చండూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభకు హాజరైన కార్యకర్తలు, ప్రజలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, ఆ తీర్పు దేశం నలుదిక్కులా పిక్కటిల్లేలా వినిపించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి సొంత వ్యాపారాల కోసం నియోజకవర్గ ప్రజలను దగా చేసిన దుర్మార్గుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని దుయ్యబట్టారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కరోనాతో ఇబ్బంది పడినా వదలకుండా ఈడీ అధికారులు చుట్టుముట్టిన తరుణంలో అండగా ఉండాల్సిందిపోయి రాజగోపాల్‌రెడ్డి అమిత్ షా పక్కన చేరడం విశ్వాస ఘాతుకమేనని మండిపడ్డారు. అలాంటి దుర్మార్గుడిని మునుగోడు గడ్డపై పాతి పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గం చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
అధికారం లేకున్నా వారు పనులు చేయలేదా?
మునుగోడులో ధర్మభిక్షం మొదలుకొని మల్లు స్వరాజ్యం, చకిలం శ్రీనివాస్‌రావు, బీఎన్ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరు ట్ల రామచంద్రారెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వంటి వారెంద రో అధికారం కోసం కాకుండా ప్రజాసమస్యల కోసం పోరాడారన్నారు. జానారెడ్డి, మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పనులు చేయలేదా? అని ప్రశ్నించారు.
2018 లో మునుగోడులో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ రాజగోపాల్‌రెడ్డికి ఇస్తే ఇంటింటికీ తిరిగి గెలిపించారని, వారి త్యాగాలు రాజగోపాల్‌రెడ్డికి గుర్తుకురావా అని రేవంత్ ప్రశ్నించారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వందల ఎకరాలు తరిగిపోయినా కాంగ్రెస్ జెండానే మోశారు తప్ప పార్టీ మారలేదని గుర్తుచేశారు.
తెలంగాణ తల్లికి అందరూ అండగా నిలవాలి..
రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ కష్టకాలంలో ఉంటే ప్రతి తెలంగాణ బిడ్డ అండగా ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆమెను ఒంటరిని చేసి శత్రువులు అవమానిస్తున్నారని చెప్పారు. ‘మన తల్లిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటామా.. బిడ్డలుగా మనకు బాధ్యత లేదా? మన సత్తా ఎమిటో చూపిస్తామా లేదా? అని కార్యకర్తలను ప్రశ్నించారు. మునుగోడు గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండా ఎగిరేలా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
వేల కోట్ల కాంట్రాక్టు కోసం ప్రజల ఆత్మగౌరవం తాకట్టు..
రూ. 21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని అమిత్ షా వద్ద తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే రాజగోపాల్‌రెడ్డిని అమిత్ షా పిలిచారని లేదంటే ఆయన కార్యాలయంలో బంట్రోతు కూడా రాజగోపాల్‌రెడ్డిని పట్టించుకోరన్నారు. కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నందుకే తనపై 120 కేసులు పెట్టారని రేవంత్‌రెడ్డి చెప్పారు.
తాను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నారన్నారు. నిజంగా మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారితే అమిత్ షా వద్ద ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లంల, ఇతర ప్రాజెకుల కోసం రూ. 5 వేల కోట్లు తేవాలని లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో సీట్లన్నీ గెలుస్తాం: ఉత్తమ్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో పార్టీకి పట్టుందని, రానున్న రోజుల్లో ప్రతి అసెంబ్లీ స్థానం గెలుచుకుంటామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వలాభం కోసం బీజేపీలో చేరుతున్న రాజగోపాల్‌రెడ్డి వెళ్తే కాంగ్రెస్‌కు నష్టమేమీ లేదని మాజీ మంత్రి కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీకి అత్యధిక ఓటు బ్యాంక్‌గల మునుగోడులో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోనియాను కేంద్రం ఇబ్బందిపెడుతుంటే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడం సరికాదని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment