హైదరాబాద్, సాక్షి: ధరణి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్టర్ అయిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేత పత్రం ఉండనుందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
ఇక.. ధరణిపై తాజా రివ్యూలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.45లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించాలని, రైతులు ఇబ్బందిపడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. పోర్టల్‌ను పరిశీలించిన కమిటీ.. పూర్తిగా పోర్టల్ పునర్మిర్మాణం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక సమస్యల పరిష్కారం దిశగానే కాకుండా.. చట్టాల్ని మార్చాల్సిన అవసరమూ ఉందని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. ఇక.. ఈ కమిటీ సూచనలకు తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటాయని తొలి నుంచి ప్రభుత్వం చెబుతోంది.
మరోవైపు ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఇరిగేషన్, పవర్‌పై శ్వేతపత్రాలు విడుదల చేసి బీఆర్‌ఎస్‌ను ఇరుకునపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment