సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సామాన్యుల బాగు కోసం కృత్రిమమేధను వినియోగించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) తెలిపారు. దేశంలో మొదటగా కృత్రిమమేధ వినియోగంపై విధానపత్రం రూపొందించిన ఘనత తెలంగాణదేనని, టీ–ఎయిమ్ ద్వారా ఇప్పటికే 80కిపైగా కృత్రిమమేధ ఆధారిత స్టార్టప్‌లు పనిచేస్తుండగా టాస్క్ కార్యక్రమంలో భాగంగా 25 వేలమంది విద్యార్థులు, 4,500 మంది బోధన సిబ్బందికి ఈ అంశంపై శిక్షణ కూడా ఇప్పించామని పేర్కొన్నారు. ఈ ఏడాది రికార్డుస్థాయిలో లక్షమంది పాఠశాల విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు కూడా అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణం, ప్రమాదాల నివారణలే లక్ష్యంగా ‘ఐ–రాస్తే’, కెమెరాలు, సెన్సర్లు, లైడార్‌ల సాయంతో కార్లు, ఇతర వాహనాల రవాణా కోసం బోధ్‌యాన్, బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మజీవుల జన్యుక్రమ విశ్లేషణ ద్వారా కోవిడ్ వంటి వ్యాధులను గుర్తించడం, ప్రమాదాన్ని అంచనావేయడం, కొత్త మందులను తయారు చేయడం వంటి పనుల కోసం ‘మైక్రోల్యాబ్’ప్రాజెక్టులను కేటీఆర్ ప్రారంభించారు.
2024 నాటికి రోడ్డు ప్రమాదాలను యాభై శాతం తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుండగా, ఐ–రాస్తే వంటి టెక్నాలజీలు ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఐ–రాస్తేను తాము ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, 14 బస్సుల్లో కెమెరాలు, సెన్సర్లు అమర్చి రహదారులపై ప్రమాదాలకు అవకాశమున్న ప్రాంతాలు (బ్లాక్‌స్పాట్స్), మౌలిక సదుపాయాల్లో ఉన్న లోపాలను గుర్తించే ప్రయత్నం చేశామని, త్వరలోనే 200 బస్సుల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఏదైనా వాహనాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటే రెండు సెకన్ల ముందుగానే ఈ టెక్నాలజీ గుర్తించి అప్రమత్తం చేస్తుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ, ఇంటెల్, ఉబెర్‌ల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై ముందుకు సాగుతామన్నారు.
కృత్రిమ మేధదే భవిష్యత్తు
కృత్రిమ మేధ భవిష్యత్తులో రవాణా, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అనేక రంగాలపై గణనీయ ప్రభావం చూపుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 2035 నాటికి కృత్రిమ మేధ ద్వారా గ్రాస్ వ్యాల్యూ అడిషన్ (స్థూల జాతీయోత్పత్తితో సరిపోల్చగల ప్రమాణం)ను 1.3 శాతం పెంచుతుందని నీతిఆయోగ్ అంచనా కట్టిందని, దీని విలువ ఏకంగా రూ.76 లక్షల కోట్లని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.జె.నారాయణన్, ఇంటెల్ కంట్రీ హెడ్ నివృతి, తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులతోపాటు ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగపు ఉన్నతాధికారి రమాదేవి, ఉబెర్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం బోధ్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రహదారులను మ్యాప్ చేసే లక్ష్యంతో కెమెరాలు, లైడార్లు, సెన్సర్లతో కూడిన బోధ్‌యాన్ కారును కేటీఆర్ ఆసక్తిగా పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment