Telangana: పునాదులకే నోచని కొత్త మెడికల్‌ కాలేజీలు | Telangana Govt Has Decided To Start Classes Next Year Without Medical Colleges | Sakshi
Sakshi News home page

Telangana: పునాదులకే నోచని కొత్త మెడికల్‌ కాలేజీలు

Published Fri, Nov 12 2021 2:56 AM | Last Updated on Fri, Nov 12 2021 10:26 AM

Telangana Govt Has Decided To Start Classes Next Year Without Medical Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎనిమిది కొత్త వైద్య కళాశాలలను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించా లని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పటి ష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మెడికల్‌ కాలేజీల కోసం ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే జనవరిలోపు ఎప్పు డైనా జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బృందం ఆయా కాలేజీలు, హాస్టళ్ల భవనాలు, అధ్యాపకులు, సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలను తనిఖీ చేస్తుంది. అప్పటిలోగా మొదటి ఏడాదికి తరగతులు ప్రారంభించేలా తాత్కాలిక భవనాలు నిర్మించాలి. ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ పూర్తి చేయాలి. కానీ కీలకమైన తాత్కాలిక భవనాల నిర్మాణమే చాలాచోట్ల మొదలు కాలేదు. కొన్నిచోట్ల టెండర్‌ ప్రక్రియే ప్రారంభం కాలేదు. మరికొన్ని చోట్ల ఈ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది.

రూ.4,080 కోట్ల వ్యయం
తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. 2022–23 వైద్య విద్యా సంవత్సరం నుంచి మరో ఎనిమిది కాలేజీలు ఒకేసారి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఒక్కో కాలేజీ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.510 కోట్లు కేటాయించింది. అంటే ఎనిమిది కాలేజీలకు రూ.4,080 కోట్లు ఖర్చు కానుంది. ఇక ఒక్కో కాలేజీకి 20 ఎకరాల భూమి కనీసం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒకే చోటనైనా లేదా 10 కిలోమీటర్ల పరిధిలో రెండు చోట్ల భూమి ఉన్నా నిబంధనల ప్రకారం అనుమతిస్తారు. ఆయా ప్రాంతాల్లో భవనాల నిర్మాణం ఆర్‌అండ్‌బీకి అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. 

శాశ్వత భవనం వచ్చే వరకు తాత్కాలికంగా..
    కాలేజీ భవనాలను శాశ్వత పద్ధతిలో నిర్మించాలంటే కనీసం 18 నెలలు పడుతుంది. కాబట్టి ప్రీ–ఫ్యాబ్రికేటెడ్‌ పద్ధతిలో మొదటి ఏడాది తరగతుల కోసం కాలేజీ భవనం, పరిపాలనా భవనం, హాస్టల్‌ తాత్కాలికంగా నిర్మించాలని నిర్ణయించారు. అలాగే పరికరాలు, మౌలిక సదుపాయాలను కూడా కల్పించాల్సి ఉంటుంది. హాళ్లు, ల్యాబ్‌లు, లైబ్రరీ, డెమో గదులు వంటి వాటిని నిర్మించాలి. శాశ్వత కళాశాల భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత, తాత్కాలిక భవనాలను నర్సింగ్‌ సహా పారా మెడికల్‌ కోర్సులు మొదలైన వాటి కోసం ఉపయోగిస్తారు.
 
ప్రీ–ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మించాలన్నా 3 నెలలు
    ఇలా తొలుత తరగతులు ప్రారంభించేందుకు కీలకమైన తాత్కాలిక భవనాలను నవంబర్, డిసెంబర్‌ నాటికే పూర్తి చేయాలని గతంలో అనుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ.. కాలేజీ భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మహబూబాబాద్‌లో స్థలాన్ని గుర్తించినా వివాదాల వల్ల అక్కడ కాలేజీ నిర్మాణం మొదలు కాలేదు. జగిత్యాలలోని థరూర్‌ క్యాంపులో 27 ఎకరాల స్థలం గుర్తించినా, అక్కడా భవన శంకుస్థాపన జరగలేదు. ప్రీ–ఫ్యాబ్రికేటెడ్‌ భవనాలను నిర్మించాలన్నా మూడు నెలలు పడుతుంది. ఎన్‌ఎంసీ బృందం ముందస్తుగా చెప్పి తనిఖీలకు రాదు. జనవరి నాటికి అకస్మాత్తుగా వచ్చి తనిఖీలు చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో కీలకమైన నిర్మాణాలే పూర్తి కాకపోతే ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నా కూడా నిర్మాణాలు, టెండర్లు, ఇతర భూముల స్వాధీనం ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

పడకల సంఖ్యను విస్తరించాలి
    కాలేజీలను స్థాపించాలంటే అనుబంధంగా బోధనాసుపత్రులు ఉండాలి. స్థానికంగా ఉండే ఆసుపత్రులను కాలేజీలకు అనుబంధంగా కొనసాగించాలంటే నిబంధనల ప్రకారం ఒక్కోదాంట్లో 330 పడకలు ఉండాలి. వాటిల్లో 30 ఐసీయూ పడకలు ఉండాలి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 400 పడకలు ఉన్నాయి. అక్కడ ఇబ్బంది లేదు. మిగిలిన చోట్ల పడకల సంఖ్యను 330కు విస్తరించాల్సి ఉంది. బోధనాసుపత్రుల్లో పరికరాల ఏర్పాటు వంటి వాటిని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ), తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐసీ)కు అప్పగించారు. వాటిల్లో పనులు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయంటున్నారు. ఇక అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. అందుకు సంబంధించి కొందరిని పదోన్నతుల ద్వారా, మరికొందరిని సరెండర్ల ద్వారా, ఇంకొందరిని నేరుగా భర్తీ చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి కాకుండా ఆర్‌అండ్‌బీకి కాలేజీ భవనాల నిర్మాణం అప్పగించడంతో ఆ సంస్థలో అసంతృప్తి నెలకొంది. 

సంగారెడ్డి మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన టెండర్‌ ప్రక్రియకు ఆశించిన మేర స్పందన రాలేదు. తొలి నోటిఫికేషన్‌కు ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. దీంతో బిడ్‌ దాఖలు తేదీని ఆర్‌ అండ్‌ బీ పొడిగించింది. అయినా కేవలం ఒక్క కంపెనీ మాత్రమే బిడ్‌ దాఖలు చేయడంతో ఆ ప్రక్రియ కాస్తా ఆగిపోయింది. దీంతో కాలేజీకి కేటాయించిన భూమిలో ఆర్‌ అండ్‌ బీయే భవన నిర్మాణానికి తవ్వకాలు ప్రారంభించింది.  
 

  • ప్రస్తుతమున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,640 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. కొత్తగా వచ్చే ఎనిమిది కాలేజీల్లో 150 చొప్పున 1,200  సీట్లు అదనంగా రానున్నాయి. మొత్తంగా 2,840 ప్రభుత్వ సీట్లతో తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో ఇదో నూతన అధ్యాయం అవుతుంది.

కొత్త వైద్య కళాశాలలిక్కడే
సంగారెడ్డి
వనపర్తి, జగిత్యాల
మహబూబాబాద్‌
నాగర్‌కర్నూల్‌
కొత్తగూడెం
మంచిర్యాల
రామగుండం

  • ఇది నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూమి. భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించినా ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదు. ఇంకా శంకుస్థాపన కూడా కాలేదు. అంతేకాదు అసలు టెండర్‌ ప్రక్రియే మొదలు కాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. 

మొదటి ఏడాది కోర్సుకు ఉండాల్సిన అధ్యాపకుల సంఖ్య
హోదా                       పోస్టుల సంఖ్య
ప్రొఫెసర్లు                              06 
అసోసియేట్‌ ప్రొఫెసర్లు         17 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు            31 
ట్యూటర్లు/డెమోనిస్ట్రేటర్లు     17 
సీనియర్‌ రెసిడెంట్లు             26 
––––––––––––––––––––––––––––
మొత్తం                                97  
–––––––––––––––––––––––––––– 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement