సిరిసిల్ల: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంపదను సృష్టిస్తున్నామని, తిరిగి ఆ సంపదను పేదలకు పంచుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఆయన సోమవారం ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పుడు భూముల ధరలు ఎంత ఉన్నాయని, ఇప్పుడు ఎంత ఉన్నాయో తేడాను ప్రజలు గమనించాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు రైతుబంధు ఇవ్వడంతోనే భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 13,117 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఏటా విద్యుత్ కొనుగోలుకు రూ. 10 వేల కోట్లు వెచి్చస్తున్నామని... రూ. 50 వేల కోట్లు వెచ్చించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నామన్నారు.
రూ. 200 నుంచి రూ. 2,016కు పెన్షన్ పెంచాం..
పేదరికమే గీటురాయిగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఒకప్పుడు రూ. 200గా ఉన్న పెన్షన్‌ను రూ. 2,016కు పెంచామని గుర్తుచేశారు. తెలంగాణలో ఉన్న సౌకర్యాలు ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. ఏ ఊరికి వెళ్లినా వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇలా ఎక్కడాలేని సౌలత్‌లు కలి్పంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. నిత్యం తమ ప్రభుత్వాన్ని నిందించే ప్రతిపక్షాలకు చెందిన నాయకులకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు అందిస్తామన్నారు. అర్హులందరికీ డబ్బులిస్తామని కేటీఆర్ తెలిపారు.
అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ...
దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ్యాంగంలో నాడు ఆరి్టకల్–3ని పొందుపరచడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కంటివెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడని కొనియాడారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబాలేమైనా ఉంటే ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయాన్ని ఆయా కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రాష్ట్ర పవర్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మన ఎంపీ సక్కంగ లేడు...
మన ఎంపీ (కరీంనగర్) బండి సంజయ్ సక్కంగ లేడని, ఆయన సక్కంగ ఉంటే ఇప్పటికే సిరిసిల్ల జిల్లాకు రైలు సౌకర్యం వచ్చేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయన హిందూ, ముస్లింల చిచ్చుపెట్టేలా మసీదులను కూలుస్తామని చెప్పడంతోపాటు పేపర్ లీక్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే ఈపాటికి జిల్లాకు రైలు వచ్చేదన్నారు.
చదవండి: సుప్రీంకు వెళితే తప్ప బిల్లులు పాస్ చేయరా?
Comments
Please login to add a commentAdd a comment