Telangana Has Highest Alcohol Consumption - Sakshi
Sakshi News home page

సర్వేలో బయటపడ్డ షాకింగ్‌ విషయాలు.. డేంజర్‌ జోన్‌కు చేరువలో తెలంగాణ? కళ్లు తెరవకుంటే కష్టమే!

Published Sun, Nov 27 2022 12:43 AM | Last Updated on Thu, Dec 1 2022 3:17 PM

Telangana Has Highest Alcohol Consumption - Sakshi

(శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి) 
ఉద్వేగాల నేల తెలంగాణ.. సంతోషం, సంబురం, వినోదం, విషాదం.. ఏదైనా సామూహిక విందు ఇక్కడి కలివిడి జీవితాలకు సంకేతం. నలుగురు కలిసిన సమయంలో విందు, విలాసాల్లో సరదాగా మొదలవుతున్న మద్యం వినియోగం.. తర్వాత అలవాటుగా మారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్న మద్యంతో వినియోగం విపరీతంగా పెరుగుతోంది.

దేశంలో అరుణాచల్‌ప్రదేశ్‌ 15 లక్షలు జనాభాలో సుమారు 7.60 లక్షల మందికి మద్యం తాగే అలవాటుతో టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ నాలుగు కోట్లకుపైగా జనాభా ఉండగా.. వీరిలో 15– 49 ఏళ్ల మధ్య వయసువారిలో యాభై ఐదు శాతం మంది మద్యం తాగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–21) ఇటీవలే వెల్లడించింది. కొత్తగా మద్యం అలవాటు అవుతున్న వారి సంఖ్య జాతీయ సగటు కంటే వేగంగా పెరుగుతోందని పేర్కొంది. 

గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా.. 
తెలంగాణలో మద్యం అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా 62 శాతం (15–49 ఏళ్ల మధ్య వయసువారిలో) మేర ఉంది. ఇందులో 7శాతం మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇందులో 54శాతం మంది వారంలో ఒకసారి మద్యం తాగుతుంటే.. 28శాతం మంది నాలుగు రోజులకోసారి, మరో 19 శాతం మంది ప్రతిరోజు తాగుతున్నారు. ఇక మద్యం అలవాటు/వ్యసనంగా మారిన కుటుంబాల్లో 28 శాతం మంది మహిళలు భర్తల నుంచి హింసకు గురవుతున్నారు. 16 శాతం మంది మహిళలు తీవ్రగాయాల పాలవుతున్నట్టు జాతీయ కుటుంబ సర్వే పేర్కొంది. 

నిషాలో ప్రమాదాలతో.. 
దేశంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పది రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. డ్రంకెన్‌ డ్రైవ్‌ వల్ల ప్రమాదాలు, మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో బాధితులు 18– 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇక పదిలక్షల జనాభా దాటిన యాభై నగరాల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి.. హైదరాబాద్‌ 7వ స్థానంలో ఉందని ట్రాన్స్‌పోర్ట్‌ రీసెర్చ్‌ వింగ్‌ 2020 నివేదిక పేర్కొంది. 

అమ్మకాలు.. ఆదాయం.. చీర్స్‌ 
మద్యం వినియోగం అధికంగా ఉండే రాష్ట్రాలతో పోలిస్తే తలసరి వినియోగంలో తెలంగాణ టాప్‌లో ఉంది. రాష్ట్రంలో 2017–2020 మధ్య మద్యం వినియోగం 18 శాతం పెరిగి రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించింది. అత్యధికంగా మద్యం విక్రయించిన వైన్స్‌ల వివరాలు చూస్తే తాజా ఎక్సైజ్‌ ఏడాదిలో.. హన్మకొండ హంటర్‌ రోడ్డులోని ఓ వైన్స్‌ రూ.38 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయిస్తే, అశ్వారావుపేటలో రూ.31 కోట్లు, కరీంనగర్‌లో రూ.29 కోట్లు, కల్వకుర్తిలో ఒక వైన్స్‌ రూ.20.50 కోట్లు, నిజామాబాద్‌లో ఒక వైన్స్‌ రూ.19.50 కోట్లు, తొర్రూరులో ఒకవైన్స్‌ రూ.14.33 కోట్లు విలువైన మద్యాన్ని బాటిలింగ్‌ యూనిట్ల నుంచి కొనుగోలు చేసి జనానికి విక్రయించాయి. 

డ్రంకెన్‌ డ్రైవ్‌.. ప్రాణాలు తీసింది.. 
అది 2021 డిసెంబర్‌ 18. తెల్లవారుజామున రెండుగంటలు.. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కారు సెంట్రల్‌ యూనివర్సిటీ సమీపంలో చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలైంది. డ్రైవర్‌ సీట్లో ఉన్న రహీం అనే యువకుడితోపాటు ఎం.మానస, ఎన్‌.మానస ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. సిద్ధు అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

రహీం మద్యం మత్తులో వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై జడ్చర్లకు చెందిన మానస తండ్రి రవీందర్‌ను పలకరిస్తే.. ‘‘ఆరేళ్ల క్రితమే తల్లిని పోగొట్టుకున్న మానసను గారాబంగా పెంచాను. ఆమెకు ఇష్టమైన టీవీ, సినిమా రంగంలోకి వెళ్తానంటే సంతోషపడ్డాను. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటుందని భావించాను. కానీ డ్రంకెన్‌ డ్రైవ్‌ నా బిడ్డను నాకు కాకుండా చేసింది. ఇలాంటి శిక్ష ఏ తండ్రికి పడొద్దు..’’అని కన్నీళ్లు పెట్టారు.  


పెంచిన చేతులతోనే.. 
అతడి పేరు కిరణ్‌ (28).. బీరుతో సరదాగా మొదలైన వ్యసనం విస్కీతో విస్తరించింది. ఆపై గంజాయికీ చేరింది. మత్తు లేనిదే ఉండలేక డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం, దాడులు చేయడం దాకా ఉన్మాదం చేరింది. కిరణ్‌ భార్య వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అక్టోబర్‌ 10న మత్తులో ఇంటికి వచ్చిన కిరణ్‌ డబ్బులు కావాలంటూ తల్లి మీద దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రినీ గాయపరిచాడు. ఏమీ దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు కిరణ్‌ మెడకు తాడు బిగించి చంపేశారు. ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన విషాద ఘటన. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాలనుకున్న తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ మద్యం పెట్టిన చిచ్చుతో జైలు జీవితం గడుపుతున్నారు. 

తల్లి కోసం తండ్రిని.. 
ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ ఉన్నంతలో బాగానే కాలం గడిపారు. భర్త భాస్కర్‌ (45) ఆటో నడుపుతూ భార్య కరుణారాణి, ఇద్దరు కుమారులు బాలతేజ, తరుణ్‌ తేజలను పోషించుకుంటూ వచ్చాడు. కానీ భాస్కర్‌ సరదాగా మొదలుపెట్టిన మద్యం తాగుడు.. తర్వాత అలవాటుగా, వ్యసనంగా మారింది. కొన్నేళ్ల క్రితం మద్యం మత్తులో భాస్కర్‌ దాడి చేయడంతో భార్య చేయి విరిగింది. తర్వాతా మద్యానికి డబ్బుల కోసం వేధించడం పెరిగింది.

ఈ నెల 20న ఆలేరు మండలం తూర్పుగూడెంలో చర్చి పండగతో ఊరంతా సందడిగా ఉంటే.. భాస్కర్‌ మాత్రం తనకు తాగేందుకు డబ్బులివ్వాలంటూ భార్యపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన కొడుకులను గాయపర్చాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇద్దరు కొడుకులు కత్తితో దాడి చేయగా.. భాస్కర్‌ చనిపోయాడు. ఆ ఇద్దరు జైలుకు వెళ్లారు. కరుణారాణిపైనా కేసు నమోదైంది. కష్టం చేస్తేగానీ పూటగడవని కుటుంబానికి మద్యం అలవాటు చేసిన గాయం ఎలా మానుతుందంటూ తూర్పుగూడెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. 

ప్రేమపెళ్లి.. నడిరోడ్డులో ఆలిని నరికేసి.. 
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం భవానినగర్‌ తండాలో ఉండే జాటోత్‌ భాస్కర్‌ 15 ఏళ్ల కింద కల్పన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భాస్కర్‌ ఒకచోట గుమాస్తాగా, కల్పన ఇళ్లలో పనిచేస్తూ ముగ్గురి ఆడపిల్లల్ని పోషించుకుంటూ వచ్చారు. కానీ, కొంతకాలంగా మద్యానికి బానిసైన భాస్కర్‌ తాగి వచ్చి డబ్బుల కోసం కల్పనను కొట్టేవాడు. వేధింపులు భరించలేక కల్పన ఈ ఏడాది సెప్టెంబర్‌ 17న పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై ఆగ్రహించిన భాస్కర్‌ సెప్టెంబర్‌ 22న ఉదయం పనికోసం వెళ్తున్న కల్పనను నడిరోడ్డులో కత్తితో పొడిచి చంపాడు. తల్లి హత్యకు గురై తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నారులు అమ్మమ్మ ఇంట్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు.  

భారీగా మద్యం ఆదాయం 
2020–21లో తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సుమారు పదివేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మిగతా జిల్లాల్లో బాట్లింగ్‌ యూనిట్ల ద్వారా ప్రభుత్వానికి నేరుగా వచ్చిన ఆదాయం ఇదీ ..

సులువైన ఆదాయం మద్యం నుంచే.. 
అది పేరుకే ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ. కానీ ప్రొహిబిషన్‌ (నిషేధం) బదులు విస్తరణ శాఖగా మార్చేశారు. మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వాలకు సులువుగా వచ్చే ఆదాయం ఇదే. కానీ మద్యం వినియోగంతో పాటు క్రైం రేటు భారీగా పెరుగుతోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను మర్చిపోయామనిపిస్తోంది. 
– ఎంవీ చంద్రవదన్, ఎక్సైజ్‌ మాజీ కమిషనర్‌ 

డేంజర్‌ జోన్‌కు చేరువలో ఉన్నాం 
తెలంగాణ ఇప్పుడు డేంజర్‌ జోన్‌కు చేరువలో ఉంది. మా అంచనా మేరకు 90శాతం మంది (15 ఏళ్లు పైబడిన వారిలో) పలు రకాల మద్యం తాగుతున్నారు. మొదట తొలుత కల్లు, బీరు, విస్కీ.. అనంతరం గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. పంజాబ్‌ ఇప్పటికే మద్యం వినియోగం నుంచి డ్రగ్స్‌ వైపు వెళ్లింది. తెలంగాణలో పరిమితికి మించి మద్య వినియోగం జరుగుతుంది. కొన్నాళ్లకు ఈ మత్తు చాలక గంజాయి, డ్రగ్స్‌ వైపు వెళ్లటం సహజం. తక్షణం మద్య నియంత్రణ కార్యాచరణ ప్రకటించకపోతే తెలంగాణ మరో పంజాబ్‌ కావడానికి ఎంతో సమయం పట్టదు.     
– ఎం పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

మద్యం విచక్షణను దూరం చేస్తుంది 
సరదా కోసం తీసుకునే మద్యం అలవాటుగా మారి మనిషిలో విచక్షణను దూరం చేస్తోంది. మెదడు నుంచి కాలిబొటన వేలి వరకు ప్రభావం చూపుతుంది. ఆహారంలా అవసరంగా మారి.. మద్యం తీసుకోకపోతే మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. 
– డాక్టర్‌ ఎ.లక్ష్మీలావణ్య, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement