సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి పరిశుభ్రతతో మెరిసిపోవాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులు, వైద్యులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెలవారీ పురోగతిపై సమీక్షలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, వైద్యులకు మంత్రి పలు సూచనలు చేశారు.
ఆస్పత్రిలో డైట్ మెనూ తెలుగులో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇచ్చే డైట్ మెనూ స్పష్టంగా పొందుపర్చాలని ఆదేశించారు. ఆస్పత్రిలో శానిటేషన్ పరిస్థితులు మరింత మెరుగుపడాలని, హాస్పిటల్ లోపల మాత్రమే కాకుండా కాంపౌండ్‌లోనూ పరిశుభ్రత పాటించాలన్నారు. శానిటైజేషన్, డైట్ కాంట్రాక్ట్ బిల్లులు, ఉద్యోగుల వేతనాలు సమయానుకూలంగా అందేలా చూడాలని హరీశ్ సూచించారు.
ఆలస్యమైతే ఆస్పత్రి సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఆపరేషన్ థియేటర్లను స్టెరిలైజేషన్ చేయాలని, సర్జికల్ కిట్స్ ఎన్ని అవసరమైతే అన్ని కొనుగోలు చేసి వినియోగించాలని తెలిపారు. రోగులు, రోగుల సహాయక సిబ్బంది పట్ల స్టాఫ్‌నర్సుల దురుసు వైఖరి మారాలని, ప్రేమగా, నవ్వుతూ పలకరించాలన్నారు. చికిత్సకు వచ్చిన వారినుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment