సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ ప్రభుత్వ విభాగాల శాఖాధిపతులతో ఈఓడీబీ ర్యాంకుల ప్రక్రియపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం కేటీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈఓడీబీ ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానం సాధించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాలకు సంబంధించి వంద శాతం సంస్కరణలు, చర్యలు పూర్తయినట్లు అధికారులు వివరించారు. ర్యాంకుల కేటాయింపుల్లో యూజర్ ఫీడ్‌బ్యాక్ (వినియోగదారుల ప్రతిస్పందన) అత్యంత కీలకమని, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందుతున్న సేవలపై పారిశ్రామికవర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం సమాచారం తీసుకుంటోందని అధికారులు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అధికారుల పనితీరుతో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తూ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. గతంలోనూ ఈఓడీబీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, త్వరలో ప్రకటించే ర్యాంకుల్లోను మొదటి స్థానం సాధించేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈఓడీబీ కేవలం ర్యాంకుల కోసమే కాదని, ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు అద్భుతమైన అవకాశంగా కేటీఆర్ పేర్కొన్నారు.
డిజిటల్ సేవలను ప్రారంభించిన మంత్రి
మేధో సంపద పరిరక్షణకు సంబంధించిన అన్ని రకాల అంశాలపైనా విద్యార్థులు, స్టార్టప్ నిర్వాహకులు, సృజనాత్మక ఆవిష్కర్తలు...ఇలా ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా రెజల్యూట్ సంస్థ భాగస్వామ్యంతో ప్రభుత్వం రూపొందించిన ‘ఐపీ బడ్డీ రచిట్’డిజిటల్ సేవలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐటీ పరిశ్రమ ప్రిన్సినల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, రెజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఎం.కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment