మీడియాతో మాట్లాడుతున్న రాజేందర్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో నదులను తమ అధీనంలోకి తీసుకోవడానికే కేంద్రం నదుల అనుసంధానానికి కుట్రలు చేస్తోందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసే పురస్కార గ్రహీత రాజేందర్‌సింగ్ ధ్వజమెత్తారు. కార్పొరేట్ కంపెనీల జేబుల్లోకి డబ్బులు నింపడం, అవినీతి, అక్రమాల కోసమే కేంద్రం నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టిందని మండిపడ్డారు. వాటర్ ప్రైవేటీకరణ, కమర్షియలైజేషన్, మార్కెటైజేషన్‌కు కుట్ర పన్ను తోందని ఆరోపించారు.
నదుల అనుసంధానంతో దేశానికి చెడు జరుగుతుందని, పర్యావరణ సమతు ల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని, అన్ని రకాలుగా ఇది ప్రజలకు తీరని నష్టాన్ని కలిగి స్తుందన్నారు. దేశంలో ఏ ఒక్క సీఎం కూడా తమ వాటా నీటిని ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు సిద్ధం గా లేరని గుర్తు చేశారు. జలసౌధలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియన్ పెని న్సులార్ రివర్ బేసిన్ కౌన్సిల్, ఇండియన్ హిమాల యన్ రివర్ బేసిన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నదులపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. నీటి మేనిఫెస్టోను సదస్సులో విడుదల చేస్తామన్నారు.
కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి
ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర రాష్ట్రాల సీఎంలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సి ఉందని రాజేందర్ అన్నారు. ఇక్కడ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలు ఇతర అన్ని రాష్ట్రాలకు అనుసరణీయమని చెప్పారు. రాష్ట్రంలో జల వర్సిటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘మిషన్ భగీరథ ద్వారా ప్రతీ గ్రామంలో పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం హర్షణీయం. తెలంగాణలో ఎక్కడా ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదు.
అందుకే జాతీయ సదస్సు కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేశాం. నదులపై అవగాహన కల్పించడానికి చేపడుతున్న ఉద్యమంలో ప్రజలూ భాగస్వాములు కావాలి’ అని ఆయన చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, మూడు చెరువుల నుంచి ఆలయానికి నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ అని కితాబునిచ్చారు. కృష్ణా, గోదావరి నదులను స్వాధీనంచేసుకోవానికి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎకరాకు సాగునీటి కోసం రూ.3–4 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వర్షం నీటిని ఒడిసి పట్టుకుంటే ఎకరాకు రూ.5వేల ఖర్చు మాత్రమే అవుతుందని ఉదహరించారు.
Comments
Please login to add a commentAdd a comment