ఇంకా ఏపీ ఖాతాలోకే కేంద్ర నిధులు: కేసీఆర్
ఇంకా ఏపీ ఖాతాలోకే కేంద్ర నిధులు: కేసీఆర్
Published Fri, Nov 14 2014 7:43 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
హైదరాబాద్: 2015-16 బడ్డెట్ ప్రవేశపెట్టడానికంటే ముందే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత ప్రభుత్వం విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని అన్నారు. విభజన తర్వాత చాలా సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు ఆంధ్రప్రదేశ్ ఖాతాలోకి వెళ్తున్నాయని ఆయన అన్నారు.
వచ్చే బడ్జెట్ కల్లా ఇలాంటి సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభం, ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ పై జరిగిన సాధారణ చర్చలో తాము లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమివ్వాల్సిందిగా ఈటెల రాజేందర్ ను అక్బరుద్దీన్ మరోసారి డిమాండ్ చేశారు. శ్వేతపత్రంపై మాట్లాడాల్సిందేనని అక్బరుద్దీన్ కు కాంగ్రెస్ నేత జానారెడ్డి మద్దతుగా నిలిచారు.
Advertisement
Advertisement