మోత్కుపల్లికి డబుల్‌ ధమాకా.. నేడు గులాబీ గూటికి | Telangana: Former Minister Motkupalli Narsimhulu Will Join TRS Today | Sakshi
Sakshi News home page

మోత్కుపల్లికి డబుల్‌ ధమాకా.. నేడు గులాబీ గూటికి

Published Mon, Oct 18 2021 8:27 AM | Last Updated on Mon, Oct 18 2021 10:39 AM

Telangana: Former Minister Motkupalli Narsimhulu Will Join TRS Today - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొంతకాలంగా రాజకీయంగా నిస్తేజంగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నట్టుండి జిల్లా రాజకీయ క్షేత్రంపై తళుక్కున మెరిశారు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ సీనియర్‌ దళిత నాయకుడికి టీఆర్‌ఎస్‌ అధిష్టానం డబుల్‌ ధమాకా ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సోమవారం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లిని రాష్ట్ర దళిత బంధు చైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే, ఈ హోదాతో పాటు ఆయన్ను పెద్దల సభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని, సీనియర్‌ దళిత నాయకుడికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఆయన రెడీ అయ్యారని తెలంగాణ భవన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు దళితుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించేందుకు గాను మోత్కుపల్లిని శాసనమండలికి పంపుతారని సమాచారం. ఇందుకు జిల్లా రాజకీయ, సామాజిక సమీకరణలు కూడా కలిసి వస్తున్నాయని ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతస్థాయిలో చర్చ జరిగిందని, ఈ చర్చలో వచ్చిన ఎమ్మెల్సీ ప్రతిపాదనకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లికి ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాయమని, అయితే పార్టీలో చేరిన వెంటనే ఇస్తారా..? సమయం చూసి సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద మోత్కుపల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖరారయిందని, అయితే ఎప్పుడిస్తారన్నది మాత్రమే సస్పెన్స్‌ అని జిల్లా టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా చెబుతున్నాయి. 

గవర్నర్‌ పోటీదారు..
వాస్తవానికి, మోత్కుపల్లి నర్సింహులు జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేతగా గుర్తింపు పొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన మోత్కుపల్లి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలాకాలం పాటు ఆ పార్టీలోనే కొనసాగారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉండడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు చెప్పి తనకు గవర్నర్‌ హోదా ఇప్పిస్తారని ఆశించారు. కానీ, ఎప్పటిలాగే చంద్రబాబునాయుడు మార్కు రాజకీయానికి బలయిన మోత్కుపల్లి అక్కడి నుంచి కాషాయ గూటికి చేరారు. బీజేపీలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. దళితబంధు పథకం ప్రకటన తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌ పక్షం వహించారు. దళిత వర్గాలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని బలంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గులాబీ సేనకు దగ్గరయిన మోత్కుపల్లి తన మలిదశ రాజకీయ ప్రస్థానాన్ని గులాబీ గూటి నుంచి ప్రారంభిస్తున్నారు. మరి మోత్కుపల్లి మలిదశ ప్రస్థానం ఏ మలుపులు తిరుగుతుంది.. ఆయనకు ఎలాంటి పదవులు కట్టబెడుతుందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 

నేడు టీఆర్‌ఎస్‌లోకి ..
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఈనెల 18వ తేదీన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఉదయం 12 గంటలకు బేగంపేట లీలానగర్‌లోని మోత్కుపల్లి నివాసం నుంచి బైక్‌ర్యాలీతో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ప్రగతిభవన్‌కు వెళ్లేముందు ట్యాంక్‌బండ్‌ పైనున్న అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడినుంచి గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ప్రగతి భవన్‌ చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతారు. ఈ కార్యక్రమానికి ఆయన అనుచరులు పెద్దఎత్తున హాజరు కానున్నారు. ఆయనతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది.

మూడు వేల మందితో..
సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు రానున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం కరీంనగర్, హైదరాబాద్‌ జిల్లాలతో పాటు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ముఖ్యఅనుచరులు 3 వేల నుంచి 4 వేల మంది వరకు హాజరవుతారని మోత్కుపల్లి ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లే అవకాశం ఉంది. ఆయన అభిమానులు, ముఖ్య నాయకులు మోత్కుపల్లి వెంట టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొంతకాలంగా మోత్కుపల్లి వెంట నడిచిన పలువురు ద్వితీయ శ్రేణి సీనియర్‌ నాయకులు పార్టీలో చేరనున్నారు. చేరిక సందర్భంగా ప్రత్యేకంగా వాహనాలు ఏమీ ఏర్పాటు చేయనప్పటికీ ఎవరికి వారే హైదరాబాద్‌ వెళ్తారని అనుచరులు చెబుతున్నారు. 

చర్చనీయాంశంగా మోత్కుపల్లి చేరిక
మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరిక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లి అప్పట్లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. టీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో కేసీఆర్‌ టీడీపీనీ వీడి బయటకు రాగా మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయిందని టీఆర్‌ఎస్‌లో టీడీపీని విలీనం చేయాలని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీడీపీని వీడిన అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం అందులో కొనసాగారు. సీఎం దళితబంధు పథకంపై మోత్కుపల్లి సానుకూలంగా స్పందించారు. దీంతో కేసీఆర్‌ స్వయంగా మోత్కుపల్లిని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement