అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతోంది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన రూ.లక్షల కోట్లను నిస్సిగ్గుగా హరిస్తోంది. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ, నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తోంది..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను కేంద్రం తక్షణమే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం గురువారం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అంతకు ముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ప్రోత్సాహం లేదు..నిధుల్లేవు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రం వివక్ష చూపుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా వ్యవహరిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. దీనితో లోయర్ సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని కోల్పోయాం. కేంద్ర వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. ఆనాటి నుంచి నేటివరకూ రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనేకమార్లు ప్రధానమంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనా క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క నయా పైసా అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయంగా రావల్సిన నిధులపై కోత విధించింది. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించి, వీటికి రావాల్సిన నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. ఐదేళ్ల పాటు హైకోర్టును విభజించకుండా కేంద్రం తాత్సారం చేసింది.
పునర్విభజన హామీలు బుట్టదాఖలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల పునర్విభజన జరపాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా ఉన్నా, కేంద్రం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేస్తోంది. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఈ చట్టం పేర్కొంది. కానీ చెప్పుకోదగ్గ ప్రోత్సాహకా లు ఏవీ ఇవ్వలేదు. హామీలన్నీ బుట్టదాఖలు చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటులో అతీగతీ లేదు. రాష్ట్రంలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా అన్యాయం చేసింది. ఇది అమలు చేసి ఉంటే ఐటీ రంగం మరింతగా పురోగమించి, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి.
బధిర శంఖారావంగా రాష్ట్ర విన్నపం
ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులు మన దేశంలోనే వైద్యవిద్య కొనసాగించేలా వీలు కల్పించాలని మోదీకి లేఖ రాశా. రాష్ట్ర విద్యార్థుల చదువులకయ్యే ఖర్చులను భరించడానికి సిద్ధమని తెలియజేశా. కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మిగిలిపోవడం విషాదకరం.
రాష్ట్రమే ధాన్యం కొంటోంది
తెలంగాణ రైతుల పంటల కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అసమర్థతతో చేతులెత్తేసింది. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు, దీక్షలు చేశాం. అయినా స్పందన లేదు. ఆ విధంగా కేంద్రం మొండి చెయ్యి చూపినా, ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించింది. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి భరోసా ఇస్తున్నా.
విద్యుత్ సంస్కరణలకు నో
రైతాంగానికి నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదు. కేంద్రానికి తలొగ్గి ఈ సంస్కరణలు అమలు చేయనందుకు రాష్ట్రం ఏటా రూ.5 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల రుణాలను నష్టపోవాల్సి వస్తోంది. వీటి కోసం రైతుల బావుల వద్ద మీటర్లు పెట్టి వారి నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలి. కానీ, రైతులపై భారం మోపేందుకు సిద్ధంగా లేము.
రాష్ట్రాల స్వయంప్రతిపత్తి ఏదీ..
75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశ ప్రజా స్వామ్యం పరిణితి చెంది అధికారాల వికేం ద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తి కుంచించుకుపోతోంది. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయి. కా లం గడిచేకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతూ, రాష్ట్రజాబితా తరుగుతోంది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి నామావశిష్టమైపోతోంది.
విద్వేషపూరిత రాజకీయాలతో ప్రమాదం
దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి విలవిల్లాడుతోంది. మత పిచ్చి తప్ప వేరే చర్చలేదు. మత ఘర్షణలతో రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెం డా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పేట్రేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం. అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశా ల్లో ఉపాధి పొందుతున్న కోట్లమంది ప్రవా సభారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషపూరిత వాతావరణం దేశాన్ని వందేళ్లు వెనుకకు తీసుకపోవ డం ఖాయం. నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం నా విధి. విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం మనందరి బాధ్యత. ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టి రాజీపడే ప్రసక్తే లేదు. రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్లమా? మృత్యువు నోట్లో తలదూర్చి మరీ విజయం సాధించగలిగే వాళ్లమా?
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు’ అనే కుట్రపూరిత, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుంది. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకుంది. కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాలరాశాయి.
దేశ సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారత నిర్మాణానికి జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలి.
నూతన విధానాలకు తగు వేదికలు రావాలి
దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకుపోతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశాన్ని దారిద్ర్యం ఎందుకు పీడిస్తోంది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టం చేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపై గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రజల జీవితాల్లో మౌలిక పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. దేశ ప్రజలకు కావల్సింది కరెంటు, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగు వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే శక్తియుక్తులను భగవంతుడు మనందరికీ ప్రసాదించాలి.
Comments
Please login to add a commentAdd a comment