సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు ధరణి పోర్టల్ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వారి సలహాలు, సూచనలు, అభిప్రాయాల మేరకు ముందుకెళ్లాలని ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన కమిటీ నిర్ణయించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సునిశిత అధ్యయనం చేయాలని, వారి వద్దకు వెళ్లి ప్రత్యేక ఫార్మాట్‌లో వారి మనోగతం తెలుసుకుని క్రోడీకరించాలని ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చింది.
అయితే నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలా? గ్రామసభల ద్వారా వారి నుంచి సమస్యలు తెలుసుకోవాలా? లేదంటే అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలా? అలా ఏర్పాటు చేయాల్సి వస్తే ఏయే స్థాయిల్లో, ఏ పద్ధతుల్లో అభిప్రాయాలు తెలుసుకోవాలన్న దానిపై కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు.
ఈ విషయంలో కమిటీ తుది నిర్ణయానికి రాలేదు కానీ, ప్రాంతాల వారీగా రైతుల సమస్యలు తెలుసుకుని వారి అభిప్రాయాలు, ఆలోచనల మేరకు పని చేయాలని మాత్రం నిర్ణయించింది. అలాగే ఈ పోర్టల్ ద్వారా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి? కమిటీ ఎలా ముందుకెళ్లాలి? రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి? చట్టాల పరిధి ఏంటి? చట్టాల మార్పునకు అవకాశాలెలా ఉన్నాయి? ఇతర రాష్ట్రాల్లో భూసమస్యలను పరిష్కరిస్తున్న తీరు తదితర అంశాలపై సభ్యులు 2 గంటలకు పైగా చర్చించారు.
గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, మెంబర్ కనీ్వనర్ నవీన్ మిత్తల్‌తో పాటు సీఎంఆర్‌వో పీడీ వి.లచ్చిరెడ్డిలు పాల్గొన్నారు. సభ్యులందరూ విడివిడిగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. కమిటీ పనితీరు ఎలా ఉండాలన్న దానిపై ఓ అవగాహనకు వచ్చిన సభ్యు లు.. ఈనెల 17న మరోమారు భేటీ అయి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు.
15 రోజుల్లో తొలిదఫా సూచనలు
ధరణి పునర్నిర్మాణం కోసం అవసరమైన నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఒక్కసారే తుది నివేదిక కాకుండా పలు దఫాలుగా మధ్యంతర నివేదికలు సమర్పించాలని, తొలిదఫా సలహాలు, సూచనలు 10–15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. నాంపల్లిలోని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం కేంద్రంగానే కమిటీ పనిచేయాలని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. రైతుల ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేక చర్చ జరిగినట్టు తెలిసింది.
గతంలో రైతుల వినతులను పట్టించుకోలేదని, కలెక్టర్ స్థాయిలో నిర్ణయాధికారాలున్న నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కాక చాలా ఇబ్బందులు పడ్డారని, ఈ నేపథ్యంలో గ్రీవెన్స్ పరిష్కార అధికారాలను వికేంద్రీకరణ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై సభ్యులు చర్చించారు. గ్రీవెన్స్‌తో పాటు సాంకేతిక పరమైన సమస్యలను ఎలా డీల్ చేయాలన్నది కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.
మొత్తం మీద ధరణి పోర్టల్‌తో సంబంధముండే అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని, ఇతర రాష్ట్రాల్లో భూసమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు. కాగా ‘పునర్నిర్మాణమంటే చాలా పెద్ద టాస్క్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేం టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడే పరిస్థితి లేదు. ట్వంటీ ట్వంటీ ఆడాల్సిందే. ట్వంటీ ట్వంటీలో ప్రతి బంతిని కీలకంగా పరిగణించినట్టు గానే మేం ప్రతి అంశాన్ని కీలకంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిందే..’ అని సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.
గత తప్పులు పునరావృతం కానివ్వం: కోదండరెడ్డి
సమావేశానంతరం ధరణి కమిటీ సభ్యులు సునీల్‌కుమార్, మధుసూదన్, లచ్చిరెడ్డిలతో కలిసి కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అన్ని అంశాలను సవరించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. పోర్టల్ ఎవరు నిర్వహిస్తే బాగుంటుందన్న దానిపై కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ముందుకెళతామని, సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజల వద్దకు ‘ధరణి’
Published Fri, Jan 12 2024 12:41 AM | Last Updated on Fri, Jan 12 2024 12:59 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment