కేంద్రం 'పైసా'చికం.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌ | Telangana IT Minister KTR Special Interview With Sakshi | Sakshi
Sakshi News home page

కేంద్రం 'పైసా'చికం.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌

Published Thu, Jun 2 2022 2:51 AM | Last Updated on Thu, Jun 2 2022 2:51 AM

Telangana IT Minister KTR Special Interview With Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌:  ‘‘ఆర్థిక ఆంక్షలు సృష్టించి తెలంగాణను దెబ్బతీయడం ద్వారా పైశాచికానందం పొందాలని కేంద్రం చూస్తోంది. రాష్ట్ర సొంత ఆదాయం వేతనాలు, సంక్షేమ పథకాలకు సరిపోతుంది. అభివృద్ధి కోసం అప్పులు చేయక తప్పదు. రాష్ట్రం అప్పులు చేయకుండా అడ్డంకులు సృష్టించి.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అవినీతి జరుగుతోందని స్వయంగా ప్రధాని మాట్లాడడం దిగజారుడుతనానికి నిదర్శనం. దమ్ముంటే ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలి. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తారు. లక్షల పరిశ్రమలు మూతపడతాయి. కానీ ఒక్క అదానీ మాత్రం ప్రపంచ కుబేరుల టాప్‌ టెన్‌లో ఉంటారు. ఇదెలా? దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలివీ.. 

సాక్షి: ఎనిమిదేళ్లలో రాష్ట్ర పురోగతి ఎలా ఉంది? 
కేటీఆర్‌: నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణలో ఈ మూడింటినీ సాధించాం. ఐటీ సహా ప్రైవేట్‌ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వపరంగా 1.32 లక్షల ఉద్యోగాలు కల్పించాం. మరో 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. ప్రతిష్టాత్మక కాళేశ్వరాన్ని పూర్తిచేశాం. మిషన్‌ భగీరథతో తాగునీరిచ్చాం. 40వేల చెరువులు బాగు చేశాం. ఒక్క అసంతృప్తి ఉంది. కేంద్రం కృష్ణా, గోదావరి జలాల పంపిణీ చేయకపోవడంతో అనుకున్న ప్రాజెక్టులు పూర్తికాలేదు. కేంద్ర నిర్లిప్తత, నిర్లక్ష్యమే దీనికి కారణం. రాష్ట్రానికి 575 టీఎంసీల నీటివాటా కావాలన్నాం. ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయాలని కోరాం. కానీ కేంద్రం పట్టించుకోలేదు. దీనితో ఇటు తెలంగాణకు అటు ఏపీకి అన్యాయం జరుగుతోంది. అయినా తెలంగాణలో 120 శాతం వ్యవసాయ విస్తరణ జరిగింది. ధాన్యాన్ని కొనలేక కేంద్రం చేతులెత్తేసింది. నిధుల విషయంలో ఆర్‌బీఐ చెప్పినట్లే దేశానికి తెలంగాణ నాలుగో ఆర్థిక చోదకశక్తి. కేంద్రానికి రాష్ట్రం 100 రూపాయలిస్తే.. తిరిగి వచ్చేది 46 రూపాయలే. తద్వారా దేశంలోని ఇతర వెనుకబడిన రాష్ట్రాలను తెలంగాణ ఆదుకుంటోంది.

గత 8 ఏళ్లలో ఏదైనా అసంతృప్తి ఉందా? 
– తెలంగాణ అద్భుతంగా పురోగతిస్తున్న తరుణంలో నోట్ల రద్దు, కోవిడ్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. నోట్ల రద్దు సమయంలో కేంద్రం చెప్పిన వాటిని నమ్మాం. కానీ తాజా ఆర్‌బీఐ లెక్కల ప్రకారం రూ.500, రూ.2000 నకిలీ నోట్లు పెరిగాయి. కేంద్రం అస్తవ్యస్థ, అనాలోచిత ఆర్థిక విధానాలు, లాక్‌డౌన్‌తో రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పైగా ఇప్పుడు కేంద్రం కక్షగట్టి, సహాయ నిరాకరణ చేస్తోంది. రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. అయినా సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తున్నాం. 
 
రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్ల విషయంగా ప్రజల్లో అసంతృప్తి లేదా? 
– అసంతృప్తి లేదంటే అది తప్పు అవుతుంది. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఇళ్లు, రుణమాఫీ హామీలు ఇచ్చాం. రుణమాఫీకి ఇప్పటికే 22వేల కోట్లు ఇచ్చాం. ప్రజలు అర్థం చేసుకోవాలి. కోవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఆదాయం తగ్గిపోయి.. ఇబ్బంది, జాప్యం జరుగుతోంది. పెన్షన్లు, ఇళ్లు ఇస్తాం. 95 శాతం హామీలు అమలు చేసినట్టు అవుతుంది. 
 
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముందే వచ్చినట్టుంది 
– రాహుల్‌గాంధీ వచ్చి వరంగల్‌లో మాట్లాడింది చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. 50ఏళ్లు వారే అధికారంలో ఉన్నారు కదా.. ఏం చేశారు. మళ్లీ ఒకసారి చాన్స్‌ అంటే ఏంటి? ఇంకో పార్టీ నేతలు తామొస్తే ఉచిత విద్య, వైద్యం ఇస్తామంటారు. ఎవరు వద్దన్నారు? దేశవ్యాప్తంగా ఇప్పుడే ఇవ్వండి. మేం పార్లమెంట్‌లో పూర్తి మద్దతిస్తాం. సన్మానాలు చేస్తాం. అలాకాకుండా మసీదులు తవ్వుదాం శవాలు వస్తే మీవి.. లింగాలు వస్తే మావి.. అంటూ మతవిద్వేషాలు రెచ్చగొట్టడం ఏమిటి? ఒకటి కులపిచ్చి, మరొకటి మతపిచ్చి పార్టీలు. మేం ప్రజలను నమ్ముకుని వెళ్తున్నాం. ఢిల్లీని, గుజరాత్‌ను నమ్ముకుని కాదు. మా బాసులు తెలంగాణ ప్రజలే. వారిపై నమ్మకం ఉంది. చిన్నచిన్న లుకలుకలు, అసంతృప్తి ఉంటే.. తప్పకుండా సరిచేసుకుంటాం. కేసీఆర్‌ను మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారు. 
 
ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అవినీతి, మూఢ నమ్మకాలు అంటున్నారు. మీ స్పందన? 
– మూఢ నమ్మకాల విషయానికొస్తే బీజేపీని మించినోళ్లు మరెవరూ లేరు. వారు రాష్ట్రానికి ఏమైనా ఇచ్చారా? ఒక విద్యాసంస్థగానీ, ప్రాజెక్టుకు జాతీయ హోదాగానీ ఇచ్చారా? ప్రజలకు చెప్పడానికి ఏమి లేకనే అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చింది గుండుసున్నా. గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌.. ఏదీ ఇవ్వలేదు. అరుపులు పెడబొబ్బలు పెడతారు. కుటుంబ పాలన అంటారు. పీయూష్‌ గోయల్, అనురాగ్‌ ఠాకూర్, జ్యోతిరాదిత్య, అమిత్‌షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శి.. వారిది కుటుంబ పాలన కాదా? మోదీ హయాంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సిలిండర్, గ్యాస్‌ ధరలు పెరిగాయి.. ఎన్నడూ లేనంత ద్వేషం, అసహనం నెలకొంది.. ఆయన సాధించినది ఇదే. కర్ణాటకలో బిల్లులు ఇవ్వాలంటే 40 శాతం కమీషన్‌ అడుగుతున్నారు. సీఎం పదవి కోసం అధిష్టానం రూ.2,500 కోట్లు అడిగిందని బీజేపీ ఎమ్మెల్యేనే చెప్పారు. అలాంటిది అవినీతి అని మాట్లాడడానికి మోదీకి సిగ్గు, ఇంగిత జ్ఞానం ఉండాలి. 
 
రుణాలకు కేంద్రం అనుమతించకుంటే ఎలా? 
– ఇక్కడ రెండు విషయాలు. 2014లో భారతదేశ అప్పు రూ.56లక్షల కోట్లు. 2023 నాటికి అది రూ.కోటీ 56 లక్షల కోట్లకు చేరనుంది. అంటే ఎనిమిదేళ్లలో రూ.కోటి లక్షల కోట్ల అప్పు చేశారు మోదీ. తెలంగాణ రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసింది. జీడీపీలో కేంద్ర అప్పుల వాటా 65 శాతం ఉంటే... తెలంగాణ జీఎస్‌డీపీలో అప్పుల వాటా 25 శాతమే. అంటే ఎవరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారో దీనిని చూస్తే అర్థమవుతోంది. ఆర్థిక క్రమశిక్షణ బాగుంది కాబట్టే మాకు రుణాలు ఇస్తున్నారు. మేం చేసిన అప్పుతో విద్యుత్‌ప్లాంట్లు, నీటి ప్రాజెక్టులు కట్టాం. మిషన్‌ భగీరథ, పారిశ్రామిక ప్రాంతాలు నిర్మించాం. రూపాయి ఖర్చు చేసి.. రూపాయిన్నర ఆదాయం చూపెడితే అది ఉత్పాదక పెట్టుబడి అవుతుంది. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టి, ప్రజల్లో అభాసుపాలు చేసి రాజకీయంగా లబ్ధిపొందాలను భావిస్తోంది. దేశంలో రాజకీయ, న్యాయవ్యవస్థలు ఉన్నాయి. అవసరమైతే వాటిని ఆశ్రయిస్తాం. 
 
కేసీఆర్‌ రెండు మూడు నెలల్లో సంచలనం అన్నారు. ఏమై ఉంటుంది? 
– తినబోతూ రుచి అడగడం ఎందుకు? ఏమిటనేది సీఎం చెప్తారు. ఎనిమిదేళ్ల తర్వాత కేంద్రం అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతుందట. ధన్యవాదాలు. ఆ సమావేశానికి వచ్చే అమిత్‌షా ఉత్త ప్రసంగం కాకుండా రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలి. లేదంటే ఈ ఎనిమిదేళ్లు గుడ్డి గుర్రం పళ్లు తోమారా అని వారిని అడగక తప్పదు. 
 
రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి చేయబోతున్నారు? 

– రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చేది లేదు. మా నాయకుడు కేసీఆర్‌ జాతీయస్థాయిలో పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏం చేయాలో ఆయన నిర్ణయిస్తారు. 
 
ఏపీతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? 
– ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో కేసీఆర్‌కు, మాకు సత్సంబంధాలే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత చిన్న సమస్యలు వచ్చినా దానికి కారణం కేంద్రమే. మేం పొరుగు రాష్ట్రాలతో మితృత్వమే కోరుకుంటున్నాం. 
 
మీరు ప్రధాని స్థాయికి ఎదుగుతారని దావోస్‌లో ప్రశంసలు వచ్చాయి. మీ అభిప్రాయం? 
– నేను మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు. అయ్యాను. ఇంతకు మించి మరే ఆశ నాకు లేదు. భవిష్యత్తుపై ఆత్రుత లేదు. 
 
విద్యుత్‌ కేంద్రాలకు విదేశీ బొగ్గుపై స్పందన? 
– ఆదానీ విదేశాల్లో బొగ్గు గనులు కొంటారు. ఇక్కడ పాలసీలో మార్పు వస్తుంది. అప్పటివరకు నష్టాల్లో ఉన్న ఆయనకు మేలు చేయడానికి విదేశీ బొగ్గు కొనాలంటున్నారు. ఇది అవినీతి కిందికి రాదా? లాభాలు వచ్చే పరిశ్రమలను తెగనమ్మేస్తున్న మోదీ.. మరీ వోడాఫోన్‌లో ఎందుకు కేంద్రంతో వాటా కొనుగోలు చేయించారు? 
 
మంత్రి మల్లారెడ్డిపై దాడి ప్రజల ఆగ్రహమా?  
– కాదు. అది రేవంత్‌రెడ్డి మనుషులు చేసిన చిల్లర ప్రయత్నం. మాది అన్నివర్గాల ప్రభుత్వం. మాకు రెడ్లు ఓట్లు వేయకుండానే గెలిచామా? మంత్రివర్గంలో ఆరుగురు, మండలి, శాసనసభ అధిపతులు రెడ్లే. ఎమ్మెల్యేల్లో 30 మంది వరకు రెడ్లు, నామినేటెడ్‌ పదవుల్లోనూ వారు యాభై శాతం. వారికి ఇవ్వనప్పుడు కదా ఆగ్రహం ఉండేది. రేవంత్‌ మనుషులు, రౌడీ మూకలు మంత్రిపై దాడికి పాల్పడ్డారు. అది ప్రభుత్వంపై ఆగ్రహం ఎలా అవుతుంది? 
 
రామగుండం ఎరువుల పరిశ్రమను ఆపుతున్నారని అభియోగం? 
– ఏ పరిశ్రమ అయినా పర్యావరణహితంగా ఉండాలి. గోదావరిలో కాలుష్యాన్ని వదులుతున్నారని, స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడం లేదని మా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. నోటీసులు ఇచ్చారు. ఉత్పత్తి ఎక్కడా ఆపలేదు. పరిశ్రమ పర్యావరణహితంగా ఉండాల్సిందే.  

తెలంగాణకు ఏమీ ఇవ్వని ప్రధానికి గౌరవం ఎందుకివ్వాలి? 
ఉత్త చేతులతో వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోయే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో భారత్‌ బయోటెక్‌ సంస్థకు ప్రధాని వచ్చినప్పుడు సీఎం రావాల్సిన అవసరం లేదన్నారు. మరిప్పుడు ఎందుకు రావాలి? ఎనిమిది సార్లు ప్రధాని వచ్చారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని ప్రధానికి తెలంగాణ ఎందుకు గౌరవం ఇవ్వాలి? సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రమణ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ తెరవగానే.. మోదీ శిఖండి మాదిరి గుజరాత్‌లో మరో కేంద్రాన్ని మంజూరు చేశారు. ఇదెక్కడి న్యాయం? ఇంత కుసంస్కారం ఉండే ప్రధాని హైదరాబాద్‌కు వస్తే ఎంత? రాకపోతే ఎంత?  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement