స్టేటస్‌కో ఆదేశాలున్నా పాస్‌బుక్ జారీ చేస్తారా?
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌పై క్షమశిక్షణా చర్యలకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాలను ధిక్కరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, గండిపేట మండల తహసీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. గండిపేట మండలం నార్సింగిలోని సర్వే నంబర్ 340/4/1లో ఉన్న రెండెకరాల వివాదాస్పద భూమిపై స్టేటస్ కో ఆదేశాలున్నా.. అధికారులు ఆ భూమిపై ఓ సంస్థకు పట్టాదారు పాస్‌బుక్ జారీచేయటంపై మండిపడింది. ఈ భూమిపై చాలాకాలంగా వివాదం నడుస్తున్నది. సదరు భూమిపై 2014లోనే హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చింది. కానీ, 2023 అక్టోబర్‌లో ధరణి పోర్టల్‌లో ఆ భూమి ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందినదిగా గుర్తిస్తూ అధికారులు పట్టాదార్ పాస్‌బుక్ జారీచేశారు. ఈ చర్యపై పిటిషనర్ సంస్థ ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మళ్లీ కోర్టుకు వెళ్లింది.
1998లో చట్టపరంగా సదరు రెండెకరాల భూమిని కొనుగోలు చేశామని ఆ కంపెనీ వాదిస్తున్నది. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం పిటిషనర్‌కు నోటీసులైనా ఇవ్వకుండా ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పాస్‌బుక్ ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. స్టేటస్‌కో ఆదేశాలను పాటించకపోవడం చిన్నం పాండురంగం కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా? గతంలో స్టేటస్ కో ఆదేశాలిచి్చనా మీ ఇష్టం వచి్చన వారిని ధరణి పోర్టల్లో చేర్చి పాస్‌బుక్ జారీ చేస్తారా? ఈ విషయంలో కలెక్టర్‌తోపాటు ఆర్డీవో, తహసీల్దార్ అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇది ఇలాగే కొనసాగితే న్యాయవ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం పోతుంది. రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా ఈ పనులు జరగవు. ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ పేరున రెండెకరాల భూమిని ధరణి పోర్టల్లో చేర్చి పాస్‌బుక్ జారీ చేయడం చట్టవిరుద్ధం. 2014లో ఈ కోర్టు ఇచి్చన ఆదేశాల మేరకు రెవెన్యూ రికార్డులన్నీ నాలుగు వారాల్లో పిటిషనర్ పేరిట మార్చాలి. ఈ అక్రమాల్లో పాలు పంచుకున్న అధికారులపై విచారణ జరిపి క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. భూమిని పొందేందుకు ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ సంస్థకు రూ.5 లక్షలు జరిమానా విధిస్తున్నాం. ఆ సొమ్మును నాలుగు వారాల్లో హైకోర్టు లీగల్ సరీ్వసెస్ కమిటీలో జమ చేసి.. రిసీట్‌ను కోర్టు రిజిస్ట్రీకి సమరి్పంచాలి’ అని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment