Republic Day: రాజ్‌భవన్‌లోనే వేడుక.. సీఎం కేసీఆర్‌ హాజరుపై సందిగ్ధత | Telangana HC directs state Govt to conduct republic day Event | Sakshi
Sakshi News home page

Republic Day: రాజ్‌భవన్‌లోనే వేడుక.. సీఎం కేసీఆర్‌ హాజరుపై సందిగ్ధత

Published Thu, Jan 26 2023 4:51 AM | Last Updated on Thu, Jan 26 2023 2:50 PM

Telangana HC directs state Govt to conduct republic day Event - Sakshi

రాష్ట్రంలో ఈసారి కూడా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. కానీ వేడుకలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని హైకోర్టు ఆదే శించడంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు బలగాల కవాతు, గవర్నర్‌ ప్రసంగం, ఇతర కార్యక్రమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే గణతంత్ర వేడుకల నిర్వహణకు సంబంధించి బుధవారం పొద్దంతా ఉత్కంఠ నెలకొంది.

దీనిపై నమోదైన పిటిషన్‌ను హైకోర్టు అత్యవసరంగా విచారించి వేడుకలు నిర్వహించాలని ఆదేశించడం, ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్‌ విమర్శలు చేయడం, ప్రతిగా తామేమీ రాజకీయం చేయడం లేదంటూ మంత్రి తలసాని స్పందించడం చర్చనీయాంశమైంది. చివరికి రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వెంటనే పోలీసు, వివిధ శాఖల ఉన్నధికారులు రాజ్‌ భవన్‌కు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే గవర్నర్, సీఎం మధ్య విభేదాల నేపథ్యంలో కేసీఆర్‌ రాజ్‌భవన్‌ వేడుకలకు వెళతారా, లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.   

గణతంత్ర దినం దేశభక్తిని చాటే ముఖ్యమైన జాతీయ పండుగ. కరోనాను సాకుగా చూపి వేడుకలు నిర్వహించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదు. వేడుకలను అధికారికంగా, ఘనంగా నిర్వహించాలి. ఈ విషయంలో ఈ నెల 19న కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి. పరేడ్‌ నిర్వహించాలి, ప్రజలను కూడా అనుమతించాలి.    -హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గణతంత్ర వేడుకలను అధికారికంగా, ఘనంగా నిర్వహించాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. గణతంత్ర దినం దేశభక్తిని చాటే ముఖ్యమైన జాతీయ పండుగ అని.. కరోనాను సాకుగా చూపి వేడుకలు నిర్వహించడం లేదన్న ప్రభుత్వ వాదన సరికాదని తప్పుబట్టింది. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.

అయితే పరేడ్‌ ఎక్కడ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ వేడుకలకు ప్రజలను కూడా అనుమతించాలని సూచించింది. గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

అత్యవసర విచారణలో..
రాష్ట్రంలో ఏటా గణతంత్ర వేడుకలను సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తారు. గవర్నర్‌ జాతీయ జెండాను ఎగురవేస్తారు. భద్రతా దళాల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. గత ఏడాది కరోనా కారణంగా ఈ వేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. ఈసారీ అదే విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్ఫూర్తిదాయకమైన గణతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదంటూ హైదరాబాద్‌లోని గౌలిపురాకు చెందిన కె.శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్‌ కావడంతో లంచ్‌మోషన్‌లో విచారణ జరపాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్‌ పి.మాధవీదేవి బుధవారం మధ్యాహ్నం 2.30కు దీనిపై విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫున టి.సూర్యకరణ్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్, కేంద్ర ప్రభుత్వం తరఫున గాడి ప్రవీణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 

కరోనా ప్రభావం ఉన్నందున..
రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున ఈసారి గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌లోనే జరుపుకోవా లని విజ్ఞప్తి చేశామని.. దీనిపై ఈ నెల 13న రాజ్‌ భవన్‌కు లేఖ రాశామని ఏజీ కోర్టుకు చెప్పారు.

‘‘రాజ్‌భవన్‌లో నిర్వహించే వేడుకలకు సీఎస్, డీ జీపీ సహా ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ప్రజలకు వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా వీక్షించే అవకాశం కల్పించాం. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలను యథాతథంగా అమలు చేయడం లేదు. గత ఏడాది తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని వివరించారు.

ప్రభుత్వం సంప్రదాయాన్ని బ్రేక్‌ చేసింది
గణతంత్ర వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభు త్వం మార్గదర్శకాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో కార్యక్రమాలు ప్రారంభమయ్యేలోగా రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేడుకలు పూర్తి చేసేలా ఏర్పా టు చేసుకోవాలని కేంద్రం సూచించింది. వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీరుల గాథలకు చెప్పడం ద్వారా వారిలో స్ఫూర్తి నింపాలి. స్థానికతకు అద్దంపట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. వందే భారత్‌ కార్యక్రమం కింద బృంద నృత్యాలను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. దేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ నిర్వహణకు కరోనా ప్రభావం ఉందని చెప్పడం తగదు. ప్రభుత్వ తీరు రాజ్యాంగ విరుద్ధం.

ఏటా పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, పరేడ్‌ వందనం స్వీకరించడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని కూడా ప్రభుత్వం బ్రేక్‌ చేసింది. గొప్ప చరిత్ర, సంప్రదాయాన్ని, సంస్కృతిని, లక్ష్య సాధనను ప్రజలకు ఈ వేడుకలు చాటి చెప్తాయి. గణతంత్ర వేడుకలను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలి..’’ అని కోర్టుకు విన్నవించారు. 

వేడుకలు నిర్వహించాల్సిందే..
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. గణతంత్ర వేడుకలను నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించి కేంద్రం ఈనెల 19న రాష్ట్రాలకు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. కరోనా ప్రభావం ఉందంటున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏయే మార్గదర్శకాలను పాటిస్తుందో ఏజీ తెలియజేయలేదన్నారు. కేంద్ర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు లేఖ రాసినట్టు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

గణతంత్ర స్ఫూర్తిని చాటేలా వేడుకలు జరపాలని.. పరేడ్, ఇతర కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించేదీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కరోజే వ్యవధి ఉన్నందున ఈ ఆదేశాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)ను ఆదేశించారు. 

వేడుకలు రాజ్‌భవన్‌లోనే..
సాక్షి, హైదరాబాద్‌: దేశ 74వ గణతంత్ర వేడుకలు ఈసారి కూడా రాజ్‌భవన్‌లోనే జరుగుతున్నాయి. గత ఏడాది సాదాసీదాగా కార్యక్రమాన్ని ముగించేయగా. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు పరేడ్, ఇతర కార్యక్రమాలు సహా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6.50 గంటల సమయంలో రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరి స్తారు.

7 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరి స్తారు. తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం కేసీఆర్, మంత్రులు, అధి కార, విపక్ష పార్టీల ముఖ్య నేతలు, ప్రజాప్రతిని ధులు, వివిధ రంగాల ప్రముఖులకు రాజ్‌భవన్‌ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.

ఇక రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్‌ తమిళిసై ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లను న్నారు. తమిళిసై పుదుచ్చేరి ఇన్‌చార్జి లెఫ్టినెంట్‌ గవ ర్నర్‌గా ఉన్న నేపథ్యంలో.. అక్కడ ఉదయం 9 గంటల సమయంలో జెండాను ఆవిష్కరించనున్నారు.

సీఎస్‌ అత్యవసర సమీక్ష.. 
రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు.. కవాతు కూడా..ఘనంగా గణతంత్ర వేడుకలు జరపాలని హైకోర్టు ఆదేశించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి శాంతికుమారి అప్రమత్తమయ్యారు. పోలీసు, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షించారు. బీఆర్‌కే భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రోటోకాల్‌ సంచాలకుడు అర్విందర్‌సింగ్, మరికొందరు అధికారులు పాల్గొని చర్చించారు.

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలని, రాజ్‌భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత పోలీసు, ఇతర శాఖల అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి పరిశీలించారు. రాజ్‌భవన్‌ ప్రాంగణంలో పరేడ్, ఇతర కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. 

పలువురికి సత్కారం
గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురిని గవర్నర్‌ తమిళిసై సన్మానించనున్నారు. సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయ రచయిత కానుకుంట్ల సుభాష్‌ చంద్రబోస్, సామాజిక సేవ విభాగంలో భగవాన్‌ మహవీర్‌ వికల్ప్‌ సహాయత సమితి, విద్యా, యువజనాభివృద్ధి విభాగంలో ఎం.బాలలత, పారా అథ్లెటిక్స్‌ విభాగంలో కుడుముల లోకేశ్వరి, క్రీడల్లో ఆకుల శ్రీజను సత్కరించి మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.

సీఎం కేసీఆర్‌ వస్తారా?
రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలను పూర్తిస్థాయి లో నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ హాజ రవుతారా, లేదా అన్నది చర్చనీయాంశంగా మా రింది. ఇప్పటికే సీఎం, గవర్నర్‌ మధ్య నెలకొన్న విభేదాలతో.. గణతంత్రవేడుకలను రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రచారంలో ఉంది. గత ఏడాది కూడా వేడుక లను రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. కేసీఆర్, మంత్రులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement