ఆ చట్టం ఇక అమలు చేయరా? | Telangana High Court Questions State Government Over Right To Free Compulsory Education Act | Sakshi
Sakshi News home page

ఆ చట్టం ఇక అమలు చేయరా?

Published Sat, Aug 15 2020 3:16 AM | Last Updated on Sat, Aug 15 2020 3:54 AM

Telangana High Court Questions State Government Over Right To Free Compulsory Education Act - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం 2010లో తీసుకొచ్చిన ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఇప్పటికీ రాష్ట్రంలో అమలు కాకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చట్టం వచ్చి పదేళ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఈ చట్టాన్ని అమలు చేయాలంటూ 2010లో దాఖలైన పిటిషన్లకు ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్‌ దాఖలు చేస్తామంటూ ఇప్పటికే అనేకసార్లు సమయం తీసుకున్నారని, ఇదే చివరి అవకాశమని, సెప్టెంబర్‌ 4లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చే యాలని ఆదేశించింది. ‘ఉచిత నిర్బంధ విద్యా హక్కు’ అమలుకు నోచుకోవడం లేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌. చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.

ఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని, ఈ చట్టం అమలుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించి.. తర్వాత 60 శాతం నిధులను కేంద్రం నుంచి తీసుకునే అవకాశం ఉందని పిటిషనర్లు నివేదించారు. ఈ చట్టంలోని అనేక అంశాలకు సంబంధించి విచారణలో ఉన్న 10 పిటిషన్లకు కలిపి సమగ్రంగా కౌంటర్‌ దాఖలు చేస్తామని, ఇందుకు 8 వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ కోరారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం.. ఇప్పటికే పిటిషన్లు దాఖలై పదేళ్లు దాటుతోందని, ఇంకా కౌంటర్‌ దాఖలుకు సమయం కోరడం ఏంటని ప్రశ్నించింది. తదుపరి విచారణను 4కు వాయిదా వేసింది.  

10 లక్షల మందికి ప్రయోజనం చేకూరేది.. 
‘‘2010లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని ప్రైవేటు స్కూళ్లను ఆదేశిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 44 జారీ చేసింది. ఈ చట్టం సమర్థంగా అమలై ఉంటే ఇరు రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల మంది నిరుపేదలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చదువుకునే అవకాశం లభించేంది. 16 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా 29.25 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఈ చట్టం అమలును సవాల్‌ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. చట్టం అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లయినా పిటిషన్‌ దాఖలు చేయలేదు. ఈ చట్టాన్ని అమలు చేస్తే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ప్రభుత్వం వెచ్చించే డబ్బులో 60 శాతం కేంద్రం వెంటనే చెల్లిస్తుంది’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement