వైద్య సిబ్బందికి మంత్రి దామోదర సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.
డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్‌గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.
చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్‌నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.
మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment