామా? ఎంతకైనా తెగిద్దామా? (అని ముఖ్యమంత్రి అనగానే ప్రజలు ‘దేశ్ కీ నేతా కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు).
మీటర్లు పెడతా అన్నోడికే మీటర్ పెట్టాలి..
తెలంగాణ నుంచే దేశం కోసం పోరాటం చేయాలి. మన బావి వద్ద మీటర్లు పెడతా అన్నోడికే మీటర్ పెట్టాలి. అట్లయితేనే బాగుపడతాం. అమెరికాకు సైతం లేని గొప్ప వరం భారత్‌కు ఉంది. దేశంలోని 83 కోట్ల ఎకరాల్లో 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూల భూములు. గంగా, కావేరి, గోదావరి, కృష్ణా లాంటి నదులున్నాయి. మోదీ ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టు, కొత్త ఫ్యాక్టరీ కట్టిందా? అన్నీ ఖతం చేసి మనల్ని శంకరగిరి మాన్యాలు పట్టించి కూలి పని చేసేలా చేస్తోంది. ఇలాంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలి. దళిత, గిరిజన, మహిళ, బలహీన వర్గాల ఆలోచన లేని మోదీ దేశం పరువు తీస్తున్నారు. అహంకారం, బలుపుతో రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టే పని పెట్టుకున్నారు. దేశం ఆరోగ్యకర రాజకీయాలతోనే బాగుపడుతుంది. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనకుండా లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి. అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇటీవల అన్ని రాష్ట్రాల రైతులు తెలంగాణకు వచ్చారు. ఇండియా కోసం పిడికిలి బిగించాలని కోరుతున్నారు. దేశ రాజకీయ ప్రస్థానాన్ని బ్రహ్మాండంగా కొనసాగిద్దాం.
పచ్చని పంటలు కావాలా? రక్తపాతం కావాలా?
నిజాంసాగర్, సింగూరు కాలువల్లో నీరు పారాలా? మతపిచ్చితో రక్తం పారాలా? .. పచ్చని పంటలు కావాలా? రక్తపాతం కావాలా? కూలగొట్టడం సులభం. ఒక్కసారి దేశం దెబ్బతింటే వందేళ్లయినా కోలుకోం. ప్రతిఒక్కరూ సమాజంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. లేకుంటే దెబ్బతింటాం. గత నాయకత్వం తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపితే 60 సంవత్సరాలు కొట్లాడాం. అనేకమంది అమరవీరులు చనిపోయారు. నేను చావు అంచులకు వెళ్లి వచ్చా. రాష్ట్రం సాధించాక బాగుచేసుకోవడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. పేదలను అదుకుంటున్నాం. ఎనిమిదేళ్ల క్రితం ఎలా ఉండేది. ఇప్పుడు 24 గంటలు అత్యుత్తమ విద్యుత్ ఇచ్చే రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో 3,600 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. గిరిజన బిడ్డలు మా తండాలో మా రాజ్యం అంటూ బాగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో జీడీపీ పెరిగింది. తలసరి ఆదాయం పెరిగింది. కొద్ది రోజుల్లో సింగూరు కాలువలకు కాళేశ్వరం నుంచి నీరు రానుంది. నిజామాబాద్ జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలో ఏం జరుగుతోందో, ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.
ఇదీ చదవండి: ప్రధాని మోదీ తర్వాతి టార్గెట్ రైతుల భూములే: సీఎం కేసీఆర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment