నేడే జాబ్‌ కేలండర్‌ | Telangana Job Calendar Released on august 02 | Sakshi
Sakshi News home page

నేడే జాబ్‌ కేలండర్‌

Published Fri, Aug 2 2024 5:12 AM | Last Updated on Fri, Aug 2 2024 7:31 AM

Telangana Job Calendar Released on august 02

అసెంబ్లీలో ప్రకటించనున్న సర్కార్‌ 

ఏటా యూపీఎస్సీ తరహాలో కేలండర్‌ తేదీల ప్రకారం ఉద్యోగ ప్రకటనలు 

గ్రూప్‌–1, 2, 3 నోటిఫికేషన్లకు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వర్తింపజేసేలా త్వరలో ఆర్డినెన్స్‌ 

అర్హులకు రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు 

విధివిధానాల ఖరారుకు ఉత్తమ్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం 

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌ పేర్లు మళ్లీ ప్రతిపాదన 

సిరాజ్, నిఖత్‌కు గ్రూప్‌–1 జాబ్స్‌.. 600 గజాల చొప్పున స్థలం 

కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తు న్న జాబ్‌ కేలండర్‌ మరికొన్ని గంటల్లో వెలువడనుంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచి్చన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభ వేదికగా జాబ్‌ కేలండర్‌ను ప్రకటించనుంది. ఇకపై ఏటా యూపీఎస్సీ తరహాలో ప్రణాళికాబద్ధంగా తేదీలవారీగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో జాబ్‌ కేలండర్‌ను ప్రకటించనున్నారు. 

సీఎం రేవంత్‌ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జాబ్‌ కేలండర్‌ సహా కొత్త రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, మూసీ నది ప్రక్షాళన, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకం తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.

మేని ఫెస్టోలో ప్రకటించిన జాబ్‌ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రకటిస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఈ అంశంపై చర్చలో ప్రతిపక్షాలు చేసే సూచనలను పరిగణనలోకి తీసుకొని తగిన మార్పులు చేసేందు కు సిద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఇప్పటికే ప్రకటించిన గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3 నోటిఫికేషన్లకు వర్తింపజేసేందుకు త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. 

త్వరలో తెల్లరేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు 
ఎన్నికల్లో ఇచి్చన మరో హామీ మేరకు త్వరలో అర్హులైన వారికి తెల్ల రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల (హెల్త్‌ ప్రొఫెల్‌ కార్డులు)ను విడివిడిగా జారీ చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. విధివిధానాలు రూపొందించి సత్వరమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం నెలలోగా నివేదిక ఇస్తుందని పొంగులేటి చెప్పారు. 

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా మళ్లీ కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌ 
గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్‌ గతంలో ప్రభుత్వానికి తిప్పిపంపడం తెలిసిందే. దీంతో వారి పేర్లనే మళ్లీ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పోస్టులకు సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 

మరికొన్ని కేబినెట్‌ నిర్ణయాలు 
⇒ కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక, వైద్య, సహకారం అందించాలి. 

⇒  షూటర్‌ ఈషా సింగ్, బాక్సర్‌ నిఖత్‌ జరీన్, టీం ఇండియా క్రికెటర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలంతోపాటు నిఖత్‌ జరీన్, సిరాజ్‌కు గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం.  

⇒ ఇటీవల విధి నిర్వహణలో మరణించిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీ రాజీవ్‌ రతన్‌ కుమారుడు హరి రతన్‌కు మున్సిపల్‌ కమిషనర్‌గా విధినిర్వహణలో మరణించిన అదనపు డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహశీల్దార్‌ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఓకే.  

⇒  2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 2007లో దివంగత సీఎం వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 437 కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోదం.  

⇒ ఖాయిలాపడిన నిజాం షుగర్స్‌ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి. మంత్రి శ్రీదర్‌బాబు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ప్రకారం రెండు విడతలుగా ఆర్థిక సాయం చేయాలి. 

⇒ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మల్లన్నసాగర్‌ నుంచి 15 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట చెరువుకు తరలించి అక్కడి నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలకు తరలించాలనే ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌. 10 టీఎంసీలను హైదరాబాద్‌ తాగునీటికి, మిగిలిన 5 టీఎంసీలను నగర పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో నింపడంతోపాటు మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీళ్లు ఉండేలా వదలాలన్న ప్రతిపాదనకు ఓకే.  

⇒  ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమరి్పంచిన నివేదికపై శుక్రవారం శాసనసభలో లఘు చర్చ నిర్వహణకు నిర్ణయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement