ధ్యాన కేంద్రానికి విచ్చేసిన జనసందోహం. (ఇన్‌సెట్‌లో) దాజీ, రామ్‌దేవ్ బాబాల ఆత్మీయ ఆలింగనం
సాక్షి, హైదరాబాద్: సమాజంలో ప్రస్తుతం నెలకొన్న అశాంతి, విద్వేషపూరిత వాతావరణం నేపథ్యంలో మానవజాతి మేలు కోసం దేశంలోని యోగా, ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ ఒకే ఛత్రం కిందకు రావాల్సిన అవసరముందని శ్రీరామ చంద్ర మిషన్ గురువు కమలేశ్ పటేల్ (దాజీ) అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ధ్యానమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా గ్రామంలోని కాన్హా శాంతి వనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దాజీతోపాటు పతంజలి యోగా పీఠం అధ్యక్షుడు యోగా గురు రాందేవ్ బాబా పాల్గొన్నారు. శ్రీరామ చంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం, సంస్థ ప్రథమ గురువైన శ్రీ రామచంద్ర 147వ జన్మదినోత్సవాల నేపథ్యంలో ప్రారంభమవుతోందని సంస్థ సెక్రటరీ ఉమాశంకర్ బాజ్‌పేయి తెలిపారు.
కొత్తగా నిర్మించిన ధ్యాన కేంద్రం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని, ఏకకాలంలో లక్ష మంది వరకు ధ్యానం చేసుకునేందుకు సౌకర్యాలున్నాయని ఆయన చెప్పారు. రాజ యోగం, సహజ మార్గంలో యోగ శిక్షణ ఉంటుందని, 3 రోజుల శిక్షణతో పాటు వారానికి ఒక రోజు చొప్పున 15 వారాల కోర్సులు నిర్వహిస్తున్నామని సంస్థ జాయింట్ సెక్రటరీ చల్లగుళ్ల వంశీ వెల్లడించారు. అభ్యాసం చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లో (https://heartfulness.org) రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కాన్హా శాంతి వనానికి రావొచ్చు. ప్లేస్టోర్, ఐఫోన్ స్టోర్‌లోని హార్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇళ్లల్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment