ఆ తర్వాతే చట్టప్రకారం ముందుకు వెళ్లండి
పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కొర్రమూల గ్రామంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన ‘గాయత్రి’నిర్మాణాలపై చట్టప్రకారం ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తొలుత అక్కడి నాదెం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్‌జోన్లను పక్కాగా నిర్ధారించాలని ఆదేశించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టి.. చెరువు ఎన్ని ఎకరాలు, ఆక్రమణలు ఎంతమేర జరిగాయన్నది తేల్చి.. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. వారి వాదనలు విన్నాక చట్టప్రకారం చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది.
లాంటి నిర్మాణాలు చేపట్టవద్దు..
చట్ట విరుద్ధంగా తమ విద్యా సంస్థల భవనాల కూలి్చవేతకు హైడ్రా, అధికారులు ప్రయతి్నస్తున్నారంటూ.. గాయత్రి విద్యా, సాంస్కృతిక ట్రస్టు, అనురాగ్ వర్సిటీ, నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, గూడ మధుకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 796, 813 సర్వే నంబర్లలోని 17.21 ఎకరాల్లో ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్లపై జస్టిస్ టి.వినోద్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘1954, 1955 కాస్రా పహాణీ ప్రకారం నాదెం చెరువు విస్తీర్ణం 61 ఎకరాలు. పిటిషనర్ విద్యా సంస్థలు బఫర్ జోన్‌లోనే ఉన్నాయి.
కూల్చివేత సహా ఎలాంటి చర్యలు చేపట్టినా పిటిషనర్‌కు నోటీసులు జారీ చేస్తాం. ఆ భూముల్లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా పిటిషనర్‌ను ఆదేశించాలి’’అని న్యాయమూర్తిని స్పెషల్ జీపీ కోరారు. దీనికి న్యాయమూర్తి సమ్మతిస్తూ.. అధికారుల నుంచి అనుమతి పొందినా కూడా తదుపరి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్లను ఆదేశించారు. నాగోల్‌లోని సర్వే ఆఫ్ ఇండియా, సనత్‌నగర్, షాద్‌నగర్‌లలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల నుంచి నాదెం చెరువుకు సంబంధించి స్పష్టమైన మ్యాప్‌లను తీసుకుని.. వాటి ఆధారంగా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్థారించాలని స్పెషల్ జీపీకి సూచించారు. ఆ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment